Updated : 30/07/2021 14:59 IST

ఆ హౌస్‌బోట్‌లో రెండు నెలలు నరకం చూపించాడు!

ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు.. వారికి సహాయం చేద్దామన్న కళ్ల కంటే వారివైపు కామంతో చూసే కళ్లే ఎక్కువగా ఉంటాయి. అలాంటి కామాంధుల చేతిలో బలయ్యే అమ్మాయిలు కొందరైతే.. వారి చేతిలో నరకం అనుభవించి ఎలాగోలా బయటపడే వారు మరికొందరు. అయితే అలా బయటపడినప్పటికీ వారికి జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పుకోవడానికి ఏ అమ్మాయీ ముందుకు రాదు. కారణం.. సమాజం నుంచి వారికి ఛీత్కరింపులు ఎదురవుతాయన్న ఆలోచనకు తోడు.. తమ కుటుంబ పరువు ఎక్కడ బజారుకెక్కుతుందోనని పేరెంట్స్‌ వారి నోరు నొక్కేయడమే! ఇలా ఎందరో అమ్మాయిలు తమపై జరిగిన అత్యాచారాన్ని తమలోనే దాచుకొని కుమిలిపోతున్నారు. కానీ తాను అలా కాదని, తన జీవితంలో జరిగిన భయంకరమైన సంఘటన గురించి అందరికీ తెలియజేసి అమ్మాయిల్ని మరింత అలర్ట్‌ చేయాలనుకున్నానంటోంది ఆస్ట్రేలియాకు చెందిన మాజీ సర్ఫర్‌ కార్మెన్‌ గ్రీన్‌ట్రీ. ఈ క్రమంలో తనకు ఎదురైన ఆ భయంకరమైన అనుభవాలను, తాను పడిన నరకయాతనను ‘ఎ డేంజరస్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌’ అనే పుస్తకం పేరుతో విడుదల చేసింది. ఈ పుస్తకం విడుదలై చాలా రోజులైనప్పటికీ - ఒంటరి ప్రయాణాల్లో అందులోనూ విదేశాలకు, కొత్త ప్రాంతాలకు వెడుతున్నప్పుడు మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో కార్మెన్ అనుభవాలు తెలియజేస్తాయి.

హాయ్‌.. నేను కార్మెన్‌ గ్రీన్‌ట్రీ. ఆస్ట్రేలియాకు చెందిన సర్ఫర్‌గా నేను మీ అందరికీ సుపరితమే! నాకు చిన్నతనం నుంచి సర్ఫింగ్‌ అంటే ప్రాణం. ఏ నాటికైనా ఈ క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాలని, వివిధ పోటీల్లో భాగంగా ప్రపంచమంతా చుట్టేయాలని కలలు కన్నా. అప్పుడు నాకు 22 ఏళ్లు. వరల్డ్‌ టూర్‌లో భాగంగా నిర్వహించిన పోటీలకు అర్హత సాధించలేకపోయా. దాంతో తీవ్ర నిరాశకు గురయ్యా.. ఎందుకంటే ఈ పోటీల్లో పాల్గొనాలన్నది నా ఏడేళ్ల కల.. శ్రమ! పగలూ-రాత్రీ తేడా లేకుండా క్రీడ పైనే దృష్టి సారించా.. ఎంతో కష్టపడ్డా. అయినా ఫలితం నా చేజారిపోయేసరికి భరించలేకపోయా. అందుకే ఆట నుంచి కాస్త విరామం తీసుకుందామని ఆ క్షణమే నిర్ణయించుకున్నా.

వారి మాటలు నమ్మి మోసపోయా!

ఈ క్రమంలోనే ధర్మశాలలోని (హిమాచల్‌ ప్రదేశ్‌) దలైలామా ఆశ్రమంలో ఓ ఆధ్యాత్మిక కోర్సు నేర్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నా. ఆ కోర్సు కోసమే ఆస్ట్రేలియా నుంచి ఇండియా చేరుకున్నా. దిల్లీ విమానాశ్రయంలో దిగినప్పుడు కొందరు వ్యక్తులు నా వద్దకొచ్చి కశ్మీర్‌ నుంచి ధర్మశాల వెళ్లడం సులువని చెప్పడంతో వారి మాయమాటల్లో పడ్డా. నిజానికి రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి 14 గంటల్లోనే ధర్మశాలకు చేరుకోవచ్చని ట్రావెల్‌ గైడ్‌ బుక్‌లో ఉన్నా ఆలోచించలేకపోయా. ఆపై శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌లో దిగాక ఓ వ్యక్తి నన్ను రిసీవ్‌ చేసుకున్నాడు. ప్రభుత్వ పర్యటక విభాగం సిబ్బందినని చెప్పాడు. రాత్రంతా దాల్‌ సరస్సులోని హౌస్‌బోట్‌లో ఉండి ప్రకృతి అందాలను ఆస్వాదించడం ఓ గొప్ప అనుభూతి అని, తాను ఉండగా నాకేమీ భయం లేదని చెప్పి నన్ను ఒప్పించాడు. అంతేకాదు.. తెల్లవారగానే ధర్మశాలకు వెళ్లే ఏర్పాట్లు చేస్తానని నాకు హామీ కూడా ఇచ్చాడు. కానీ అదే నేను నా జీవితంలో వేసిన తప్పటడుగు అని, అలాంటి ఎన్నో రాత్రులు నా జీవితంలో కాళరాత్రులుగా మిగిలిపోతాయని నేను ఆ క్షణం ఊహించలేకపోయా!

రెండు నెలలు నరకం చూశా!

గొర్రె కసాయిని నమ్మినట్లు నేను ఆ వ్యక్తిని నమ్మి ఆ హౌస్‌బోట్‌లోనే బందీనయ్యా! నా పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లన్నీ అతను స్వాధీనం చేసుకున్నాడు. నా దగ్గరున్న డబ్బూ లాగేసుకున్నాడు. ఇక ఆ రోజు నుంచి అతను రోజూ రాత్రి నాపై అత్యాచారానికి పాల్పడేవాడు. వద్దని వారించినా వినిపించుకునేవాడు కాదు. నన్ను వదిలిపెట్టమంటే మరింత ఎక్కువగా హింసించేవాడు. అలా రెండు నెలల పాటు అతను నాకు నరకం చూపించాడు. ఈ రెండు నెలల్లో అతను నాపై ఎన్నిసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడో లెక్కేలేదు.. అంటే నా దీనస్థితిని మీరు అర్థం చేసుకోవచ్చు! ఈ పోరాటంలో చాలా అలసిపోయా. కనీసం ఆ దాల్‌ లేక్‌లో ఈత కొట్టుకుంటూ తప్పించుకుందామనుకుంటే ఆ ఛాన్స్‌ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే మళ్లీ అతని చేతికి చిక్కితే అతను పెట్టే నరకయాతన భరించే శక్తి నాకు లేదని అలాగే ఉండిపోయా. ఇంకా ఆ హౌస్‌బోట్‌లో అతని కుటుంబ సభ్యులు కూడా ఉండేవారు. కానీ వాళ్లలో ఎవరూ నేను ఈ ఆపద నుంచి బయటపడడానికి సహాయపడలేదు.

ఆ నరకం నుంచి అలా బయటపడ్డా!

ఇలా రెండు నెలల పాటు హౌస్‌బోట్‌లోనే చిక్కుకుపోయిన నేను నా కుటుంబంతో గానీ, స్నేహితులతో గానీ నా బాధను చెప్పుకునే అవకాశమే లేకుండా పోయింది. అయితే నేనో పెద్ద సమస్యలో చిక్కుకున్నట్లు ఓ రోజు నా ఫ్రెండ్‌కి ఓ కలొచ్చిందట! దాంతో తను ఆస్ట్రేలియన్‌ హై కమిషన్‌ను సంప్రదించగా నా పరిస్థితి గురించి బయటికి తెలిసింది. అప్పుడు కూడా నన్ను నిర్బంధించిన వ్యక్తి నన్ను వదల్లేదు. నా చేత నా పేరెంట్స్ కి ఫోన్ చేయించి డబ్బు కావాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఈ సమయంలోనే నేనెక్కడున్నానో గుర్తించిన పోలీసులు, జవాన్లు నేనున్న హౌస్‌బోట్‌ను చుట్టుముట్టారు. నన్ను నిర్బంధించిన వ్యక్తిని, అతని సోదరుడిని అరెస్ట్‌ చేసి నాకు ఆ నరకం నుంచి విముక్తి ప్రసాదించారు. అతడు పెట్టిన హింసకు భయపడి కోర్టులో సాక్ష్యమివ్వడానికి కూడా నేను మళ్ళీ ఇండియాకు వెళ్లలేకపోయా. దాంతో వారు ఆరు నెలల జైలు శిక్ష అనుభవించి విడుదలయ్యారు.. అప్పుడు ఇండియా వెళ్లి, అతనికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం ఇవ్వలేనందుకు ఇప్పటికీ బాధపడుతుంటాను..

అందుకే ఈ పుస్తకం!

ఈ భయానక సంఘటన జరిగి దాదాపు 15 ఏళ్లు దాటింది. ఇప్పుడు నేను నా భర్త, ముగ్గురు పిల్లలతో ఆనందంగా ఉన్నాను. అయినా ఇప్పటికీ ఆ పీడకల నా మెదడును తొలిచేస్తూనే ఉంది. ఒంటరి ప్రయాణం చేస్తున్న ఎందరో అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. అపరిచిత వ్యక్తులు చెప్పే మాటలు నమ్మితే ఎంతటి దారుణ పరిస్థితుల్లో చిక్కుకుంటామో నాకు ఎదురైన ఈ భయానక సంఘటనే సాక్ష్యం. అందుకే ఆ పీడకలను, దానికి సంబంధించిన భయానక అనుభవాలను ఓ పుస్తకంలో పొందుపరచాలనుకున్నా. ఆ అనుభవాల సారాంశమే ఈ పుస్తకం (ఎ డేంజరస్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్)! అమ్మాయిలూ.. ఈ పుస్తకం మీరూ చదవండి.. ఒంటరి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి.. టెక్నాలజీని నమ్ముకోండి.. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండండి!

అలాగే - జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక భయానక, విషాదకర సంఘటనలు ఎదురు కావచ్చు.. అలాగని వాటికి కుంగిపోకూడదు.. వాటినే తలుచుకుంటూ మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.. ఎలాంటి గాయాన్ని అయినా సరే మాన్పే శక్తి కాలానికి ఉంది..

గతంలో ఇలాంటి ఎన్ని విషాదకర అనుభవాలు ఎదురైనా సరే, జీవితం పైన ఆశ కోల్పోకుండా మళ్ళీ సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను..

ఇవి మన కోసమే!

ఒంటరి ప్రయాణాలు చేయడం, అపరిచిత వ్యక్తుల్ని నమ్మడం వల్ల అమ్మాయిలకు ఎంత ప్రమాదం పొంచి ఉందో చెప్పడానికి కార్మెన్‌ జీవితంలో జరిగిన ఈ చేదు సంఘటనే నిదర్శనం. అయితే అలాగని ఒంటరిగా ప్రయాణించడం తప్పని కాదు.. ఒకవేళ ఒంటరిగా వెళ్లాలనుకున్నా ఆయా ప్రదేశాల గురించి ముందే తెలుసుకొని అవగాహన పెంచుకోవడం ముఖ్యం. అలాగే విదేశాల్లో ఉండే భారతీయ రాయబార కార్యాలయం వివరాలూ మన మొబైల్‌లో అందుబాటులో ఉంచుకోవాలి. ఇక ఎవరో వస్తారు, మనల్ని రక్షిస్తారని కాకుండా.. మనల్ని మనమే కాపాడుకోవాలి.. ఇందుకోసం ఆత్మరక్షణ విద్యలు మనకు ఉపకరిస్తాయి. ఇక మనం ఎక్కడికెళ్తున్నాం.. వెళ్లిన చోట ఎక్కడ స్టే చేస్తున్నాం అన్న ప్రతి విషయాన్నీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఎప్పటికప్పుడు చేరవేయడం మరీ మంచిది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కడికైనా ఒంటరిగా, ధైర్యంగా ప్రయాణించచ్చు.. అమ్మాయిలూ..ఈ విషయాలు మీరూ గుర్తుపెట్టుకుంటారు కదూ!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని