కెరీర్ విషయంలో ఈ సలహాలిస్తున్నారా?

పాఠశాల దశలో విద్యార్థులను ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్‌?’ అని అడిగితే డాక్టర్, ఇంజినీర్, లాయర్‌, టీచర్.. ఇలా తమకు ఆసక్తి ఉన్న రంగం గురించి చెబుతారు. కానీ, వయసు పెరిగే కొద్దీ కొంతమంది అభిరుచులు కూడా మారుతుంటాయి.

Published : 12 Dec 2023 21:06 IST

పాఠశాల దశలో విద్యార్థులను ‘పెద్దయ్యాక నువ్వు ఏమవుతావ్‌?’ అని అడిగితే డాక్టర్, ఇంజినీర్, లాయర్‌, టీచర్.. ఇలా తమకు ఆసక్తి ఉన్న రంగం గురించి చెబుతారు. కానీ, వయసు పెరిగే కొద్దీ కొంతమంది అభిరుచులు కూడా మారుతుంటాయి. దీంతో చాలామంది విద్యార్థులు వారి ముందున్న ఆప్షన్స్‌లో ఏది ఎంచుకోవాలో తెలియక తర్జనభర్జన పడుతుంటారు. ఈ క్రమంలో తల్లిదండ్రులుగా పిల్లల కెరీర్‌లో ఎలా సహాయపడాలో తెలుసుకుందాం రండి..

ఆసక్తిని గుర్తించండి!

ఆర్థికంగా, వ్యక్తిగతంగా.. ఇలా కారణమేదైనా కొంతమంది తమ లక్ష్యాలను చేరుకోలేకపోతారు. అయినా వాటిని తమ పిల్లలు సాధించాలని తపన పడుతుంటారు కొందరు తల్లిదండ్రులు. దాంతో, అనుకోకుండానే పిల్లలపై ఒత్తిడి పడుతుంది. కాబట్టి, పిల్లలు తమ లక్ష్యాలను ఎంచుకునే క్రమంలో మీ వ్యక్తిగత ఆసక్తులు, అభిరుచుల్ని పక్కన పెట్టి వారికి పూర్తి స్వేచ్ఛనివ్వండి. స్కూల్‌ దశ నుంచే వారు ఏయే అంశాలపై మక్కువ చూపుతున్నారో గమనించండి. ప్రముఖుల పుస్తకాలను చదివేలా ప్రోత్సహించండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కెరీర్‌పై ఓ స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. దాన్ని బట్టి కెరీర్ విషయంలో నిర్ణయం తీసుకోవడం వారికి సులభమవుతుంది.

అవగాహన పెంచుకోవడానికి..

కొంతమంది ఒక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుని కొన్ని రోజుల తర్వాత మరో రంగంలోకి మారుతుంటారు. దీనికి కారణం మొదట వాళ్లు ఎంచుకున్న రంగంపై సమగ్ర అవగాహన లేకపోవడమే. కాబట్టి, వారు ఎంచుకున్న రంగం తాత్కాలికమే అయినప్పుడు అందులో పార్ట్‌టైం ఉద్యోగాలు చేయమని సలహా ఇవ్వండి. అలాగే కొన్ని సంస్థలు ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశాన్ని కల్పిస్తుంటాయి. ఇంటర్న్‌షిప్‌, పార్ట్‌టైం జాబ్‌.. ఏది చేసినా చదువుకుంటూనే ఆసక్తి ఉన్న కెరీర్‌పై పట్టు సాధించవచ్చు. వీటికోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండానే ఆన్‌లైన్‌లోనే ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ దిశగా కూడా ప్రయత్నించమని పిల్లలకు సూచించచ్చు.

అవి ముఖ్యం కాదు!

మనం ఏదైనా కెరీర్‌ ఎంచుకున్నామంటే అందులో జీతం, సంతృప్తి, ఉద్యోగ భద్రత.. ఇలాంటి ఎన్నో అంశాల్ని పరిశీలిస్తాం. అయితే ఈ పద్ధతి అన్ని రంగాల్లో సాధ్యపడదు. కొన్ని సందర్భాల్లో ఎంచుకున్న కెరీర్‌ మంచిదైనా ఆ సమయంలో డిమాండ్‌ ఎక్కువగా ఉండకపోవచ్చు. కాబట్టి, కెరీర్‌ విషయంలో పిల్లల అభిరుచిని మాత్రమే పరిగణనలోకి తీసుకోండి. అలాగే కెరీర్‌ ఎంచుకోవడానికి వారికి వీలైనంత సమయం ఇవ్వండి. ఈ సమయంలో వారు నేర్చుకునే ప్రతీ అంశం వారికి ఒక అనుభవ పాఠమవుతుంది. అది వారి కెరీర్‌ అభివృద్ధికి దోహదం చేస్తుంది.

కెరీర్‌ ఫెయిర్స్‌ ప్రయోజనకరం!

ఈ రోజుల్లో చాలా సంస్థలు కెరీర్‌ ఫెయిర్ వంటివి నిర్వహిస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాల వల్ల పిల్లలకు కెరీర్‌కు సంబంధించిన బోలెడంత సమాచారం ఒకే వేదికపై లభిస్తుంది. కెరీర్‌కు సంబంధించి వివిధ రంగాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో ఎలాంటి రంగాలకు ప్రాధాన్యముంటుంది? అనే విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా అక్కడికి మీ పిల్లలను తీసుకెళ్లండి. అలాగే ఆన్‌లైన్‌లో కూడా కెరీర్‌ గైడెన్స్‌కి సంబంధించిన వీడియోలు, నిపుణుల సలహాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యేలా పిల్లల్ని ప్రోత్సహించడమూ ముఖ్యమే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్