Alimony: విడాకులు తీసుకున్నప్పుడు భరణం ఎందుకు వద్దంటున్నారు?

వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకునే క్రమంలో భర్త నుంచి భార్యకు నగదు/ఆస్తుల రూపంలో ఎంతో కొంత భరణంగా దక్కడం మనకు తెలిసిందే! అప్పటిదాకా వెన్నంటే ఉండి తన బాధ్యతల్ని చూసుకున్న భర్త.. ఇకపై తన వెంట లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకూడదన్నది దీని ముఖ్యోద్దేశం.

Published : 07 Oct 2021 19:44 IST

వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకునే క్రమంలో భర్త నుంచి భార్యకు నగదు/ఆస్తుల రూపంలో ఎంతో కొంత భరణంగా దక్కడం మనకు తెలిసిందే! అప్పటిదాకా వెన్నంటే ఉండి తన బాధ్యతల్ని చూసుకున్న భర్త.. ఇకపై తన వెంట లేకపోయినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకాకూడదన్నది దీని ముఖ్యోద్దేశం. ఏదేమైనా ఈ రోజుల్లో దీన్ని తిరస్కరించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోందంటున్నారు న్యాయ నిపుణులు.

ఇటీవలే నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించిన సమంత కూడా రూ. 200 కోట్ల భరణాన్ని తిరస్కరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వీళ్లిద్దరి నుంచీ ఎక్కడా వెలువడలేదు. గతంలో మెకంజీ కూడా తనకు భరణం కింద దక్కిన సుమారు 2.49 లక్షల కోట్ల సంపదను జెఫ్‌కే వదిలేయడం మనకు తెలిసిందే! మరి, చట్టరీత్యా, హక్కు పరంగా తమకు దక్కాల్సిన భరణాన్ని చాలామంది మహిళలు ఎందుకు తిరస్కరిస్తున్నారు? అంటే.. అందుకు పలు కారణాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

స్వతంత్రంగా బతకగలం!

పాత కాలంలో అయితే భార్యలు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యే వారు. దీంతో సంపాదన లేక ప్రతిదానికీ భర్త పైనే ఆధారపడాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఒకవేళ భర్త నుంచి విడాకులు తీసుకోవాల్సి వస్తే.. భవిష్యత్తులో తనకు, తన పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఎంతో కొంత భరణం కింద ఇచ్చేవారు. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. అయితే ఈ కాలంలో భర్తతో సమానంగా భార్యలూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. స్వయం సంపాదనతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.. పిల్లల బాధ్యతనూ పూర్తిగా తమ భుజాలపై వేసుకునే భార్యలూ లేకపోలేదు. మహిళల్లో ఉన్న ఇలాంటి ఆర్థిక స్వతంత్రతే భరణాన్ని తిరస్కరించేలా చేస్తోందని చెబుతున్నారు నిపుణులు. తద్వారా భర్తతో విడాకులు తీసుకున్నా ఆర్థికంగా తమను తాము పోషించుకోగలం, పిల్లల్నీ చూసుకోగలం అన్న ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తుందంటున్నారు.

అలాంటి డబ్బు మాకొద్దు!

భార్యాభర్తలు విడిపోయేదాకా వచ్చారంటే వాళ్ల మధ్య పెద్ద గొడవలైనా జరిగుండాలి.. లేదంటే ఒకరి ప్రవర్తనతో మరొకరు విసుగెత్తైనా ఉండాలి. ఈ క్రమంలో పలు అంశాలు కారణం కావచ్చు. ఉదాహరణకు.. భర్త చేసే తప్పుడు వ్యాపారం, దానివల్ల వచ్చే అక్రమ సంపాదన భార్యకు నచ్చక ఇద్దరూ విడాకులు తీసుకోవచ్చు. ఇలాంటప్పుడు తనకు భరణంగా వచ్చే డబ్బు కూడా చట్ట విరుద్ధంగా సంపాదించిన మొత్తమే అయి ఉండచ్చు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా భార్యలు భరణాన్ని తిరస్కరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. తద్వారా ఇందులో తన ప్రమేయం లేకపోయినా అసలు తప్పు బయటపడ్డప్పుడు తనకు, తన పిల్లలకు సమస్యలొచ్చే ప్రమాదం ఉంటుందన్న భార్య ఆలోచన కావచ్చు.. లేదంటే ఇలాంటి పాపిష్టి సొమ్ము మాకొద్దన్న ఉద్దేశం కావచ్చు.. ఇలా ఇందుకు పలు కారణాలుండచ్చని వారు చెబుతున్నారు.

భర్త చేతిలో మోసపోతే..

మోసం, నమ్మకం కోల్పోవడం.. వంటివి కూడా చాలామంది భార్యాభర్తల్ని విడాకుల కోసం కోర్టు మెట్లెక్కేలా చేస్తున్నాయంటున్నారు నిపుణులు. అయితే ఇలా తమ భర్తల చేతిలో మోసపోయిన భార్యలు కూడా భరణాన్ని తిరస్కరిస్తున్నట్లు పలు కేసుల్లో చూస్తున్నామంటున్నారు. నిజానికి ఇలాంటి డబ్బు స్వీకరిస్తే తమను తామే మోసం చేసుకున్నట్లవుతుందని చాలామంది భార్యలు చెబుతున్నారట! మరికొంతమంది జీవితాంతం అపరాధ భావనతో బాధపడాల్సి వస్తుందని, అందుకే దాని బదులు ఆ డబ్బు పుచ్చుకోకపోవడమే ఉత్తమం అంటున్నారట!

నీకు-నాకు ఎలాంటి సంబంధం లేదు!

విడాకులంటేనే భార్యాభర్తల మధ్య సంబంధం పూర్తిగా తెగిపోవడం. అంటే.. ఇకపై ఎవరి జీవితం వారిదన్నది దీని అర్థం. అలాంటప్పుడు భర్త దగ్గర్నుంచి భరణాన్ని పుచ్చుకుంటే ఇకపైనా అతడు తనతోనే ఉన్నట్లనిపిస్తుంటుందని, ‘నా డబ్బుతోనే నా మాజీ భార్య బతుకుతోందన్న’ అహంభావం కూడా అతని మనసులో కలిగే అవకాశం ఉంటుందని, అది తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని కొందరు భార్యలు అభిప్రాయపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మనోవర్తిని తిరస్కరించడానికి ఇదీ ఓ కారణమే అని కొన్ని కేసుల్ని బట్టి తెలుస్తోందని వారంటున్నారు.

ఇవి కూడా!

* హిందూ వివాహ చట్టం 1955 ప్రకారం విడాకుల తర్వాత భార్య మళ్లీ పెళ్లి చేసుకుంటే భర్త నెలనెలా చెల్లించే భరణాన్ని ఆపేయచ్చు. అయితే ఈ విషయంలో ముందే ఓ నిర్ణయానికొచ్చిన మహిళలు కూడా భర్త నుంచి వచ్చే భరణాన్ని తిరస్కరిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

* కొన్ని కేసుల్లో భార్యకు ఇష్టం లేకపోయినా పలు ఒత్తిళ్ల వల్ల విడాకులు మంజూరు కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో అప్పటికే ఓడిపోయినట్లుగా తమను తాము భావించే మహిళలు కూడా మాజీ భర్తపై కోపంతో భరణాన్ని వద్దంటున్నారట!

ఏదేమైనా మహిళలు తమ ఆత్మవిశ్వాసం దెబ్బతినకుండా, ఆత్మగౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మనోవర్తిని వద్దంటున్నారన్నది నిపుణుల మాట! మరి, ఈ విషయంలో మీ స్పందనేంటి? మహిళలు భరణాన్ని తిరస్కరించడానికి ఇంకా ఎలాంటి కారణాలున్నాయంటారు? మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్