విదేశాల్లో చదవాలన్న నా కల ఇలా నిజమైంది..
close
Updated : 01/12/2021 18:54 IST

విదేశాల్లో చదవాలన్న నా కల ఇలా నిజమైంది..!

(Photo: Instagram)

త్వరగా జీవితంలో స్థిరపడి తమ కాళ్లపై తాము నిలబడాలనుకొనే అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో సమాజం పెట్టే లేనిపోని ఆంక్షలు, కట్టుబాట్లను కాదని తమను తాము నిరూపించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే కేరళ మలప్పురంకు చెందిన రీమా షాజీ. చిన్నతనం నుంచి విదేశాల్లో చదువుకోవాలని ఆశ పడ్డ ఆమెకు.. పెళ్లి పేరుతో ఈ సమాజం అడ్డుపడాలనుకుంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా రీమా తన పని తాను చేసుకుపోయింది. చదువుపైనే మనసు లగ్నం చేసింది. ఫలితంగా ‘US Global Undergraduate (UGRAD) Exchange Program’ కు ఎంపికైంది. తద్వారా తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. ఎవరేమనుకున్నా అన్నింటా అమ్మే నాకు తోడుగా నిలిచిందంటోన్న రీమా తన గురించి, తన లక్ష్యం గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం రండి..

విదేశాల్లో పైచదువులు చదవాలనేది ఎంతోమంది అమ్మాయిల కల. కేరళలోని మలప్పురానికి చెందిన రీమా షాజీ కూడా అమెరికాలో పైచదువులు చదువుకోవాలని కలలు కంది. ఎవరిపైనా ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. అదే తన జీవితాశయంగా పెట్టుకుంది. కానీ సమాజపు కట్టుబాట్లు ఆమె లక్ష్యానికి అడ్డుపడాలనుకున్నాయి. ఈ క్రమంలోనే తన చుట్టూ ఉన్న వాళ్లంతా.. ‘విదేశాలకు వెళ్లాలంటే ముందు పెళ్లి చేసుకో.. ఆ తర్వాత నీ భర్త అంగీకారం మేరకు నీకు నచ్చిన చోట చదువుకో..’ అన్నారు. కానీ చదువును మధ్యలో ఆపి పెళ్లి చేసుకోవడానికి రీమా మనసు అంగీకరించలేదు.

అమ్మ అండతో..!

అందుకే సమాజపు కట్టుబాట్లను కాదని చదువు కొనసాగించడానికే నిర్ణయించుకుందామె. ఈ క్రమంలో తన తల్లి తనకు పూర్తి అండగా నిలిచిందంటోంది రీమా. ‘నాన్న చనిపోయాక కుటుంబ భారమంతా అమ్మపైనే పడింది. అయినా ఆ కష్టం తెలియకుండా నన్ను, నా సోదరిని చదివిస్తోంది. విదేశాలకు వెళ్లి పైచదువులు చదవాలనేది నా చిన్ననాటి కల. కానీ అందరూ పెళ్లి చేసుకున్నాక భర్తతో కలిసి వెళ్లమని సలహా ఇచ్చారు. ఈ సమయంలోనూ అమ్మ నన్నే సపోర్ట్‌ చేసింది. దాంతో వాళ్ల మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగా. ప్రస్తుతం కుట్టిపురం MES ఇంజినీరింగ్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బీటెక్‌ చదువుతున్నా. ఇక తాజాగా ‘US Global Undergraduate (UGRAD) Exchange Program’ కు ఎంపికవడంతో విదేశాలకు వెళ్లాలన్న నా కల త్వరలోనే నెరవేరబోతోంది..’ అంటూ సంబరపడిపోతోంది రీమా.

విమర్శించిన వారే గర్వపడుతున్నారు!

స్కాలర్‌షిప్‌ ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో తనదైన సమాధానంతో ప్యానల్‌ను ఆకట్టుకుందీ కేరళ అమ్మాయి. ‘ప్యానల్‌ సభ్యులు.. ‘ఈ ప్రోగ్రామ్‌ కోసం మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి?’ అనే ప్రశ్న నన్ను అడిగారు. దీనికి నేను.. ‘నాలాంటి ఎందరో అమ్మాయిలకు నేను స్ఫూర్తి కావాలనుకుంటున్నాను. యూఎస్‌ నుంచి తిరిగొచ్చాక అక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను ఇక్కడి విద్యార్థులకు పంచుతాను.. వారు తమ కలల్ని నెరవేర్చుకునే దిశగా నా వంతు ప్రయత్నం చేస్తాను..’ అంటూ సమాధానమిచ్చా.. ఇక నేను ఈ ప్రోగ్రామ్‌కి ఎంపికవడంతో.. ఒకప్పుడు పెళ్లి చేసుకోమని నన్ను బలవంత పెట్టిన వారే ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతున్నారు.. శెభాష్‌ అంటూ వెన్నుతడుతున్నారు..’ అంటోంది రీమా.

అసలేంటీ కార్యక్రమం?

UGRAD ప్రోగ్రామ్‌ కోసం మన దేశం నుంచి ఎంపికైన ఐదుగురిలో రీమా ఒకరు. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరిలో తన ఐదో సెమిస్టర్‌ కోసం లూసియానాలోని McNeese State University కి వెళ్లనుందామె. వివిధ దేశాల నుంచి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే ఇంజినీరింగ్‌ విద్యార్థుల్ని ఒక్క చోట చేర్చి వారికి ఉన్నత విద్యతో పాటు స్కాలర్‌షిప్‌ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. దీనికోసం ఎంపికైన విద్యార్థులకు ఉచిత ప్రయాణ ఖర్చులతో పాటు భోజనం, వసతి, ట్యూషన్‌ ఫీజు.. వంటివన్నీ స్కాలర్‌షిప్‌ కిందే కవరవుతాయి. అలాగే నెలనెలా కొంత మొత్తం స్టైపెండ్‌ కింద అందించనున్నారు.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని