వాళ్ల వాలుజడ నాలుగడుగులు దాటాల్సిందే.. ఎందుకో తెలుసా?

తమ వాలు కురులతో రియల్‌ లైఫ్‌ రాపంజెల్స్‌గా పిలిపించుకుంటూ తమ గ్రామానికి ‘లాంగ్‌ హెయిర్‌ విలేజ్‌’గా పేరుప్రఖ్యాతులూ తీసుకొచ్చారీ మహిళలు. మరి, ఇంతకీ ఎవరా మహిళలు? ఎక్కడుందా గ్రామం? వారి పొడవాటి జుట్టు వెనకున్న రహస్యాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

Published : 08 Aug 2023 12:26 IST

పొడవుగా, ఒత్తుగా ఉండే జుట్టంటే అమ్మాయిలకెంతో ఇష్టం! పైగా ఇది వారికి అదనపు అందాన్ని తీసుకొస్తుంది కూడా! నిజానికి ఇలాంటి పొడవాటి జుట్టున్న అమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. వారి వాలుజడతో ప్రత్యేకంగా నిలుస్తుంటారు. కానీ ఇలా ఆ గ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అమ్మాయిల దగ్గర్నుంచి అమ్మమ్మల దాకా.. ప్రతి ఒక్కరి జుట్టూ మోకాళ్ల కింది వరకు ఉంటుందట! ఇక కొంతమంది జుట్టైతే వాళ్ల ఎత్తునే మించిపోతుందట! జీవితంలో ఒక్కసారి మినహా హెయిర్‌ కట్‌ అంటేనే ఎరుగని వారు.. తమ పొడవాటి జుట్టుతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. అంతెందుకు.. ఈ మధ్యే జరిగిన ‘లాంగ్‌ హెయిర్‌ ఫెస్టివల్‌’లో భాగంగా గిన్నిస్‌ రికార్డునూ సృష్టించారీ మహిళలు. తమ వాలు కురులతో రియల్‌ లైఫ్‌ రాపంజెల్స్‌గా పిలిపించుకుంటూ తమ గ్రామానికి ‘లాంగ్‌ హెయిర్‌ విలేజ్‌’గా పేరుప్రఖ్యాతులూ తీసుకొచ్చారీ మహిళలు. మరి, ఇంతకీ ఎవరా మహిళలు? ఎక్కడుందా గ్రామం? వారి పొడవాటి జుట్టు వెనకున్న రహస్యాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

హుయాంగ్లుయో విలేజ్ దక్షిణ చైనాలోని గుయ్‌లిన్‌ నగరానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ గ్రామం. చాలా గ్రామాల్లాగే ఇక్కడా కనీస సదుపాయాలకు కొదవ లేదు. కానీ ఒక్క ప్రత్యేకత మాత్రం ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే మేటిగా నిలబెట్టింది. అదేంటంటే.. ఇక్కడి మహిళలకు ఉన్న పొడవాటి జుట్టు.

నాలుగడుగులకు పైమాటే!

పొడవాటి జుట్టంటే.. నడుముపై పడే వాలుజడ అనుకుంటే పొరపాటే! ఎందుకంటే ఇక్కడి మహిళల జుట్టు పొడవు కనీసం నాలుగడుగులు ఉంటుందట! ఇక కొంతమందికి ఐదడుగులు, మరికొందరి కేశాలు తమ ఎత్తునే మించిపోయేంత పొడవుగా ఉంటాయట! అయితే ఇలాంటి పొడవైన జుట్టు కేవలం అక్కడి అమ్మాయిలకే సొంతం కాదు.. అమ్మమ్మలు, నానమ్మల వయసులో ఉన్న వారూ వాలు కురులతో హొయలు పోతుంటారట!

‘యావో’ తెగకు చెందిన ఇక్కడి మహిళలు తమ జీవితంలో ఒకే ఒక్కసారి జుట్టు కత్తిరించుకుంటారట! అది కూడా 18 ఏళ్ల వయసులో నిర్వహించే ‘కేశ ఖండన’ వేడుకలో భాగంగా ఇలా చేస్తారట! తోటి మహిళలూ ఈ వేడుకలో పాల్గొని పెద్ద ఎత్తున సెలబ్రేట్‌ చేస్తుంటారట! తమ తెగకు చెందిన మహిళలు పూర్వకాలం నుంచి ఇలా జుట్టును పెంచుకుంటున్నట్లు, ఈ పురాతన సంప్రదాయాన్ని తామూ కొనసాగించడం వల్ల తమ పూర్వీకులు ఎప్పుడూ తమతోనే ఉన్నట్లుగా భావిస్తున్నామని వారు చెబుతారు.

సీక్రెట్‌ అదేనా?

జుట్టును పొడవుగా పెంచుకోవడమే కాదు.. దాన్ని అందంగా అలంకరించుకోవడంలోనూ ముందుంటారు యావో మహిళలు. ఈ క్రమంలో పెళ్లి కాని అమ్మాయిలు స్కార్ఫ్‌తో జుట్టుకు హంగులద్దితే.. పెళ్లైన మహిళలు తల ముందు భాగంలో పెద్ద బన్‌ మాదిరిగా హెయిర్‌స్టైల్‌ వేసుకుంటారట! ఇక ఈ మహిళల జుట్టు ఇంత పొడవుగా, ఒత్తుగా ఉందంటే ఎన్ని కేశ సంరక్షణ చికిత్సలు, చిట్కాలు పాటిస్తున్నారో.. అనుకుంటున్నారా? ఎలాంటి చికిత్సలతో సంబంధం లేకుండా.. సహజసిద్ధమైన చిట్కాలతోనే తమ కేశ సంపదను పెంచుకుంటున్నామని చెబుతున్నారు యావో పడతులు. ఈ క్రమంలో బియ్యం కడిగిన నీళ్లను జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగించడం, తేయాకు-ఇతర మూలికలతో తయారుచేసిన సహజసిద్ధమైన షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవడం, జుట్టు సంరక్షణకు ఆల్కలైన్‌ నీళ్లు వాడడం.. వంటివి పాటిస్తుంటారట వీరు. ఇవే కాదు.. ప్రొటీన్లు అధికంగా ఉండే బీన్స్‌నూ తరచూ ఆహారంలో తీసుకోవడం తమకు అలవాటని చెబుతున్నారు. ఇలా పొడవాటి జుట్టుతో ‘చైనీస్‌ రియల్‌ లైఫ్‌ రాపంజెల్స్‌’గా పేరు తెచ్చుకున్నారీ యావో మహిళలు. అంతేకాదు.. ఈ ప్రత్యేకతతో ఈ గ్రామానికి ‘లాంగ్‌ హెయిర్‌ విలేజ్‌’గానూ గుర్తింపొచ్చింది.

‘గిన్నిస్‌’లోనూ చోటు!

యావో మహిళలు తమ పొడవాటి జుట్టుతో ప్రపంచం దృష్టిని ఆకర్షించడమే కాదు.. ఈ మధ్యే గిన్నిస్‌ రికార్డు కూడా సృష్టించారు. ఈ ఏడాది మేలో జరిగిన ‘Longji Long Hair Festival’లో భాగంగా.. గిన్నిస్‌ రికార్డే లక్ష్యంగా బరిలోకి దిగారు 256 మంది యావో మహిళలు. ఈ క్రమంలో అక్కడి ఓ నదీ తీరానికి చేరుకున్న వీరు.. ఒకరి వెనకాల మరొకరు నిల్చొని చెక్క దువ్వెనలతో తమ జుట్టును దువ్వుతూ.. 456 మీటర్ల (1,496 అడుగుల) మేర పొడవాటి చెయిన్‌గా ఏర్పడ్డారు. దీంతో ‘లాంగెస్ట్‌ హెయిర్‌ కోంబింగ్‌ చెయిన్‌’గా ఇది గిన్నిస్‌ రికార్డు పుటల్లోకి ఎక్కింది. అంతేకాదు.. ఇందులో పాల్గొన్న మహిళలంతా ఎరుపు-నలుపు రంగులు కలగలిపి రూపొందించిన సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై.. ‘లాంగ్‌ హెయిర్‌ బల్లాడ్‌’ అంటూ పాటలు పాడుతూ మరీ ఈ వేడుక చేసుకోవడం.. ప్రధాన ఆకర్షణగా నిలిచింది.. ఇలా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించి మరోసారి ప్రపంచం దృష్టిని తమ వైపు తిప్పుకున్నారీ చైనీస్‌ రాపంజెల్స్.

Photos: Guinness World Records

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్