అమ్మానాన్నల్ని అలా వదిలేస్తే మనం మనుషులమేనా?

కన్నపిల్లల పైనే ప్రతి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.. ప్రేమానురాగాలు పెంచుకుంటారు.. కానీ ఆ పిల్లలు తమ జీవితాల్లో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తే?? ఆ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో నాకు తెలుసు అంటోంది హరిణి.

Published : 01 Feb 2022 19:46 IST

కన్నపిల్లల పైనే ప్రతి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.. ప్రేమానురాగాలు పెంచుకుంటారు.. కానీ ఆ పిల్లలు తమ జీవితాల్లో స్థిరపడిన తర్వాత తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తే?? ఆ బాధ ఎంత వర్ణనాతీతంగా ఉంటుందో నాకు తెలుసు అంటోంది హరిణి.

నా పేరు హరిణి. ప్రస్తుతం ఒక ఎమ్మెన్సీలో జాబ్ చేస్తున్నాను. మాది చెన్నై. అమ్మానాన్నకి నేను, అక్క ఇద్దరం సంతానం. మా చిన్నప్పుడు వీధిలోనే పిల్లలందరం కలిసి రకరకాల ఆటలు ఆడుకునే వాళ్లం. ఆ సమయంలో మేమెప్పుడైనా పెద్దపెద్దగా అరిచినా, గోల చేసినా ఆ వీధిలోనే ఉంటున్న ఒక పెద్దాయన మమ్మల్నందరినీ గదమాయిస్తూ ఉండేవాడు. మా అందరికీ ఆయనంటే చాలా కోపం వచ్చేది. ఎందుకంటే మేము ఆడుకునేటప్పుడు చాలాసార్లు బంతి వాళ్లింట్లో పడేది. కేవలం బంతి మాత్రమే కాదు.. షటిల్ కాక్స్ కూడా! అయితే వాటిలో ఏ ఒక్కటీ ఆయన మాకు తిరిగి ఇచ్చింది లేదు. అందుకే ఆయనంటే మా అందరికీ కోపం.

*****

ఆయన ఎవరు? ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు?? ఎందుకు ఆయన మా అందరినీ గదమాయిస్తూ ఉంటాడు.. అనే విషయాలేవీ మాకు తెలియదు. ఎప్పుడైనా మేము ఆడుకుంటున్న సమయంలో ఆయన రోడ్డు మీద నుంచి వెళ్తున్నా పట్టించుకునేవాళ్లం కాదు. ఓసారి అలా మేం అంతా ఆడుకుంటున్నప్పుడు ఆ పెద్దాయన రోడ్డు మీదకి వచ్చాడు. అయితే ఆయన వెనుకవైపు నుంచి ఒక కారు కూడా వస్తోంది. అది చూసిన మేము ఆయన్ని హెచ్చరించే లోపే కారు ఆయన్ని గుద్ది వెళ్లిపోయింది. అంతా క్షణాల్లో జరిగిపోయింది. వెంటనే ఆ దగ్గర్లో ఉన్న కొందరు స్థానికులు వచ్చి ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పుడూ ఆయనంటే కోపంతో రగిలిపోయే నాకు ఈసారి మాత్రం ఎందుకో ఆయనకి ఏమైందో అని భయం వేసింది. దాంతో హాస్పిటల్‌కి వెడితే అప్పటికి ఆయన స్పృహలో లేరు. వెన్నెముకకి దెబ్బతగలడం వల్ల లేచి కూర్చోలేరని, గాయాల నుంచి తేరుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అక్కడున్న నర్సు చెప్పింది.

నర్సు ఆయన్ని లేపడానికి ప్రయత్నించగా నేనే వద్దని చెప్పా. అప్పటి వరకు స్పృహలో లేని పెద్దాయన నా గొంతు వినిపించిన తర్వాత కళ్లు తెరిచారు. మా అమ్మ ఆయనతో మాట్లాడి, మేం తీసుకెళ్లిన పళ్లు ఇచ్చి జాగ్రత్తలు చెప్పింది. ఆ తర్వాత ఆయన నన్ను పిలవడంతో నేనూ దగ్గరకెళ్లా. ఏం అంటారో అని భయపడిన నాకు 'మీ బాల్స్, కాక్స్.. అన్నీ లివింగ్ రూమ్‌లో ఉన్న ఒక డ్రాలో ఉన్నాయి.. తీసుకోండి.. ఆడుకోండి.. నచ్చినట్లు ఎంజాయ్ చేయండి.. మీ సంతోషం, మీ భవిష్యత్తు మీకు ముఖ్యమే.. కానీ జీవితంలో స్థిరపడ్డాక అమ్మానాన్నల్ని చక్కగా చూసుకోవాలి.. గాలికి వదిలేయద్దు..' అంటూ మళ్లీ స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఎందుకు అలా చెప్పారా అని నేను చాలాసేపు ఆలోచించా.

అది గమనించిన మా అమ్మ 'ఆయన పేరు షణ్ముఖరావు. ఆర్మీలో పని చేసి రిటైరయ్యారు. ఏడాది క్రితమే అతని భార్య కూడా అనారోగ్యం కారణంగా చనిపోయింది. వారికి ఒక కొడుకు. విదేశాల్లో స్థిరపడ్డాడు. రెండు లేదా మూడేళ్లకోసారి ఇక్కడికి చుట్టపుచూపుగా వచ్చి వెళ్తుండేవాడు. గతేడాది వాళ్ల అమ్మ బతికి ఉన్నంత వరకు అంతో ఇంతో డబ్బు పంపిస్తూ ఉండేవాడు. దానికి తోడు ప్రభుత్వం అందించే పెన్షన్‌తో కాలం నెట్టుకొచ్చేవారు. ఆమె చనిపోయిన తర్వాత అతడు డబ్బు పంపించడం లేదు సరికదా.. ఈయనతో పూర్తిగా మాట్లాడడం కూడా మానేశాడట! అందుకే ఆయన ఎప్పుడూ విచారంగా కనిపించేవారు. ఆయన కొడుకు మీద ఉన్న కోపాన్ని వీధిలో పిల్లల మీద అప్పుడప్పుడూ చూపించేవారు..' అంటూ చెప్పేసరికి నాకు తెలియకుండానే నా కళ్ల నుంచి నీళ్లు వచ్చేశాయి..

*****

వారం రోజుల తర్వాత ఆ పెద్దాయన హాస్పిటల్‌లోనే చనిపోవడంతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి విదేశాల్లో ఉన్న కొడుకు ఇక్కడికి వచ్చాడు. కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఇక్కడ వారికి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి తిరిగి విదేశాలకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆ ఇంట్లో వేరే కుటుంబం నివసిస్తోంది. కానీ నేను వీధిలో ఎప్పుడు అడుగుపెట్టినా లేదా ఆ ఇంటివైపు ఎప్పుడు చూసినా ఇప్పటికీ ఆయనే నా కళ్ల ముందు మెదులుతారు. హాస్పిటల్‌లో ఆయన చెప్పిన మాటలే నా చెవుల్లో ఇంకా మార్మోగుతుంటాయి. ఆయన గుండెల్లో ఎంత బాధ గూడుకట్టుకొని ఉండకపోతే 'అమ్మానాన్నల్ని గాలికి వదిలేయొద్దు..' అంటూ నాకు చెప్పి ఉంటారు.. నిజమే.. ఈరోజుల్లో ఎగరడానికి సరిపడా శక్తి వచ్చేంత వరకు తల్లిదండ్రుల పైనే ఆధారపడుతున్న పిల్లలు, రెక్కలు వచ్చిన తర్వాత మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్లి తల్లిదండ్రులనే మరిచిపోతున్నారు. లేదా నామమాత్రంగా పలకరిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? వారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు దగ్గరుండి చూసుకోవడం, వృద్ధాప్యంలో వారికి ఆసరాగా నిలవడం.. వంటివి చేయకపోతే ఇంకెందుకు ఆ జీవితం..?

నా కళ్ల ముందు జరిగిన ఒక ఘటనతో నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడమే కాదు.. ఆ వయసులో అనాథలుగా మారిన వారిని అక్కున చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం నేను ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాను. ఇదంతా మీతో ఎందుకు చెప్తున్నా అంటే.. పెద్దలు పిల్లల నుంచి ఏమీ ఆశించరు. కాస్త ప్రేమ, అనురాగం తప్ప. వయసు మళ్లిన తర్వాత వారి సంరక్షణ బాధ్యతలను పిల్లలుగా మనం కాకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పండి?? కాబట్టి ఆ దశలో వారిని మనం కంటికి రెప్పలా కాచుకుందాం.. మనకి జన్మనిచ్చినందుకు వారి రుణం కొంతైనా తీర్చుకుందాం..!
ఇట్లు,
హరిణి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్