Published : 24/05/2022 18:39 IST

Social Media: దంపతులైనా సరే.. ఈ జాగ్రత్తలు తప్పవు!

నేటి సోషల్‌ మీడియా యుగంలో మాట్లాడే పద్ధతులు మారిపోతున్నాయి. కేవలం స్నేహితులు, బంధువులే కాకుండా దంపతులు సైతం తమ భావాలను సామాజిక మాధ్యమాల ద్వారా చాటింగ్ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రత్యేకించి భార్యాభర్తలు సోషల్‌ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు టెక్నాలజీ నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా...

అతిగా వద్దు...

చాలామంది తాము చేసే ప్రతి పని, దిగిన ప్రతి ఫొటోకి సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటారు. ఒక్కసారి పోస్ట్‌ చేసిన తర్వాత ఎన్ని లైక్‌లు, కామెంట్లు వచ్చాయని చెక్‌ చేసుకోవడం మొదలుపెడుతుంటారు. కొన్ని సందర్భాల్లో లైక్‌లు ఎక్కువ రాకపోతే తమ జోడీ బాగా లేదని వారికి వారే నిరుత్సాహపడడం జరుగుతుంటుంది. ఇలా తరచుగా జరిగితే కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు పెట్టకపోవడమే మంచిది. ఒకవేళ పెట్టినా లైక్‌లు, కామెంట్ల గురించి పట్టించుకోవద్దు. ఇక మరికొన్ని సందర్భాల్లో మీరు చేసే పోస్టులు భాగస్వామికి నచ్చకపోవచ్చు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. కాబట్టి, ఇద్దరూ కలిసి సామాజిక మాధ్యమాల వినియోగం విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.

పోల్చుకోవద్దు...

చాలామంది తమను తాము ఇతరులతో పోల్చుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో ఇవి ఎక్కువగా జరుగుతుంటాయి. కొంతమంది దంపతులు తరచూ విహారయాత్రలకు వెళుతుంటారు. వాటికి సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పంచుకుంటుంటారు. వీటిని చూసిన కొంతమంది తాము కూడా వారి లాగే ఉండాలని కోరుకుంటారు. ఫలితంగా తమ జీవిత భాగస్వామిపై ఒత్తిడి తేవడం, లేదా గొడవ పడడం చేస్తుంటారు. అయితే అందరి పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. కాబట్టి, సోషల్ మీడియాలో ఇతరుల ఫొటోలో, పోస్టులో చూసి తమను తాము వారితో పోల్చుకుని అనవసరంగా బాధపడడం మంచిది కాదు.

వాటిని చెక్‌ చేయద్దు...

సోషల్‌ మీడియా అంటేనే లైక్‌లు, షేర్‌లు, కామెంట్లు. ఒక్కసారి ఏదైనా పోస్ట్‌ పెట్టామంటే వీటి చుట్టూనే తిరుగుతుంటుంది. అయితే కొంతమంది తమ జీవిత భాగస్వామి సామాజిక మాధ్యమాల్లో ఎవరి ఫొటోలకు ఎక్కువ లైక్‌లు కొడుతున్నారు? ఎవరిని ట్యాగ్‌ చేస్తున్నారు? ఎవరి నుంచి కామెంట్లు ఎక్కువగా వస్తున్నాయి? వంటివి చెక్‌ చేస్తుంటారు. వీటిని అవతలి వ్యక్తి సాధారణంగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ, కొంతమంది వీటిపై అనవసరంగా గొడవ చేస్తుంటారు. కాబట్టి, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఆ సమయంలో వద్దు...

భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అయితే కొంతమంది చిన్న సమస్యలకే భావోద్వేగానికి గురవుతుంటారు. వాటిని వెంటనే ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో వారికి సోషల్‌ మీడియా మొదటి మార్గంగా కనిపిస్తుంటుంది. వెంటనే తమ బాధను ఇతరులకు తెలియజేసేలా పోస్టులు పెడుతుంటారు. దీనివల్ల మీ మధ్య జరిగిన చిన్న గొడవ కాస్తా మరింత పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, ఒక్కసారి పోస్ట్‌ చేసి దానిని తొలగించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి, కోపంలో ఉన్నప్పుడు కానీ, భావోద్వేగానికి గురైనప్పుడు కానీ సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండడమే మంచిది.

పరస్పర అంగీకారంతోనే..

సోషల్‌ మీడియాలో స్నేహితుల జాబితాకు కొదవ ఉండదు. ఇందులో దంపతులిద్దరికీ చెందిన ఉమ్మడి స్నేహితులు కూడా ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరికీ సంబంధించిన విషయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసేటప్పుడు భాగస్వామి అభిప్రాయం తీసుకోవడం మంచిది. లేకపోతే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారనుకుందాం. అదే సమయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేదని సెలవు పెట్టినట్లయితే వారు ఆఫీసులో లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, ఇద్దరికీ సంబంధించిన వివరాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేముందు జీవిత భాగస్వామి అభిప్రాయం తీసుకోవడం మంచిది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని