Premature Babies: ఆ పాపాయిల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?

కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఫలితంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు అధికంగా ఉంటున్నాయి. నెలసరి క్రమం తప్పడం, పీసీఓఎస్‌, సంతాన లేమి.. వంటి సమస్యలు ఇందులో భాగమే. వీటికి తోడు ఈ రోజుల్లో చాలామంది....

Updated : 19 Apr 2022 18:15 IST

కాలం మారుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఫలితంగా కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ మార్పులు అధికంగా ఉంటున్నాయి. నెలసరి క్రమం తప్పడం, పీసీఓఎస్‌, సంతాన లేమి.. వంటి సమస్యలు ఇందులో భాగమే. వీటికి తోడు ఈ రోజుల్లో చాలామంది గర్భిణీలు నెలలు నిండక ముందే ప్రసవిస్తున్నారు. ఫలితంగా వారు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లల విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. మరి ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందామా...

కంగారూ కేర్...

నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టడం మనకు తెలిసిందే! అయితే పాత కాలంలో ఇంక్యుబేటర్‌లు లేనప్పుడు ఇలాంటి నవజాత శిశువుల్ని సంరక్షించడానికి ‘కంగారూ మదర్‌ కేర్‌’ పద్ధతిని పాటించేవారు. ఇప్పుడు కూడా కొన్ని ఆసుపత్రుల్లో ఈ పద్ధతి గురించి తల్లులకు వివరిస్తుంటారు. దీనిలో భాగంగా కంగారూ తన పిల్లల్ని ఎలాగైతే తన పాకెట్‌లో దాచుకుంటుందో.. అలాగే తల్లి కూడా తన ఛాతీకి హత్తుకునేలా బుజ్జాయిని పడుకోబెడతారు. దీనివల్ల పాపాయి శరీరం వెచ్చగా ఉండడంతో పాటు వారిలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పద్ధతి పాపాయిలకే కాదు.. తల్లి పాలు పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని ఇంటికెళ్లిన తర్వాత కూడా పాటిస్తే పాపాయికి అనారోగ్యాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

మంచి నిద్ర కోసం..

నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు సాధారణ పిల్లల కంటే రాత్రుళ్లు ఎక్కువ సార్లు ఆకలికి లేస్తుంటారు. కాబట్టి, వారికి తరచుగా పాలు పడుతుండాలి. ఈ సమయంలో వారు ఎక్కువగా నిద్ర పోతుంటారు. కాబట్టి, చుట్టూ దానికి అనుకూలమైన వాతావరణం ఉండేట్టు చూసుకోవాలి. దీనికోసం బెడ్ మెత్తగా, సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే గదిలోని వెలుతురు డిమ్‌గా ఉంచాలి. ఒకవేళ అవసరం అయితే పాపాయి చుట్టూ దోమ తెరను కప్పి ఉంచాలి. సాధారణంగా డాక్టర్లు డైపర్లను తక్కువగా ఉపయోగించమని చెబుతుంటారు. కాబట్టి, నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు రాత్రుళ్లు మాత్రమే డైపర్లను ఉపయోగించండి.

రోజూ వద్దు..

సాధారణంగా నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలు తక్కువ బరువు కలిగి ఉంటారు. కాబట్టి వారి శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం వారికి రోజూ స్నానం చేయించకూడదు. బదులుగా వారికి స్పాంజ్‌ బాత్‌ చేయించాలి. ఇందులో భాగంగా పొడి బట్టను నీళ్లలో ముంచి పాపాయి శరీరాన్ని తుడవాలి. ఈ క్రమంలో నీళ్లలో ఎలాంటి క్లీనర్లను వేయకూడదు. ఒక నెల వరకు ఎలాంటి లోషన్లు, ఆయిల్స్‌ వాడకపోవడమే మంచిది. చిన్నారి బట్టలు, దుప్పట్లను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి.

ఇవి వాడద్దు..

పసి పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వారికి కాజల్‌ వంటి కాస్మెటిక్స్‌ని ఉపయోగించకపోవడమే మంచిది. ఇవి వాడడం వల్ల కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే పెర్‌ఫ్యూమ్స్‌ వాడడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పాపాయిని చూడడానికి వచ్చే అతిథుల వల్ల కూడా అనుకోకుండా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వారిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి. ఒకవేళ దగ్గరి బంధువులైతే పాపాయిని పట్టుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోమని సూచించండి.

బర్పింగ్ చేయాలి...

చిన్నారులకు అజీర్తి వంటి జీర్ణ సంబంధ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఈ క్రమంలో- తల్లిపాలు పట్టేటప్పుడు చిన్నారి తల కొంచెం పైకి ఉండేట్టుగా జాగ్రత్త తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు సులభంగా జీర్ణమవుతాయి. అలాగే పాలు పట్టిన తర్వాత పాపాయి వీపును నిమురుతుండాలి. ఇలా చేయడం వల్ల పాపాయి పీల్చిన గాలిని తేన్పు రూపంలో బయటకు వదులుతుంటుంది. ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

ఆరు నెలల వరకు వద్దు...

నెలలు నిండక ముందు జన్మించిన పిల్లల్లో ప్రయాణాలు చేసేటప్పుడు రిఫ్లక్స్‌ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పాపాయి పుట్టిన మొదటి ఆరు నెలల వరకు ఎలాంటి ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. ఇక పాపాయి కోసం ఒక థర్మామీటర్‌, నెబ్యులైజర్‌ని పక్కన పెట్టుకోవడాన్ని మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్