ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉందా?

ఒకప్పుడు కుటుంబం అంటే.. ‘జగమంత కుటుంబం’! చాలా పెద్దగా ఉండేది. ముఖ్యంగా మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా

Updated : 17 Aug 2021 12:41 IST

ఒకప్పుడు కుటుంబం అంటే.. ‘జగమంత కుటుంబం’! చాలా పెద్దగా ఉండేది. ముఖ్యంగా మన దేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా కనిపించేవి. కానీ, క్రమంగా పెరుగుతున్న నగరీకరణ నేపథ్యంలో ఉమ్మడి కుటుంబాలు కాస్తా ‘ఉత్తుత్తి’ కుటుంబాలుగా మారిపోయాయి. అఫ్‌కోర్స్.. వీటినే మనం ఇప్పుడు ‘న్యూక్లియర్ ఫ్యామిలీ’లని చాలా స్త్టెల్‌గా చెప్పుకుంటున్నాం.. అది వేరే విషయం అనుకోండి! ఇంతకీ మ్యాటరేంటంటే- ఇప్పుడు ఆ చిన్న కుటుంబాల్లోని సభ్యుల మధ్య కూడా అనుబంధాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిజంగానే ‘ఉత్తుత్తి’ కుటుంబాలుగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో- ఉన్న నలుగురి మధ్య సఖ్యత ఎలా పెంచుకోవాలి? ఉన్నంతలో అందరూ కలిసి హ్యాపీగా ఎలా ఉండాలి.. ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలేగా.. ఇంకెందుకు లేటు? వచ్చేయండి మరి!

రమ్య, సౌమ్య ఇద్దరూ అక్కచెల్లెళ్లు. ఇద్దరివీ ఎమ్మెన్సీ ఉద్యోగాలే. ఇద్దరూ చేతి నిండా సంపాదిస్తున్నారు. రమ్యకి వీకెండ్ వచ్చిందంటే చాలు- పండగ! ఫ్రైడే నైట్ నుంచే పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. శని, ఆది వారాలు వచ్చాయంటే చాలు వాళ్ల ఫ్యామిలీ ఎవరికీ దొరకదు! ప్రతి వారం అంతా కలిసి ఎక్కడికో అక్కడికి వెళ్లాల్సిందే.. రెండు రోజుల పాటు ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా స్పెండ్ చేసి మండే నుంచి మళ్లీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు! అందరూ కలిసి వీకెండ్‌ని బాగా ఎంజాయ్ చేయడం వల్లో ఏమో తెలీదు కానీ- రమ్య ఫ్యామిలీలో ఎవరిని చూసినా సరే- ఎప్పుడూ హ్యాపీగా కనిపిస్తారు!

ఇక సౌమ్య పరిస్థితి- ఇందుకు పూర్తిగా భిన్నం! వాళ్లకి వీకెండ్ ఎంజాయ్‌మెంట్- ఇలాంటివేమీ తెలియవు. అన్నిరోజులూ ఒక్కటే! సౌమ్యకి, వాళ్లాయనకి వారాంతంలో కూడా ఆఫీసు పనులే.. ఫ్యామిలీ అంతా కలిసి ఎక్కడికైనా బయల్దేరారంటే- అది ఓ పెద్ద రికార్డే! ఎప్పుడూ పని.. పని.. అంటూ బిజీగా ఉంటారేమో- ఇంట్లో ఎవరిని కదిలించినా ఒకటే చిరాకు! చివరికి సౌమ్య కూతురు పదేళ్ల స్రవంతి కూడా అలాగే తయారవుతోంది.. కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం లేకపోయినా, కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా లేకపోయినా- జీవితం పైన దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఈ అక్కచెల్లెళ్లే ఉదాహరణ.

మన అమ్మమ్మలు, బామ్మల కాలంలో కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలకే అన్నింటికంటే ఎక్కువ విలువ ఇచ్చేవారు. కానీ, అభివృద్ధి పేరుతో మనం పొరుగు దేశాల నుంచి నేర్చుకుంటున్న పాశ్చాత్య సంస్కృతి వల్ల, సమయాభావం వల్ల, ఇతర కారణాల వల్ల.. మానవ సంబంధాలకు ఉండే విలువ క్రమేపీ తగ్గిపోతోంది. దీని వల్ల నష్టపోతోంది కేవలం విలువైన బంధాలనే కాదు.. జీవితంలో మనకెంతో ముఖ్యమైన, అవసరమైన మన ఆప్తమిత్రులు/రక్త సంబంధీకులను కూడా! కుటుంబంలో సభ్యులు ఎంత మంది ఉన్నా.. వారందరినీ ఒక్క తాటిపై నడిపించేవి ప్రేమ, అనురాగం, నమ్మకం. వీటిలో ఏ ఒక్క అంశంలో తేడా వచ్చినా.. ఎవరికి వారే యమునా తీరే.. అన్న చందాన తయారవుతారు. ఈ నేపథ్యంలో- కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం.

* మీకు బయట ఎంత ఒత్తిడితో కూడుకున్న పనులు ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని మీ వ్యక్తిగత సంబంధాలపై పడకుండా చూసుకోవాలి. మీరు ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నారో ఇంట్లో అర్థం చేసుకోలేకపోతే.. మీకూ.. వారికి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఎక్కువ! అందుకే ఎప్పుడైనా మీరు బాగా ఒత్తిడికి లోనైనట్త్లెతే ఇంట్లో ఎవరితోనైనా పంచుకోండి. మనసు కాస్త తేలిక పడుతుంది.

* కుటుంబంలోని సభ్యులందరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలంటే; తరచూ అందరూ కలిసి మాట్లాడుకోవాలి. మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం, యోగక్షేమాలు తెలుసుకోవడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపుకోవాలి.

* బిజీ బిజీ షెడ్యూల్స్‌తో క్షణం తీరిక లేకుండా గడిపే క్రమంలో కనీసం రోజులో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్.. మీకు ఏది వీలైతే అది.. కుటుంబ సభ్యులంతా కలిసి చేసేలా ప్లాన్ చేసుకోండి. రోజూ వీలుకాని పక్షంలో వారానికి 3 లేదా 4 రోజులైనా ఇలా ఇంట్లో అందరితో కలిసి భోం చేయడానికి సమయం కేటాయించుకోవడానికి ప్రయత్నించండి. మీ బంధాలను మరింత దృఢపరచుకోవడానికి చక్కటి సమయంగా అది మీకు ఉపకరిస్తుంది.

* ఏదో తిన్నాం అంటే తిన్నామని కాకుండా.. భోజనం చేస్తున్నప్పుడు మిగతా సభ్యులను కూడా మాట్లాడించడానికి ప్రయత్నించండి. ఆ రోజు జరిగిన సంఘటనలు, నవ్వు తెప్పించే సన్నివేశాలు.. మీకు గుర్తొచ్చిన జోక్స్.. ఇలా వీలైనంత వరకు ఏదో ఒకటి మాట్లాడుతూ; మిగిలిన వారిని కూడా ఇలాంటి విషయాలు చెప్పడానికి ప్రోత్సహించండి. అప్పుడు భోజనంతో పాటు చక్కని నవ్వుల పువ్వులు కూడా మీ మనసుని హాయితో నింపేస్తాయి.

* కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఏవైనా వ్యక్తిగత సమస్యలుంటే వాటిని మీతో చర్చించడానికి వారిని అనుమతించండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే.. వారికి తప్పుని వివరించి, సర్ది చెప్పండి. లేని పోని కోపం, ఉక్రోషాలు వారి మీద ప్రదర్శిస్తే.. మిగతా వారు భయపడి మీ దగ్గర వారి సమస్యలు దాచే ప్రమాదం ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యుల ముందు ఎప్పుడూ కూల్‌గా, ప్రశాంతంగా కనిపించండి.

* ఒకవేళ మీ కుటుంబంలోని సభ్యులంతా ఉద్యోగాలు లేదా చదువుల రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుంటే కనీసం వారానికి ఒకసారైనా అందరూ కలిసేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలా కలిసినప్పుడు ముందుగా వ్యక్తిగత సమస్యలపై దృష్టి సారించండి. అప్పుడే వారికి మీరు తోడున్నారన్న భావన కలుగుతుంది.

* మీరు ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ సభ్యులతో కలిసి గడపడం, వారానికోసారి బయటికెళ్లడం, అందరూ కలిసి ఆడుకోవడం, సినిమాలు చూడడం.. వంటివి చేయడం వల్ల చక్కగా రిలాక్సై సంతోషంగా ఉండగలుగతారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో మీ బాంధవ్యమూ మరింత దృఢమవుతుంది.

* ఇంకా మీకు ఉదయాన్నే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్.. వంటివి చేసే అలవాటు ఉంటే మీ కుటుంబ సభ్యులని కూడా మీతో పాటు ఆహ్వానించండి. అందరూ కలిసి ఉదయాన్నే ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి.

* వీటన్నింటితో పాటు మీ పిల్లల కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించడం అస్సలు మరచిపోవద్దు. వీలైనప్పుడల్లా పిల్లలతో సరదాగా బయటకు వెళ్లండి. అలా వెళ్లిన రోజు పిల్లలకు ఏది చేస్తే నచ్చుతుందో అదే చేయడానికి ప్రయత్నించండి. వారిని దగ్గరకు తీసుకుని వారి చదువు, స్కూల్‌, ఫ్రెండ్స్ గురించి ప్రేమపూర్వక ధోరణిలో అడగండి. అలా చేయడం వల్ల వారికేవైనా సమస్యలున్నట్లయితే తెలుసుకోవడంతో పాటు, మీరు మీ పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఇష్టపడుతున్నారో.. వారికి అర్థం కావడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎలాగైనా సరే ఎప్పటికప్పుడు కుటుంబంతో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. అలాగే మీ వృత్తిఉద్యోగాల కారణంగా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ఆఫీసు పనిని ఇంటికీ, ఇంటి విషయాలను ఆఫీసుకీ తీసుకురాకండి. అలాగే కుటుంబ సభ్యుల పుట్టిన రోజు.. లేదా పెళ్లి రోజు వంటి ప్రత్యేక సందర్భాలలో వారికి చిన్న చిన్న కానుకలు ఇవ్వడం మరిచిపోకండి. ఇలా చేయడం వల్ల మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సంబంధాలు చక్కగా ఉన్నప్పుడే, ఫ్యామిలీ లైఫ్ బాగున్నప్పుడే సమాజంలోని ఇతరులతో కూడా సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అప్పుడే జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది!
అలాగే మీ హ్యాపీ ఫ్యామిలీ సీక్రెట్స్‌ ఏంటో మాతో పంచుకోవడం మర్చిపోకండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్