Published : 07/11/2021 11:05 IST

అందానికి ‘నకిలీ’ ముసుగేస్తున్నారు.. జాగ్రత్త!

వివిధ రకాల మేకప్‌/సౌందర్య ఉత్పత్తులతో అందానికి మెరుగులు దిద్దుకోవడం మనకు అలవాటే! అయితే ఈ క్రమంలో మనం ఎంచుకునే ఉత్పత్తుల విషయంలో తగిన శ్రద్ధ వహించాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే నకిలీ ముసుగేసుకున్న సౌందర్య ఉత్పత్తులు ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని అందుబాటులో ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో సూపర్‌ మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్స్‌, ఆన్‌లైన్లో ఇలాంటి నకిలీ ఉత్పత్తులు సుమారు 30 శాతం దాకా అందుబాటులో ఉంటున్నట్లు FICCI నివేదిక తెలిపింది. ప్యాకింగ్‌ దగ్గర్నుంచి ఉత్పత్తి దాకా అచ్చం అసలైన దాన్నే పోలినట్లుగా ఉండే ఈ ఉత్పత్తుల్ని కనిపెట్టడం కూడా కష్టమేనంటోంది. అలాగని వెనకా ముందూ ఆలోచించకుండా వీటిని వాడడం వల్ల వివిధ రకాల సౌందర్య సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు నిపుణులు. మరి, ఈ నేపథ్యంలో నకిలీ ముసుగేసుకున్న ఈ సౌందర్య/మేకప్‌ ఉత్పత్తుల వల్ల ఎలాంటి సమస్యలొస్తున్నాయి? వాటిని కనిపెట్టాలంటే ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి? రండి.. తెలుసుకుందాం..!

మేకప్‌/ఇతర సౌందర్య ఉత్పత్తుల్లోని రసాయనాలు చర్మ ఆరోగ్యానికి అంత మంచివి కావు. ఈ విషయం తెలిసినా వృత్తిలో భాగంగానో లేదంటే అకేషనల్‌గానో తప్పక వీటిని ఉపయోగిస్తుంటాం. ఏదేమైనా వీటి కంటే నకిలీ ఉత్పత్తులు ఇంకా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వీటి తయారీలో వాడే లెడ్‌, మెర్క్యురీ, నికెల్‌, కోబాల్ట్‌, క్రోమియం.. వంటి రసాయనాలు, బ్యాక్టీరియా.. వంటివి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపి అందవిహీనంగా మార్చుతాయి. అయితే తెలియక వీటిని వాడినట్లయితే చర్మంపై కొన్ని దుష్ప్రభావాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. తద్వారా మనం వాడేవి నకిలీ ఉత్పత్తులని గుర్తించాలని చెబుతున్నారు.

ఇలా గుర్తించచ్చు!

* నకిలీ సౌందర్య ఉత్పత్తులు వాడడం వల్ల చర్మం కందిపోవడం, కాలిపోయినట్లుగా మారడం.. వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. అయితే కొన్నింటి వల్ల ఈ దుష్ప్రభావం వెనువెంటనే కనిపించచ్చు లేదంటే ఆలస్యంగానైనా కనిపించచ్చట!

* చర్మం ఎర్రబడడం, పొడిబారిపోయి పొట్టులా ఊడిపోవడం.. వంటివి జరిగినా మీరు వాడినవి నకిలీవే అని అనుమానించాలంటున్నారు.

* సౌందర్య ఉత్పత్తుల్ని కొనే క్రమంలో లేబుల్‌ చదివి.. అందులో వాడిన పదార్థాలన్నీ చర్మానికి సరిపడితేనే కొనడం చాలామందికి అలవాటు! అయితే అవి వాడినప్పుడు మీకు అలర్జీ, దురద.. వంటి సమస్యలెదురైతే మాత్రం అనుమానించాల్సిందే! ఎందుకంటే అందులో ఇతర పదార్థమేదో వాడి, దాన్ని లేబుల్‌లో పొందుపరచకుండా కూడా ఉండచ్చు కదా!

* వాడిన లిప్‌స్టిక్‌ నకిలీదైతే.. పెదాలు ఉబ్బడం, ఎరుపెక్కడం.. వంటివి గమనించచ్చు.

* కళ్లు ఎరుపెక్కడం, ఉబ్బడం, నీరు కారడం.. వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ గుర్తిస్తే మాత్రం.. వీటికి కారణం కూడా నకిలీవి వాడడం వల్లే అని అర్థం చేసుకోవాలి.

* ఇలా కేవలం అందం పరంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ నకిలీ సౌందర్య ఉత్పత్తుల ప్రభావం తీవ్రంగానే ఉంటుందట! ఈ క్రమంలో అధిక రక్తపోటు, సంతానలేమి.. వంటి దీర్ఘకాలిక సమస్యలూ వేధించే ప్రమాదం ఉందట!

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత నిపుణుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

‘నకిలీ’ కనిపెట్టండిలా!

ప్యాకింగ్‌ దగ్గర్నుంచి అన్నిట్లోనూ అసలు వాటిని పోలినట్లుగా ఉండే ఈ నకిలీ సౌందర్య ఉత్పత్తుల్ని కనిపెట్టడం కత్తి మీద సామే అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని బండ గుర్తుల్ని బట్టి వీటిని సులభంగానే గుర్తించచ్చట!

* సాధారణ ఉత్పత్తుల కంటే ఇవి చాలా తక్కువ ధరలో లభిస్తాయి.

* వరుసగా సెలవులు/షాపులు బంద్‌ ఉన్న సమయంలో వీటిని ఎక్కువగా అమ్ముతుంటారు. ఉదాహరణకు.. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ఇలాంటి ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో విచ్చలవిడిగా అమ్మినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

* ఉత్పత్తులపై అక్షర దోషాలు, ఫాంట్స్‌, రంగు, ఆకృతిలో తేడా గమనించడం, తప్పుడు ప్రింటింగ్‌.. వంటివి ఉన్నా అనుమానించాల్సిందే! ఎందుకంటే నమ్మకమైన/నాణ్యమైన బ్రాండ్స్‌ ఉత్పత్తుల్లో ఇలాంటి పొరపాట్లు దొర్లవు.

* రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో కొంతమంది ఇలాంటి ఉత్పత్తుల్ని అమ్ముతుంటారు. వాటిని అస్సలు కొనకండి.

* ‘లిమిటెడ్‌ ఎడిషన్‌/న్యూ లాంచ్‌’ వంటి పదాలతో వినియోగదారుల్ని ఆకర్షించాలని చూస్తుంటాయి కొన్ని ఫేక్‌ కంపెనీలు. కాబట్టి కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.

* సరైన సీల్ లేకపోతే వాటిని కొనకపోవడమే ఉత్తమం.

* పెద్ద పెద్ద స్టోర్స్‌, సూపర్‌మార్కెట్స్‌, ఆన్‌లైన్‌ విపణుల్లో కూడా.. ఇలాంటి ఉత్పత్తులు ఎక్కువగా అమ్ముతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి వీటిని నేరుగా కొన్నా లేదంటే ఆన్‌లైన్‌లో కొన్నా పైన చెప్పిన అంశాలన్నీ పరిశీలించడం మర్చిపోవద్దు. ఈ ఇబ్బందులన్నీ వద్దనుకున్న వారు నేరుగా ఆయా బ్రాండ్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లోనే కొనుగోలు చేయడం అత్యుత్తమం.

‘అసలు’ ముసుగేసుకున్న ఇలాంటి నకిలీ ఉత్పత్తుల్ని కనిపెట్టడం సవాలే కాబట్టి.. ఎలాంటి ఉత్పత్తైనా వాడే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకుంటే పెద్ద ఎత్తున ముప్పు తప్పుతుంది. అలాగే వాడే ముందు ఆయా ఉత్పత్తులను ఓసారి నిపుణులకు చూపిస్తే మరీ మంచిది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని