Updated : 11/01/2022 21:22 IST

Lesbian Couple : ఈ అమ్మాయిల ప్రేమకథ విన్నారా?

(Image for Representation)

ప్రేమంటే ఆడ, మగ మధ్య పుట్టేది.. పెళ్లంటే స్త్రీపురుషులకు జరిగేది.. అదే.. ఓ అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించినా.. ఓ అబ్బాయి మరో అబ్బాయికి మనసిచ్చినా ‘హవ్వ.. ఇదేం విడ్డూరం’ అనేస్తుంది మన సమాజం. ఇలాంటి కట్టుబాట్లను, స్వలింగ సంపర్కుల విషయంలో ఉన్న మూసధోరణుల్ని బద్దలు కొట్టి.. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు ఇద్దరు డాక్టరమ్మలు. తమది తొలిచూపు ప్రేమ కాకపోయినా.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలెన్నో అందించిందంటూ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధపడుతోందీ జంట. ప్రస్తుతం వీళ్ల ప్రేమకథ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఆలస్యమెందుకు.. ఈ లవ్‌బర్డ్స్‌ ప్రేమ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కొన్ని జంటల్ని చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టారేమో అనిపిస్తుంటుంది.. స్వలింగ సంపర్కులే అయినా పరోమిత ముఖర్జీ, సురభి మిత్రలను చూస్తే ఇదే ఫీలింగ్‌ కలగక మానదు. నాగ్‌పూర్‌కు చెందిన సురభి, కోల్‌కతా వాసి అయిన పరోమిత.. వృత్తి రీత్యా వీరిద్దరూ వైద్యులే! వీరిలో సురభి సైకియాట్రిస్ట్‌గా పనిచేస్తోంది.

ఆ సదస్సులో కలుసుకొని!

అయితే ఓసారి కోల్‌కతాలో మానసిక ఆరోగ్యంపై నిర్వహించిన సదస్సులో భాగంగా కలుసుకున్నారు పరోమిత, సురభి. ఈ కాన్ఫరెన్స్‌లో సురభి వక్తగా హాజరైంది. ఇదే వేదికగా ఒకరినొకరు చూసుకున్న ఈ జంట.. తనివి తీరలేదన్నట్లు.. ఇద్దరూ ఇంకా బోలెడన్ని విషయాలు మాట్లాడుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే మొబైల్‌ నంబర్లు, ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీలు ఇచ్చిపుచ్చుకున్నారు. అప్పట్నుంచి రోజూ మాట్లాడుకోవడం, అభిరుచులు-ఇష్టాయిష్టాలను పంచుకోవడంతో మరింత దగ్గరయ్యారు. అలా వీళ్ల పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే ‘మాది తొలిచూపు ప్రేమ కాదు.. ఆకర్షణేమో అన్న ఉద్దేశంతో ఒకరి గురించి మరొకరం మరింత లోతుగా తెలుసుకునేందుకు ఆసక్తి చూపాం..’ అంటున్నారీ లవ్‌బర్డ్స్‌.

ప్రపోజల్‌.. అక్కడనుకుంటే ఇక్కడైంది!

ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం.. మరి, ఈ ప్రేమను తెలుపుకోవాలంటే అందుకు గోవా బీచే సరైన వేదిక అనుకున్నారీ లెస్బియన్‌ కపుల్‌. ఈ క్రమంలోనే తమ ప్రేమ ప్రతిపాదన గురించి పరోమిత స్పందిస్తూ.. ‘నా మనసులో సురభిపై ఉన్న ప్రేమను కాస్త ప్రత్యేకంగా తెలపాలనుకున్నా. ఇందుకోసమే మా స్నేహితులతో కలిసి గోవా ట్రిప్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నా. అయితే తన మనసులో ఏముందో తెలుసుకోవాలన్న ఆతృత నా మనసును నిలవనివ్వలేదు.. ఉండబట్టలేక ఈ ప్లాన్‌ గురించి, లవ్‌ ప్రపోజల్‌ గురించి ముందుగానే సురభికి చెప్పేశా. ‘ఒకవేళ నేను బీచ్‌లో అందరి ముందు నీకు లవ్‌ ప్రపోజ్‌ చేస్తే నువ్వు తిరస్కరిస్తావా?’ అని అడిగేశా. ‘లేదు.. నేనెందుకు అలా చేస్తాను’ అని తను అనే సరికి తన మనసులోనూ నేనున్నానని నాకు అర్థమైంది.. అయితే గోవా బీచ్‌లో జరగాల్సిన మా ప్రేమ ప్రతిపాదన ఇటీవలే నాగ్‌పూర్‌లోని ఓ రిసార్ట్‌లో నిర్వహించిన నిశ్చితార్థం వేడుకలో జరిగింది..’ అంటూ ఓ నవ్వు రువ్వుతోందీ అందాల జంట. ప్రపోజల్‌ మిస్సయినా.. త్వరలో జరగబోయే తమ వివాహం మాత్రం గోవాలోనే ప్లాన్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు పరోమిత, సురభి.

ఇంట్లో ఒప్పుకున్నారు..!

పరోమిత, సురభి.. వీరిద్దరివీ బాగా చదువుకున్న కుటుంబాలే! వీళ్ల పేరెంట్స్‌ కూడా ఈ అమ్మాయిల్ని చిన్నతనం నుంచి వారికి ఆసక్తి ఉన్న రంగాల్లోనే ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అలాగే స్వలింగ వివాహానికీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని చెబుతోంది సురభి. ‘నా శరీరంలోని లైంగిక మార్పుల పట్ల నా కుటుంబం ఎప్పుడూ వ్యతిరేకత చూపలేదు. దీని గురించి నేను నా తల్లిదండ్రులతో చెప్పినా వాళ్లు నన్ను నిరుత్సాహపరచలేదు. అలాగే పరోమితతో ప్రేమ, పెళ్లికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు..’ అంటోందామె. ఇక తన గురించి తెలిసి తన తల్లి ముందు కాస్త షాక్‌కి గురైనా.. ఆ తర్వాత ఆమె పేరెంట్స్‌ ఇద్దరూ ఈ వివాహానికి ఒప్పుకున్నారంటోంది పరోమిత.

ప్రేమ ఎప్పుడు, ఎవరి మీద పుడుతుందో చెప్పలేమంటుంటారు.. పరోమిత, సురభిల ప్రేమకథ వింటుంటే ఇది నిజమనిపిస్తోంది కదూ!

వీళ్లు కూడా!

స్వలింగ సంపర్కుల వివాహాల్ని మన దేశం చట్టబద్ధం చేసినా.. సమాజం మాత్రం ఇలాంటి పెళ్లిళ్లను ఇంకా తప్పు పడుతోందనే చెప్పాలి అయినా ఇలాంటి మూసధోరణుల్ని బద్దలుకొట్టి పెళ్లితో ఒక్కటైన అమ్మాయిలు గతంలోనూ కొందరున్నారు.

* ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన దీప్షిక, అభిలాష అనే ఇద్దరు అమ్మాయిలు 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ల వివాహాన్ని ఇరు కుటుంబ సభ్యులు తిరస్కరించినా ధైర్యంగా ఇంటి నుంచి బయటికొచ్చేసిందీ జంట.

* ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీనా, సవిత అనే మరో జంట.. పదేళ్ల క్రితమే స్వలింగ వివాహం చేసుకుంది. అయితే వీళ్ల అనుబంధాన్ని ముందు కుటుంబ సభ్యులు అంగీకరించకపోగా.. బంధువులు తమను చంపడానికి ప్రయత్నిస్తున్నారంటూ.. పోలీసుల రక్షణ కోరడంతో పాటు బంధువులపై కోర్టులో కేసు కూడా వేశారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు వీళ్ల ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించడంతో ఈ జంట తాము పెట్టిన కేసును వెనక్కి తీసుకుంది. అయితే వీళ్ల ప్రేమకథ, పెళ్లి అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందని చెప్పచ్చు.

* అంతేకాదు.. భారత అమ్మాయిలు, విదేశీ అమ్మాయిల్ని ఇష్టపడి మనువాడిన సంఘటనలూ గతంలో ఉన్నాయి. భారత్‌కు చెందిన అంజలీ చక్ర, పాకిస్థానీ ఆర్టిస్ట్‌ సుందస్‌ మాలిక్‌; మరో ఇండో-పాక్‌ లెస్బియన్‌ కపుల్‌ బియాన్కా, సైమా; అమెరికాకు చెందిన షానన్‌, ఇండియా వాసి అయిన సీమా.. వీళ్లూ లెస్బియన్‌ పెళ్లిళ్లు చేసుకున్న వారే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని