Ishita Shukla: స్టార్ స్టేటస్‌ను కాదని.. దేశ సేవను ఎంచుకుంది!
తండ్రి పెద్ద నటుడు.. ఎంపీ.. నిర్మాతగానూ ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.. కావాలంటే ఆయన పేరుప్రఖ్యాతులతో సినిమాల్లోకి రావచ్చు.. కానీ అలాంటి స్టార్ స్టేటస్‌ను పక్కన పెట్టి.. దేశానికి సేవ చేయడమే తన పరమావధిగా....
(Photos: Instagram)
తండ్రి పెద్ద నటుడు.. ఎంపీ.. నిర్మాతగానూ ఆయనకు ఇండస్ట్రీలో మంచి పేరుంది.. కావాలంటే ఆయన పేరుప్రఖ్యాతులతో సినిమాల్లోకి రావచ్చు.. కానీ అలాంటి స్టార్ స్టేటస్‌ను పక్కన పెట్టి.. దేశానికి సేవ చేయడమే తన పరమావధిగా ఎంచుకుంది ఆ అమ్మాయి. ‘అగ్నిపథ్’ పథకంలో భాగంగా.. ఇటీవలే రక్షణ రంగానికి ఎంపికై తన తండ్రికి పుత్రికోత్సాహాన్ని రెట్టింపు చేసింది. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ భోజ్‌పురీ నటుడు రవి కిషన్ గారాలపట్టి ఇషితా శుక్లా. తన కూతురు త్రివిధ దళాల్లో చేరినందుకు గర్వంగా ఉందంటూ.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారాయన. దీంతో ఇషితపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రక్షణ రంగంలో చేరాలన్న ఆమె ఆలోచనను, తండ్రి ప్రోత్సాహాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ‘అసలైన దేశభక్తి అంటే మీదే’నంటూ ఈ తండ్రీకూతుళ్లను ప్రశంసిస్తున్నారు.
నటుల వారసులు నటనను ఎంచుకోవడం కామన్. స్టార్ కిడ్‌గా సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకోవడమూ సహజమే! కానీ తన తండ్రి వారసత్వంతో కాకుండా.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకోవాలనుకుంది ఇషిత. ఈ ఆలోచనతోనే చిన్నతనం నుంచి రక్షణ రంగం పైన ప్రేమను పెంచుకుందామె. ఇలా తన కూతురి ఇష్టాన్ని గుర్తించిన నటుడు రవి కూడా ఆమెను తనకు ఆసక్తి ఉన్న రంగంలోనే ప్రోత్సహించారు.
దేశభక్తి ఎక్కువ!
ప్రస్తుతం 21 ఏళ్లున్న ఇషితకు చిన్నతనం నుంచీ దేశభక్తి ఎక్కువ. ఈ మక్కువతోనే ఎన్‌సీసీలో చేరిన ఆమె.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం పరేడ్‌లో భాగంగా కర్తవ్య పథ్‌లో 148 మంది మహిళా క్యాడెట్లతో కలిసి కవాతు చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం దిల్లీ డైరెక్టరేట్‌కు చెందిన ‘7 గర్ల్స్ బెటాలియన్’లో క్యాడెట్‌గానూ కొనసాగుతోంది ఇషిత. దేశ సేవలో తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇషిత.. గత మూడేళ్లుగా ఇందుకోసం సన్నద్ధమవుతోంది.. కఠోర శిక్షణ తీసుకుంటోంది. ఇదే సమయంలో గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకం ఇషిత కలను నెరవేర్చుకునేందుకు మార్గం సుగమం చేసింది. దీంతో ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఆమె.. ఇటీవలే అర్హత సాధించింది. ఫలితంగా తన కూతురు త్వరలోనే రక్షణ రంగంలో చేరనుందంటూ తాజాగా ఈ విషయాన్ని సగర్వంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ మురిసిపోయారు నటుడు రవి.
అడుగడుగునా పుత్రికోత్సాహం!
పిల్లలు పుట్టినప్పటి కంటే వాళ్లు వృద్ధిలోకొచ్చినప్పుడే తల్లిదండ్రులకు అసలైన ఆనందం అంటుంటారు. అలాంటి ఎన్నో అనుభూతులు ఈ 21 ఏళ్లలో తన కూతురు తనకు అందించిందంటున్నారు రవి. ‘నా కూతురు ఇషిత.. చిన్నతనం నుంచీ ఎంతో ధైర్యవంతురాలు! అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా తనకు ఆర్మీలో చేరాలనుందన్న తన కోరికను గతేడాదే బయటపెట్టింది.. దేశ సేవ చేయాలన్న తన కోరిక తెలుసుకొని అప్పుడు ఎంతో సంతోషించా. ఇప్పుడు తన కల నెరవేర్చుకొని త్వరలోనే రక్షణ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోన్న నా కూతురిని చూసి గర్వపడుతున్నా. దేశ సేవ చేయాలన్న సంకల్పంతో తను గత మూడేళ్లుగా కష్టపడుతోంది. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్ కోసం.. గడ్డకట్టుకుపోయే చలిలో కఠోర సాధన చేసింది.. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే సంతోషం ఇంకేముంటుంది..?’ అంటూ తాజాగా తన కూతురు రక్షణ రంగానికి ఎంపికైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారాయన.
మాటల్లోనూ ధీరత్వం!
ఇషిత దేశభక్తి గురించి మాటల్లో చెప్పడం కంటే ఆమె ఇన్‌స్టా పేజీ చూస్తే ప్రత్యక్షంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె పెట్టే ఫొటోలు/వీడియోల్లో చాలావరకు ఎన్‌సీసీ యూనిఫాం ధరించినవి, ఆర్మీ శిక్షణ తీసుకుంటున్నవే ఉంటాయి. అంతేకాదు.. తాను పెట్టే పోస్ట్‌ల్లోనూ దేశభక్తి చాటుకుంటుందీ బ్రేవ్ టీన్.
‘జీవితం అంటే గాయాలకు భయపడడం కాదు.. అలాగని వాటి తాలూకు జ్ఞాపకాల్నీ తలచుకుంటూ అక్కడే ఆగిపోవడం కాదు.. ధైర్యంగా ముందుకెళ్తూ మనల్ని మనం నిరూపించుకోవడమే!’ అంటూ తన మాటల్లోనూ ధీరత్వాన్ని ప్రదర్శిస్తుంటుంది ఇషిత. ప్రస్తుతం దిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటోన్న ఆమె.. బాస్కెట్ బాల్ క్రీడాకారిణి, పెయింటర్ కూడా! తన చిత్రకళను పలు ఫొటోల రూపంలో అప్పుడప్పుడూ ఇన్‌స్టాలో పంచుకుంటుంటుందీ యంగ్ సోల్జర్.
మహిళా అగ్నివీర్!
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తాజాగా ఆర్మీకి ఎంపికైన ఇషితపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. స్టార్ స్టేటస్‌ని పక్కన పెట్టి.. ఆమె ఈ అరుదైన రంగాన్ని ఎంచుకోవడం, దేశ సేవ చేయడానికి పూనుకోవడం; రవి కూడా తన కూతురి ఆసక్తిని ప్రోత్సహించడంతో.. ఈ తండ్రీకూతుళ్లు నిజమైన దేశభక్తులంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. మరోవైపు ఇషిత ‘మహిళా అగ్నివీర్’ అంటూ పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
‘రేసుగుర్రం’తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన రవి కిషన్.. భోజ్‌పురీ మెగాస్టార్‌గా పేరు గాంచారు. ప్రస్తుతం రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. రవి-ప్రీతి శుక్లా దంపతులకు నలుగురు సంతానం. ఇషితనే కాదు.. మిగతా ముగ్గురు పిల్లల్నీ వారికి ఆసక్తి ఉన్న అంశాల్లో ప్రోత్సహిస్తున్నారీ స్టార్ కపుల్. వీరిలో ఒక కూతురు రివా కిషన్ ‘సబ్ కుశల్ మంగళ్’ అనే చిత్రంతో ఇప్పటికే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగా.. మరో కూతురు తనిష్కా శుక్లా ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను స్థాపించి.. వ్యాపారంలో రాణిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.