Alopecia Areata : ఆరేళ్ల క్రితం ఆ సమస్యతో పోరాడా!

అలొపేషియా ఎరేటా సమస్యతో బాధపడుతోన్న తన భార్య జాడా పింకెట్‌ను ఆస్కార్‌ వేదికగా అపహాస్యం చేసిన క్రిస్‌ రాక్‌ చెంప ఛెళ్లుమనిపించాడు నటుడు విల్‌ స్మిత్‌. దీంతో ఈ సమస్య గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ తరుణంలో తానూ గతంలో ఈ అరుదైన సమస్యను ఎదుర్కొన్నానంటూ ధైర్యంగా పెదవి విప్పింది......

Published : 30 Mar 2022 17:52 IST

అలొపేషియా ఎరేటా సమస్యతో బాధపడుతోన్న తన భార్య జాడా పింకెట్‌ను ఆస్కార్‌ వేదికగా అపహాస్యం చేసిన క్రిస్‌ రాక్‌ చెంప ఛెళ్లుమనిపించాడు నటుడు విల్‌ స్మిత్‌. దీంతో ఈ సమస్య గురించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే ఈ తరుణంలో తానూ గతంలో ఈ అరుదైన సమస్యను ఎదుర్కొన్నానంటూ ధైర్యంగా పెదవి విప్పింది బాలీవుడ్‌ అందాల తార సమీరా రెడ్డి. ఏ విషయాన్నైనా నిర్మొహమాటంగా పంచుకుంటూ బాడీ పాజిటివీని చాటే ఈ ముద్దుగుమ్మ.. అలొపేషియాతో తాను ఎదుర్కొన్న అనుభవాలను ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో పంచుకుంది. దాని సారాంశమేంటో తెలుసుకుందాం రండి..

సమీరా రెడ్డి.. బాడీ పాజిటివిటీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంటుందీ బ్యూటీ. అధిక బరువు, ప్రసవానంతర బరువు-ఒత్తిడి, చర్మ ఛాయ.. వంటి అంశాల్లో తనకు ఎదురైన అనుభవాలను తరచూ పంచుకుంటూ ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంటుందీ బ్యూటీ. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అలొపేషియా ఎరేటా సమస్య గురించి చర్చ జరుగుతోన్న నేపథ్యంలో తానూ ఆరేళ్ల క్రితం ఈ సమస్యతో పోరాడానంటూ ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టిందీ అందాల అమ్మ.

ఆ సమస్యను నా భర్త గుర్తించాడు!

‘ఇటీవలే చోటుచేసుకున్న ఆస్కార్‌ వివాదం.. మనం వ్యక్తిగతంగా ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల్ని ఎదుటివారితో పంచుకొని వారిలో సానుకూల దృక్పథాన్ని నింపాలన్న విషయాన్ని మరోసారి గుర్తుచేసింది. అలొపేషియా ఎరేటా అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ (మన రోగనిరోధక శక్తి పొరపాటుగా మన శరీరంపై దాడి చేసే పరిస్థితి). ఈ సమస్య ఉన్న వారిలో రోగనిరోధక వ్యవస్థలోని కణాలు కుదుళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. తద్వారా జుట్టు ఎక్కువగా రాలిపోయి.. కుదుళ్లపై అక్కడక్కడా ప్యాచుల్లా ఏర్పడుతుంటాయి. 2016లో నేనూ ఈ సమస్యతో బాధపడ్డా. ఆ సమయంలో అక్షయ్‌ (సమీర భర్త) నా తల వెనక భాగంలో ఏర్పడిన బోల్డ్‌ ప్యాచ్‌ని గమనించాడు. మరో నెల గడిచేసరికి ఇంకో రెండు చోట్ల ప్యాచులు రావడం గుర్తించాను. నిజానికి అది నా జీవితంలోనే కఠిన సమయం. అయితే ఇది మనల్ని అనారోగ్యానికి గురిచేయదు.. అంటు వ్యాధి కూడా కాదు.. కానీ మానసికంగా దెబ్బతీస్తుంది. ఇక ఈ సమస్యతో బాధపడుతోన్న చాలామంది జుట్టు రాలడానికే కాదు.. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడడానికీ చికిత్స తీసుకుంటున్నారు.

ఇప్పటికీ మందులు వాడుతున్నా!

అయితే చాలా కేసుల్లో కొన్ని రకాల Corticosteroids ఇంజెక్షన్లతో జుట్టును తిరిగి మొలిపించచ్చని నేను సంప్రదించిన డాక్టర్‌ నాతో చెప్పారు. నేనూ నా విషయంలో ఈ మార్పులు గమనించా. కానీ ఈ వ్యాధి పూర్తిగా నయం కాదన్న విషయంలో నాకు పూర్తి అవగాహన ఉంది. అలాగే దీనికి మూల కారణాలేంటన్న దానిపైనా ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక ఇందులోనూ కొన్ని రకాలున్నాయి. Alopecia Totalis (జుట్టు ఎక్కువగా రాలిపోయి బట్టతల రావడం), Alopecia Ophiasis (తలపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి ప్యాచులు ఏర్పడడం), Alopecia Universalis (శరీరమంతా వెంట్రుకలు రాలిపోవడం).. వంటివి వాటిలో కొన్ని! ఏదేమైనా ప్రస్తుతం నా తలపై ఎక్కడా ప్యాచులు లేవు.. కొత్త జుట్టు మొలిచింది. అలాగని దీన్నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పలేను. ఎందుకంటే ఇది నా జీవితంలో మళ్లీ ఎప్పుడైనా తిరగబెట్టచ్చు. అందుకే దీనికి దూరంగా ఉండడానికి ప్రస్తుతం హోమియోపతి మందులు వాడుతున్నా. నాలాగే ఎవరైనా సరే.. ఈ సమస్య తాలూకు అనుభవాలను ఇతరులతో పంచుకొని వారిలో సానుకూల దృక్పథం నింపాలని కోరుకుంటున్నా..’ అంటూ చెప్పుకొచ్చింది సమీర.

ఇలా సమీర పెట్టిన పోస్ట్‌కు చాలామంది సానుకూలంగా స్పందిస్తున్నారు. ‘మీ పోస్ట్‌ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందం’టూ కామెంట్లు షేర్‌ చేస్తున్నారు. మరికొంతమంది తమ అలొపేషియా సమస్య అనుభవాలను పంచుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్