మానసిక లోపాలున్నా మోడల్‌గా ఎదిగింది!

శారీరక, మానసిక లోపాలున్న వారు జీవితంలో ఎదగలేరన్నది చాలామంది భావన. అయితే ఇలాంటి సామాజిక ఒత్తిళ్లను, తమలోని లోపాల్ని అధిగమించి తమను తాము నిరూపించుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. ప్యూర్టోరికోకు చెందిన సోఫియా జిరౌ కూడా వీరిలో ఒకరు. పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ బాధితురాలైన ఆమె....

Published : 27 Feb 2022 14:47 IST

(Photo: Instagram)

శారీరక, మానసిక లోపాలున్న వారు జీవితంలో ఎదగలేరన్నది చాలామంది భావన. అయితే ఇలాంటి సామాజిక ఒత్తిళ్లను, తమలోని లోపాల్ని అధిగమించి తమను తాము నిరూపించుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. ప్యూర్టోరికోకు చెందిన సోఫియా జిరౌ కూడా వీరిలో ఒకరు. పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ బాధితురాలైన ఆమె.. శారీరక, మానసిక లోపాల్ని అధిగమించి మోడల్‌గా ఎదిగింది. ఇక ఇటీవలే ప్రముఖ లోదుస్తుల కంపెనీ ‘విక్టోరియాస్‌ సీక్రెట్‌’కు తొలి డౌన్‌ సిండ్రోమ్‌ మోడల్‌గా ఎంపికై వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో తన చిరకాల కోరిక నెరవేరిందంటోన్న సోఫియా జీవితం ఎంతోమందికి ఆదర్శప్రాయం!

ప్రముఖ లోదుస్తుల బ్రాండ్‌ ‘విక్టోరియాస్‌ సీక్రెట్‌’ ఇటీవలే ‘లవ్‌ క్లౌడ్‌ కలెక్షన్‌’ పేరుతో ఓ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ఇందుకోసం వయసు, శరీరాకృతి, చర్మ ఛాయకు అతీతంగా ఉన్న 18 మంది మోడల్స్‌ను ఎంపికచేసింది. వీరిలో డౌన్‌ సిండ్రోమ్‌ (శారీరక, మానసిక ఎదుగుదలలో లోపాలుండడం)తో బాధపడుతోన్న సోఫియా జిరౌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విక్టోరియాస్‌ సీక్రెట్‌కు ఎంపికైన తొలి డౌన్‌ సిండ్రోమ్‌ మోడల్‌గా ఘనత సాధించింది సోఫియా.

మోడలింగ్‌ అంటే ఇష్టం!

1996లో ప్యూర్టోరికోలో జన్మించింది సోఫియా. పుట్టుకతోనే డౌన్‌ సిండ్రోమ్‌ బాధితురాలైన ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో తనలోని లోపాలు తన కెరీర్‌కు అడ్డంకి కాకూడదని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో గొప్ప మోడల్‌గా ఎదగాలని కలలు కన్న ఆమె.. ఆ దిశగానే అడుగులేసింది. తన 23 ఏళ్ల వయసులో న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌తో మోడలింగ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన సోఫియా.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. చాలామంది తమలోని శారీరక, మానసిక లోపాల గురించి బయటికి చెప్పుకోవడానికి వెనకాడుతుంటారు. కానీ ఆ లోపాలే తనను ఈ ప్రపంచానికి కొత్తగా చూపాయని, తనలోని ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా చేశాయంటోందీ యంగ్‌ మోడల్‌.

అదే నా సక్సెస్‌ మంత్రా!

‘మోడల్‌గా స్థిరపడాలనేది నా చిన్ననాటి కోరిక. అది నా 23 ఏళ్ల వయసులో న్యూయార్క్‌ ఫ్యాషన్‌ వీక్‌తో కార్యరూపం దాల్చింది. ఆ సమయంలో నా అరంగేట్రాన్ని ఎన్నో అంతర్జాతీయ పత్రికలు కొనియాడాయి. ఇక ఆ తర్వాత మోడల్‌గా పలు కంపెనీలకు పనిచేశా. ఈ క్రమంలో నేను సాధించిన విజయాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. చాలామంది శారీరక, మానసిక లోపాలున్న వారు ఏమీ సాధించలేమన్న ఆలోచనతో తమను తామే బంధించుకుంటుంటారు. కానీ ఇది తప్పని నిరూపించాలనుకున్నా.. నన్ను నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారీ నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.. ఇదే నాకు స్ఫూర్తి, ప్రోత్సాహం! ప్రతి ఒక్కరికీ తమ కలలు నెరవేర్చుకోవడానికి అంతర్గతంగా, బాహ్యంగా ఎలాంటి పరిమితులు ఉండవు. ఈ విషయం గ్రహిస్తే అన్నింటా గెలుపే మనకు స్వాగతం పలుకుతుంది..’ అంటూ తన మాటలతోనూ స్ఫూర్తి నింపుతోందీ సూపర్‌ మోడల్‌.

ఆంత్రప్రెన్యూర్‌గానూ..!

* కేవలం మోడల్‌గానే కాదు.. ఆంత్రప్రెన్యూర్‌గానూ మారింది సోఫియా. 2019లో ‘Alavett’ (అంటే ఇంగ్లిష్‌లో I Love It అని అర్థం. ఈ పదబంధం అంటే ఆమెకు చాలా ఇష్టమట!) పేరుతో ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ స్టోర్‌ తెరిచింది. స్వతహాగా ఫ్యాషన్‌ డిజైనర్‌ అయిన ఆమె.. ఈ వేదికగా తాను రూపొందించిన దుస్తులు, యాక్సెసరీస్‌, ఇంటికి కావాల్సిన వస్తువులెన్నో విక్రయిస్తోంది.

*ప్రస్తుతం Inprende అనే ప్యూర్టోరికో కంపెనీకి రాయబారిగా కొనసాగుతోన్న ఈ బ్యూటీ.. యూరప్‌లో జరగబోయే ఫ్యాషన్ వేదికల పైనా మెరవాలని ఆరాటపడుతోంది.

* సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ చిన్నది.. తన అభిరుచులు, ఆహారపుటలవాట్లనూ ఈ వేదికగా పంచుకుంటుంది.

* వ్యాయామాలు చేయడాన్నీ ఇష్టపడే సోఫియాకు బరువులెత్తడమంటే మక్కువట! ఇక తనకు నచ్చే క్రీడ ఏంటని అడిగితే.. వాలీబాల్‌ అని సమాధానమిస్తోందీ క్యూటీ. తను ఇంత చురుగ్గా ఉండడానికి అదే కారణమంటోంది.

* మోడలింగ్‌ కాకుండా తనకు మరో కల కూడా ఉందట! అదేంటంటే.. స్టేజీ పైన డ్యాన్స్‌ చేయడం. ఈ ఇష్టంతోనే చిన్నతనం నుంచి బ్యాలే డ్యాన్స్‌ క్లాసులకు హాజరయ్యానని.. ఎప్పటికైనా తన కల నెరవేర్చుకుంటానని నిండైన ఆత్మవిశ్వాసంతో చెబుతోంది సోఫియా.

* కాస్త బబ్లీగా ఉన్నప్పటికీ ఫిట్‌నెస్‌కి, చక్కటి శరీరాకృతిని సొంతం చేసుకోవడానికి అధిక ప్రాధాన్యమిస్తానంటోందీ బ్యూటిఫుల్‌ మోడల్‌. ఈ క్రమంలోనే పిజ్జా, స్వీట్స్‌, ఫ్రైడ్‌ ఫుడ్స్‌.. వంటి అనారోగ్యపూరిత ఆహార పదార్థాల్ని పక్కన పెట్టి ప్రొటీన్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానంటోంది.

* తానెంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి తగిన సమయం కేటాయిస్తానంటోంది సోఫియా. తన విజయాలకు తన తల్లిదండ్రులు, తోబుట్టువులు అందించిన ప్రోత్సాహం కూడా కారణమంటోన్న ఆమె.. తన ఫ్యామిలీతో గడిపిన క్షణాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ మురిసిపోతుంటుంది.

* శారీరక, మానసిక లోపాల్ని అధిగమించి తన జీవితంలో సానుకూల దృక్పథాన్ని నింపుకొన్న సోఫియా.. పాజిటివిటీ నింపే స్ఫూర్తిదాయక పోస్టుల్ని సోషల్‌ మీడియాలో తరచూ పోస్ట్‌ చేస్తుంటుంది. ఫలితంగా ఎంతోమందిలో నిరాశను దూరం చేస్తుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్