Tattooed Skin : ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

ఫ్యాషన్‌, అభిరుచితో శరీరంపై ట్యాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే వాటిని చూసుకొని మురిసిపోవడం కాకుండా.. అక్కడి చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే.. పచ్చబొట్టు పొడిపించుకున్న చర్మం, దాని చుట్టూ.....

Published : 20 Jun 2022 18:03 IST

ఫ్యాషన్‌, అభిరుచితో శరీరంపై ట్యాటూలు వేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే వాటిని చూసుకొని మురిసిపోవడం కాకుండా.. అక్కడి చర్మం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే.. పచ్చబొట్టు పొడిపించుకున్న చర్మం, దాని చుట్టూ తరచూ అలర్జీలు, ర్యాషెస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. మరి, ఇలా జరగకూడదంటే.. ట్యాటూ వేయించుకున్న చర్మాన్ని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం..!

తేమనందించాలి!

ట్యాటూ వేయించుకునే క్రమంలో అక్కడి చర్మ కణాలు డ్యామేజ్‌ అవుతాయి. తద్వారా ఆ ప్రాంతమంతా తేమను కోల్పోయి నిర్జీవంగా మారిపోతుంది. అయితే దీన్ని తిరిగి పునరుత్తేజితం చేయాలంటే.. అక్కడ కొత్త కణాలు ఉత్పత్తి కావాలి. అందుకు మాయిశ్చరైజేషన్‌ ప్రక్రియ చక్కగా దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజుకు రెండుసార్లు ఆ ప్రాంతాన్ని సబ్బు, చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఆపై నీటి ఆధారిత మాయిశ్చరైజర్‌ను ట్యాటూ వేసుకున్న చర్మంపై, ఆ చుట్టుపక్కల పూయాలి. ఈ తరహా మాయిశ్చరైజర్‌ ఆ చర్మానికి చల్లదనాన్ని అందించడంతో పాటు అక్కడ కొత్త కణాలు ఉత్పత్తయ్యేలా చేస్తుంది. అలాగని మరీ ఎక్కువ మొత్తంలో ఈ క్రీములు, లోషన్లు పూయడం వల్ల అక్కడి చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి మోతాదులో ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి.

సన్‌స్క్రీన్‌ అందుకే..!

ట్యాటూ వేయించుకున్న చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడం కూడా ముఖ్యమేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే అతినీల లోహిత కిరణాల వల్ల ట్యాటూ కోసం వాడిన కొన్ని రకాల ఇంకులు రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది.. అంతేకాదు.. ఈ కిరణాల వల్ల ఆ చర్మ ప్రాంతంలో అలర్జీ వచ్చే అవకాశాలూ ఉన్నాయి. కాబట్టి ఎండ నుంచి రక్షణం పొందడానికి నీటి ఆధారిత SPF 30 సన్‌స్క్రీన్‌ను బయటికి వెళ్లడానికి పావుగంట ముందు అప్లై చేసుకోవాలి. అలాగే ప్రతి రెండు గంటలకోసారి దీన్ని అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.

రెండువారాల దాకా..!

ట్యాటూ వేయించుకున్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి అక్కడ కొత్త కణాలు పుట్టుకొచ్చే దాకా.. అంటే సుమారుగా రెండు మూడు వారాల పాటు ఆ చర్మ భాగంలో బ్యూటీ మాస్కులు, స్క్రబ్‌లు, వ్యాక్స్‌లు.. వంటివి అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి సహజసిద్ధమైనవే అయినా వీటివల్ల ఇన్ఫెక్షన్లు, ఇతరత్రా సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువంటున్నారు నిపుణులు. అలాగే చర్మానికి బిగుతుగా ఉండే దుస్తులు వేసుకుంటే గాయం మరింత రేగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి శరీరానికి వదులుగా, గాలి తలిగేలా ఉండే కాటన్ దుస్తుల్ని ఎంచుకోవాలి.

ఈత కొడుతున్నారా?

కొత్తగా ట్యాటూ వేయించుకున్న వారు రెండు మూడు వారాల దాకా ఈత కొట్టడం మానుకోమంటున్నారు నిపుణులు. ఎందుకంటే పూల్స్‌లోని నీటిలో క్లోరిన్‌, ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది ట్యాటూ వేయించుకున్న చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తుంది. అంతేకాదు.. ట్యాటూ కూడా త్వరగా రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రతికూలతల మధ్య అక్కడి చర్మం సాధారణ స్థాయికి చేరుకోవడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.

ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?

అయితే ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ట్యాటూ వేయించుకున్న దగ్గర చర్మం కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. చర్మం మరీ సున్నితంగా ఉన్న వారిలో బ్యాక్టీరియా దాడి చేసే ప్రమాదమూ లేకపోలేదంటున్నారు నిపుణులు. ఇది అక్కడి చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఫలితంగా అలర్జీ, ఎరుపెక్కడం, ర్యాషెస్‌.. వంటివి దాడి చేస్తాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేయకుండా చర్మ వ్యాధి నిపుణుల్ని సంప్రదించాలి. అలాగే ట్యాటూ ఆర్టిస్టులు వాడే అపరిశుభ్రమైన సూదులు, ఇంక్‌ వల్ల కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ట్యాటూ వేయించుకున్న దగ్గర చర్మం త్వరగా సాధారణ స్థితిలోకి రాకపోయినా, ఏవైనా ఇతర ఇన్ఫెక్షన్లు దాడి చేసినా ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్