అప్పుడు ఆయన నన్ను అలా ఇంప్రెస్ చేద్దామని చూశారు!

క్రికెట్‌-సినిమా... మన దేశంలో ఈ రెండు రంగాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నాటి షర్మిలా ఠాగూర్-మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ నుంచి నేటి ధనశ్రీ వర్మ-చాహల్‌ వరకు పెళ్లితో కలిసిపోయిన క్రికెట్‌-సినిమా బంధాలు చాలానే కనిపిస్తాయి. అయితే క్రికెటర్లు మైదానంలో సరిగ్గా ఆడకపోతే వారి భార్యలను నిందించడం, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం పరిపాటిగా మారింది. ప్రత్యేకించి విరాట్‌ కోహ్లీ విఫలమైనప్పుడల్లా అతడి సతీమణి అనుష్కా శర్మ...

Updated : 13 Sep 2022 14:10 IST

క్రికెట్‌-సినిమా... మన దేశంలో ఈ రెండు రంగాలకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నాటి షర్మిలా ఠాగూర్-మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ నుంచి నేటి ధనశ్రీ వర్మ-చాహల్‌ వరకు పెళ్లితో కలిసిపోయిన క్రికెట్‌-సినిమా బంధాలు చాలానే కనిపిస్తాయి. అయితే క్రికెటర్లు మైదానంలో సరిగ్గా ఆడకపోతే వారి భార్యలను నిందించడం, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం పరిపాటిగా మారింది. ప్రత్యేకించి విరాట్‌ కోహ్లీ విఫలమైనప్పుడల్లా అతడి సతీమణి అనుష్కా శర్మ... ఈ విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే అనుష్క మాత్రమే కాదు... పటౌడీ సరిగా ఆడనప్పుడు తాను కూడా ఇలాగే తిట్లు తిన్నానంటున్నారు అలనాటి బాలీవుడ్‌ అందాల తార షర్మిలా ఠాగూర్. ఈ సందర్భంగా తన భర్త లెజెండరీ క్రికెటర్‌ పటౌడీతో తన అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారామె.

హైదరాబాద్‌తో ప్రత్యేక అనుబంధమున్న షర్మిల 1944లో ఇక్కడే పుట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి మేటి నటిగా గుర్తింపు పొందారు. ‘అమర్‌ ప్రేమ్‌’, ‘వక్త్‌’, ‘ఆమ్నే సామ్నే’, ‘ఆరాధన’, ‘సుహానా సఫర్‌’, ‘మౌసమ్‌’, ‘చుప్కే-చుప్కే’ వంటి సినిమాలతో 70 వ దశకంలో బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారామె. తన అభినయ ప్రతిభకు గుర్తింపుగా రెండు జాతీయ అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాలతో పాటు పద్మభూషణ్‌ను అందుకున్నారీ వెటరన్‌ యాక్ట్రెస్‌. ఇక 1969లో పటౌడీని ప్రేమ వివాహం చేసుకున్న ఆమె సైఫ్‌, సోహా, సాబా అలీఖాన్‌లకు జన్మనిచ్చింది. వీరిలో సైఫ్‌, సోహా తల్లిబాటలో పయనిస్తూ సినిమా రంగంలో రాణిస్తుండగా... సాబా అలీఖాన్‌ మాత్రం వ్యాపార రంగంలో స్థిరపడింది.

అలా మా పరిచయం మొదలైంది!

కేవలం నటనతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు షర్మిల. గతంలో లింగ సమానత్వం, మహిళా సాధికారత వంటి పలు సామాజిక అంశాలపై సూటిగా మాట్లాడి మన్ననలు అందుకున్నారీ వెటరన్‌ నటీమణి. తాజాగా భర్త పటౌడీతో పరిచయం, రిలేషన్‌ షిప్‌, పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.

‘మా కుటుంబంలో చాలామందికి క్రికెట్‌ అన్నా, క్రికెటర్లు అన్నా చాలా ఇష్టం. మా అమ్మ కూడా క్రికెట్‌ అంటే బాగా ఆసక్తి చూపించేది. ఒకసారి సౌరవ్‌ గంగూలీని ఎవరో చెడుగా మాట్లాడారని ఆగ్రహంతో రగిలిపోయింది. ఇక పటౌడీ, నేను మొదటిసారిగా ఓ బర్త్‌డే ఫంక్షన్‌లో కలుసుకున్నాం. కొద్ది సేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. ఆయన ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. అయితే అది బ్రిటిష్ యాక్సెంట్ కావడంతో చాలామందికి ఆ భాష అర్థమయ్యేది కాదు. ఈ క్రమంలో బర్త్‌డే పార్టీలో జోష్‌ నింపుదామని ఆయన వేసిన జోకులను ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. దీంతో తన జోకులకు తానే నవ్వుకున్నారు. పటౌడీలోని ఆ సెన్సాఫ్‌ హ్యూమరే నన్ను బాగా ఆకట్టుకుంది. తనకు బాగా దగ్గర చేసింది. నాకు తెలిసి ఆయన ఏ రోజూ నన్ను ఉద్దేశపూర్వకంగా హర్ట్‌ చేయాలనుకోలేదు. తను నిజంగా జెంటిల్‌మన్‌. అందుకే పటౌడీని పూర్తిగా నమ్మాను.’

అలా నన్ను ఇంప్రెస్‌ చేయాలనుకున్నారు!

‘ఇరువురి మతాలు వేరు కావడంతో చాలామందికి ఎదురైనట్లే మా పెళ్లికి కూడా కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. పెళ్లికి ముందు ఆయన నన్ను ఇంప్రెస్‌ చేసి నాపై తన ప్రేమను నిరూపించుకోవాలనుకున్నారు. అందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే పెళ్లి తర్వాత కూడా ఆయన అదే ప్రేమను చూపారు. ఒకసారి నన్ను ఇంప్రెస్‌ చేసేందుకు నా వద్దకు వచ్చి మీర్జాగాలిబ్‌ రాసిన కవితను చదివి ‘ఇది నీ కోసమే రాశాను’ అంటూ ఓ పాటను కూడా పాడారు. అప్పుడది మీర్జా గాలిబ్‌ రాసిన కవిత అని నాకు తెలియదు. అయితే నా సహనటుడు ఫిరోజ్‌ ఖాన్ ఈ కవితను చదివి ‘ఇది మీ భర్త రాసింది కాదు’ అని చెప్పడంతో అసలు నిజం తెలుసుకున్నాను’.

నాన్న నాపై అరిచేవారు!

‘నన్ను పెళ్లి చేసుకునే సమయానికి పటౌడీ ఇంకా క్రికెట్‌ ఆడుతూనే ఉన్నారు. ఆయన ఎంతటి గొప్ప ఆటగాడో అందరికీ బాగా తెలుసు. కానీ ఎంతటి ఆటగాడైనా ఒక్కోసారి తప్పులు చేస్తుంటాడు కదా. ఈ క్రమంలో మా పెళ్లయ్యాక ఆయన మైదానంలో క్యాచ్‌ నేలపాలు చేసినా, సరిగ్గా బ్యాటింగ్‌ చేయకపోయినా నాకు తిట్లు పడేవి. అయితే ఆ తిట్లు అభిమానుల నుంచి కాదు మా నాన్న నుంచి! మా నాన్నకు కూడా క్రికెట్ అంటే చాలా ఆసక్తి. దీంతో పటౌడీ విఫలమైనప్పుడల్లా ‘నువ్వతన్ని సరిగ్గా నిద్రపోనిస్తున్నావా లేదా’ అంటూ నాపై అరిచేవారు (నవ్వుతూ). ఇక నా పిల్లలెవరూ నా సినిమాలు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కానీ సాబా అలీఖాన్‌ మాత్రం నా సినిమాలు బాగా చూస్తుంది. తనకు నేను నటించిన ‘చుప్కే చుప్కే’ అంటే చాలా ఇష్టం’ అని అప్పటి జ్ఞాపకాలను గుది గుచ్చారీ అందాల తార.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్