Published : 10/01/2022 21:49 IST

ఆ సంఘటనే ఈ అమ్మాయిని మార్చేసింది..!

(Photo: Instagram)

కొంతమంది వయసుకు మించిన ఆలోచనలు చేస్తుంటారు.. చుట్టూ ఉన్న సమస్యల నుంచి స్ఫూర్తి పొంది సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలని తహతహలాడుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని జలాలాబాద్‌లో పుట్టి పెరిగిన సాక్షి శ్రీవాస్తవ్‌ జీవితమూ ఇందుకు మినహాయింపు కాదు. చిన్నతనం నుంచే సమాజ సేవపై మక్కువ పెంచుకున్న ఆమె.. తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సంఘటన నుంచి స్ఫూర్తి పొంది ఇటువైపుగా అడుగులేసింది. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. దాని ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. వాళ్లందరికీ సొంత అక్కగా మారిపోయింది. మరి, సాక్షి జీవితాన్ని మార్చిన ఆ సంఘటనేంటి? అది ఆమెను ఎంతగా కదిలించింది? తెలుసుకోవాలంటే ఆమె కథ చదవాల్సిందే!

ఈ సమాజంలో చదువుకు నోచుకోని, వాళ్ల చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా చదువుపై ఆసక్తి చూపని చిన్నారులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్లకు ఈ వయసులో దాని విలువ తెలియదు.. కాబట్టి తెలియజెప్పే బాధ్యత పెద్దవాళ్లుగా మనదే అంటోంది సాక్షి శ్రీవాస్తవ్‌. ఉత్తరప్రదేశ్‌లోని జలాలాబాద్‌కు చెందిన ఆమె.. తన ఊర్లో చదువుకోవడానికి సరైన సదుపాయాలు లేకపోయినా.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో దిల్లీలో ఉన్నత విద్యనభ్యసించింది. ఈ క్రమంలో చదువుకు నోచుకోని పిల్లల పరిస్థితిని చూసి చలించిపోయిన సాక్షి.. సమాజ సేవ వైపు అడుగులేసే ఉద్దేశంతో సోషల్ వర్క్ కౌన్సెలింగ్ విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేసింది.

‘అనుభూతి’కి మూలమదే!

సాక్షిది చిన్నతనం నుంచే కాస్త సున్నిత మనస్తత్వం. చుట్టూ ఉన్న వారు కష్టాల్లో ఉన్నా చలించిపోయేదామె. అయితే తాను దిల్లీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. తన కాలేజీ ఆవరణలో జరిగిన ఓ సంఘటనను చూసి చలించిపోయిందామె. ఓ రోజు తాను, తన స్నేహితురాలు కలిసి తినగా మిగిలిన కొన్ని నూడుల్స్‌ని అక్కడి చెత్తకుప్పలో పడేసిందామె. అయితే అక్కడే ఉన్న కొంతమంది పిల్లలు వాటిని తీసుకొని ఎంతో విలువైనదిగా భావించి తినడం ఆమెను ఆలోచనలో పడేసింది. ‘చదువుకు, ఆకలికి చాలా దగ్గరి సంబంధం ఉంది.. నిజంగా వాళ్లు విద్యాబుద్ధులు నేర్చుకుంటే ఏది మంచో, ఏది చెడో అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తులో ఆకలికీ మాడిపోవాల్సిన అవసరం వారికి ఉండదు. అయితే ఇందుకు వారి చుట్టూ ఉండే పరిస్థితులే చాలావరకు కారణమవుతున్నాయి. కొంతమంది పిల్లలు మధ్యలోనే స్కూల్‌ మానేయడం, పరిస్థితులు సహకరించక పసి వయసులోనే పనిలోకి వెళ్లడం, తల్లిదండ్రుల ప్రోత్సాహం కరువవడం.. ఇలా వాళ్ల విద్యకు ఎన్నో ఆటంకాలు! అందుకే వీటన్నింటినీ తొలగించడానికే 2016లో ‘అనుభూతి’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పా’ అంటోంది సాక్షి.

ప్రయత్నం ఫలించిన వేళ..!

చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి పెంచి.. ఈ క్రమంలో వాళ్లకున్న అవరోధాల్ని తొలగించి.. ఉత్సాహంగా వాళ్లు పాఠశాలలో చేరేలా ప్రోత్సహించడమే ఈ ఎన్జీవో ముఖ్యోద్దేశం. ఒక్కమాటలో చెప్పాలంటే.. పిల్లలకు (కమ్యూనిటీకి), స్కూల్‌కి మధ్య వారధిలా పనిచేస్తుందీ సంస్థ. ‘అయితే ఇలా విద్యకు నోచుకోని పిల్లలెవరెవరు ఉన్నారో తెలుసుకుంటేనే వాళ్లకు సరైన కౌన్సెలింగ్‌ ఇవ్వగలం. ఇందుకోసం తొలుత ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని మురికివాడల్లో ఉన్న చిన్నారుల సమాచారం తెలుసుకున్నా. వాళ్ల కోసం అక్కడికి దగ్గర్లోని ఓ పార్క్‌లో రోజూ నాలుగ్గంటల పాటు సెషన్స్‌ నిర్వహించేదాన్ని. ఈ క్రమంలో చదువు ప్రాముఖ్యాన్ని వాళ్లకు తెలియజేస్తూనే.. వాళ్లలోని ప్రతిభను వెలికి తీసేందుకు దీన్నే వేదికగా మలచుకున్నా. మరోవైపు వాళ్ల తల్లిదండ్రుల్లోనూ మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఏడాది తిరిగే సరికి ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. సుమారు 150 మంది పిల్లలు తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చేరారు..’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది సాక్షి.

స్వచ్ఛంద సంస్థలతో మమేకమై..!

ఇలా ఒంటరిగానే కాదు.. దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలతో మమేకమై తన సేవను మరింత విస్తరించింది సాక్షి. ఈ క్రమంలోనే గూంజ్‌ ఎన్జీవోతో కలిసి మహారాష్ట్రలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యేలా చేసింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ఉద్దేశించిన గాంధీ ఫెలోషిప్, హరియాణా ప్రభుత్వ సుపరిపాలన వంటి కార్యక్రమాల ద్వారా స్కూల్లో చేరని, డ్రాపౌట్స్‌ చిన్నారుల్ని గుర్తించి.. వారు స్కూల్లో అడ్మిషన్‌ పొందేందుకు సహకరించింది. గురుగ్రామ్‌లో దాదాపు 15 వేల మంది డ్రాపౌట్‌ విద్యార్థులు తిరిగి స్కూల్లో చేరేలా తన సంస్థ గతేడాది హరియాణా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా తన సంస్థ ద్వారా ఈ ఐదేళ్లలో సుమారు 50 వేల మంది చిన్నారులకు విద్యా ఫలాలు అందించి.. వాళ్లకు మానసికంగానూ ఎంతో దగ్గరయ్యానని చెబుతోంది. ఈ క్రమంలో పిల్లలందరూ తనను ‘అక్కా’ అని పిలుస్తుంటే ఎంతో సంతోషంగా ఉందంటోంది. మరోవైపు కొవిడ్‌ ప్రభావిత కుటుంబాల్ని ఆదుకోవడానికి నిధులు కూడా సమకూర్చుతోంది సాక్షి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని