ఇరవైల్లో.. మెప్పించారు!

చదువుకుంటూ మరో కళలో ప్రవేశం పొందడమే కష్టం! అలాంటిది ఈ అమ్మాయిలు రెండు పదులు కూడా నిండకుండానే వివిధ రకాల నాట్యాలు, క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు.

Published : 15 Feb 2023 00:19 IST

చదువుకుంటూ మరో కళలో ప్రవేశం పొందడమే కష్టం! అలాంటిది ఈ అమ్మాయిలు రెండు పదులు కూడా నిండకుండానే వివిధ రకాల నాట్యాలు, క్రీడల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. హైదరాబాద్‌ అమ్మాయి గౌరవీరెడ్డి నాట్యప్రతిభతో రాష్ట్రపతి నుంచి అవార్డుని అందుకుంటే.. క్రీడల్లో ప్రతిభ చూపించి  విశాఖపట్నం యువతి శ్రుతి ఎన్‌సీసీలో అత్యుత్తమ బ్యాడ్జీని  అందుకుంది..


మోదీ అలా అన్నారు..

17 ఏళ్లకే ఎన్నో ప్రాచీన నాట్యరీతుల్ని ఒడిసిపట్టి.. వాటిని భవిష్యత్‌ తరాలకు అందించాలని తపన పడుతోంది హైదరాబాద్‌ అమ్మాయి గౌరవీరెడ్డి. ఇటీవలే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలపురస్కార్‌ అవార్డునీ అందుకుంది... ‘నాన్న చంద్రశేఖర్‌రెడ్డి జర్మన్‌ ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారు.అమ్మ తరుణకి నాట్యమంటే ప్రాణం. కానీ నేర్చుకోలేక పోయింది. నాకు మూడేళ్లున్నప్పుడు ఓ రోజు సంగీతానికి తగ్గట్టు అద్భుతంగా డ్యాన్స్‌ చేశానట. అదిచూసి గురువు ఉషామంజరి వద్ద కూచిపూడి నేర్పించింది అమ్మ. నాలుగేళ్లప్పుడే పళ్లెంపై చేసే తరంగం ప్రదర్శించా. చదువూ, ఆటలపైనా ఆసక్తి ఉన్నా.. ప్రాచీన నాట్యకళారీతులపై అధ్యయనం చేయాలన్నదే నా లక్ష్యం. ఆ క్రమంలోనే గురువు రంగమణి వద్ద అత్యంత క్లిష్టమైన సింహనందిని నృత్యాన్ని నేర్చుకొని అమెరికాలో ఆటా సిల్వర్‌జూబ్లీ వేదికపై 11 ఏళ్లకే ప్రదర్శన ఇచ్చా. అది మొదలు అనేక నృత్యాలు నేర్చుకున్నా. మినిస్ట్రీ ఆఫ్‌ ఎమ్మెస్‌ఎమ్‌ఈ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల్లో 100 దేశాల అతిథులెదుట 22 నిమిషాల్లో కూచిపూడి, మణిపురి, ఒడిస్సి, కథక్‌, భరతనాట్యం, మోహినీయాట్టం నృత్యాలను ఒకే వేదికపై చేసి, ప్రశంసలు అందుకున్నా. పశుపతినాథ్‌, చార్‌ధామ్‌, శ్రీశైలంలో చేసిన నాట్యాలని మరువలేను. తిరుమలలో కూచిపూడి, కథక్‌తో చేసిన జుగల్‌బందీ నాట్యం కూడా అటువంటిదే. ఇప్పటివరకు దేశవిదేశాల్లో 315 నృత్య ప్రదర్శనలిచ్చా. మన నృత్యాలపై అందరికీ అవగాహన కలిగించడానికి లఘుచిత్రాన్ని రూపొందించా. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవానికి రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా రాష్ట్రీయ బాలపురస్కార్‌ అవార్డు అందుకోవడం, ప్రధాని మోదీని కలుసుకోవడం సంతోషంగా అనిపించింది. 18వ శతాబ్దానికి చెందిన నృత్యరూపకాలను వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నా అంటూ మోదీతో నా మనసులో మాట చెప్పినప్పుడు దీనికోసం ప్రత్యేకంగా సెల్‌ ఉందనీ, అందులో చేరి పరిశోధన చేపట్టొచ్చనీ ఆయన సలహా ఇచ్చారు. ఫ్యాషన్‌ టెక్నాలజీ పూర్తయిన తర్వాత డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించి, ఆసక్తి, ప్రతిభ ఉన్న పేద ఆడపిల్లలకు నృత్యంలో శిక్షణనిచ్చి ప్రోత్సహించాలనేది నా ఆశయం’. అంటోంది గౌరవీ.


దేశభక్తిని నిరూపించుకొని

డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌సీసీ కమాండెంట్‌ బ్యాడ్జీని అందుకోవడం అంత సులభం కాదు. ఇటు క్రీడల్లో ప్రతిభ... అటు దేశభక్తి నిరూపించుకున్న వారికే ఇది దక్కుతుంది. అలాంటి అత్యుత్తమ స్థాయి బ్యాడ్జీని ఈ ఏడాది విశాఖపట్నానికి చెందిన శ్రుతీసింగ్‌ అందుకుంది... ఈ బ్యాడ్జీ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి నాలుగువేల మంది క్యాడెట్లు పోటీ పడ్డారు. అన్ని రంగాల్లోనూ శభాష్‌ అనిపించుకుని ఈ బ్యాడ్జ్‌ని సొంతం చేసుకుంది శ్రుతి. ‘బుల్లయ్య కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నా. నాన్న ప్రతాప్‌సింగ్‌ తోమర్‌, అమ్మ రామేశ్వరి. తాతయ్య సైన్యంలో పనిచేయడంతో నాకు బాల్యం నుంచి రక్షణ రంగంలో సేవలందించాలని కోరిక. అందుకే ఇంజినీరింగ్‌లో ఎన్‌సీసీలో చేరా. గత ఏడాది ఇండియన్‌ వాటర్‌మెన్‌షిప్‌ శిక్షణలో భాగంగా యాచింగ్‌లో ప్రతిభ చూపా. విశాఖలోనే జరిగిన ఈ శిక్షణకు పుదుచ్చేరి, అండమాన్‌, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 27 నౌకాదళ బృందాలు పోటీకి వచ్చాయి. వీరందరితో పోటీపడి సముద్రంలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచా. నేను లెవెల్‌-1 సెయిలర్‌ని కూడా. బంగాళాఖాతం సముద్ర జలాల్లో దీనికి సంబంధించిన శిక్షణ పూర్తిచేసుకున్నా. ఇంటర్‌ యూనిట్‌ పోటీల్లో .22 రైఫిల్‌ షూటింగ్‌లోనూ ప్రతిభ చూపా. ఇవన్నీ డీజీ బ్యాడ్జ్‌ వచ్చేందుకు సాయపడ్డాయి. ముఖ్యంగా మనలోని దేశభక్తి, చొరవ, ఉత్సాహం, నిర్వహణ సామర్థ్యాలు, నడక, నడత వంటివన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. ఇందుకోసం నిశిత పరిశీలన ఉంటుంది. భోజనం చేస్తున్నపుడు, విశ్రాంతి సమయాల్లో ఎలా ఉంటున్నాం అనేవి కూడా పరిశీలిస్తారు. విశాఖలో జరిగిన నౌ సైనిక్‌ శిబిరంలో వీటన్నింటినీ చూసిన తరువాత ఆ పతకానికి నన్ను ఎంపిక చేశారు. ఇవేకాదు కిక్‌ బాక్సింగ్‌, కరాటేలోనూ జాతీయ స్థాయి బంగారు పతకాలు సాధించా. స్కూబా డైవర్ని కావడంతో సముద్ర గర్భంలోని వ్యర్థాల ఏరివేతకు కృషి చేయాలనుకుంటున్నా’ అని చెబుతోంది.

-సురేష్‌ రావివలస, విశాఖపట్నం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్