Babymoon: మీరూ ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే ఇవి గుర్తుంచుకోండి!

పెళ్లయ్యాక దాంపత్య బంధంలో మరో మెట్టు ఎక్కి పేరెంట్స్ కాబోతున్నారంటే ఎవరికైనా సంతోషమే. పుట్టబోయే చిన్నారి రాకను ఎంజాయ్ చేస్తూనే, ఇటు దంపతులిద్దరూ కలిసి సంతోషంగా గడిపేందుకు చేసే మధుర యాత్రే బేబీమూన్. అటు ప్రెగ్నెన్సీ ఒత్తిళ్లను అధిగమించడానికి, ఇటు కెరీర్‌ నుంచి కాస్త విరామం తీసుకోవడానికి....

Published : 16 Aug 2022 18:54 IST

పెళ్లయ్యాక దాంపత్య బంధంలో మరో మెట్టు ఎక్కి పేరెంట్స్ కాబోతున్నారంటే ఎవరికైనా సంతోషమే. పుట్టబోయే చిన్నారి రాకను ఎంజాయ్ చేస్తూనే, ఇటు దంపతులిద్దరూ కలిసి సంతోషంగా గడిపేందుకు చేసే మధుర యాత్రే బేబీమూన్. అటు ప్రెగ్నెన్సీ ఒత్తిళ్లను అధిగమించడానికి, ఇటు కెరీర్‌ నుంచి కాస్త విరామం తీసుకోవడానికి ఇది చక్కటి వేదికవుతుందని చెబుతున్నారు నిపుణులు. అందుకే బాలీవుడ్‌ లవ్లీ జోడీ ఆలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ జంట కూడా తాజాగా ఇటలీలో తమ బేబీమూన్‌ని ఎంజాయ్‌ చేసొచ్చారు. మరో సెలబ్రిటీ జంట సోనమ్‌ కపూర్‌-ఆనంద్‌ అహుజా కూడా తమ బేబీమూన్‌ కోసం ఇటలీనే ఎంచుకున్నారు. ఇలా సెలబ్రిటీలే కాదు.. సామాన్యులూ ఈ రోజుల్లో ఈ ట్రెండ్‌ని కొనసాగించడం మనం చూస్తూనే ఉన్నాం. మరి, మీరూ బేబీమూన్‌ కోసం ప్లాన్‌ చేసుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది!

హనీమూన్‌, మినీమూన్‌లాగే బేబీమూన్‌ కూడా దాంపత్య బంధాన్ని మరింత దృఢం చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే మిగతా రెండు యాత్రలతో పోల్చితే బేబీమూన్‌ కోసం మరింత పకడ్బందీగా ప్రణాళిక వేసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే గర్భం ధరించాక అటు ఆరోగ్యం, ఇటు సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ యాత్ర కొనసాగిస్తేనే దీన్ని పూర్తిగా ఆస్వాదించగలమంటున్నారు.

రెండో త్రైమాసికంలోనే ఎందుకు?!

సాధారణ సమయాల్లోనే విహార యాత్రల కోసం ప్లాన్‌ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం. ఆరోగ్యంగా, ఆర్థికంగా, సెలవుల పరంగా.. ఇలా అన్నీ కుదిరాకే ఓ నిర్ణయానికొస్తాం. అలాంటిది గర్భిణిగా ఉన్నప్పుడు విహారయాత్రలంటే.. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. అయితే చాలామందికి ఏ నెలలో బేబీమూన్‌ ప్లాన్‌ చేసుకుంటే మంచిదన్న సందేహం ఉంటుంది. నిజానికి ఈ యాత్రకు రెండో త్రైమాసికమే అనువైన సమయం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే మొదటి త్రైమాసికంలో వేవిళ్లు, అలసట-నీరసం, కొంతమందిలో పొత్తి కడుపులో నొప్పి, అరుదుగా వెజైనల్‌ డిశ్చార్జి.. వంటి సమస్యలొస్తుంటాయి. ఇవి నెలలు గడిచే కొద్దీ దూరమవుతుంటాయి. ఇక మూడో త్రైమాసికంలో పొట్ట బాగా పెరిగిపోయి ఆయాసంగా, అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. శరీరం సులువుగా కదల్లేదు. కాబట్టి గర్భిణుల్లో ఎలాంటి సమస్యలు లేకపోతే రెండో త్రైమాసికమే బేబీమూన్‌ కోసం సరైన సమయం అంటున్నారు నిపుణులు. ఇలా ఎంత సౌకర్యంగా యాత్రకు వెళ్తే అంతగా ఎంజాయ్‌ చేయచ్చని సూచిస్తున్నారు.

డెస్టినేషన్‌.. సంగతేంటి?

బేబీమూన్‌ కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో ఎంచుకునే డెస్టినేషన్‌ కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని చెబుతున్నారు. అవేంటంటే..!

స్వదేశం, విదేశం.. ఇలా మీరు ఎంచుకునే పర్యటక ప్రదేశం ఏదైనా సరే.. అక్కడి వాతావరణం మీ శరీర స్థితికి సరిపడుతుందో, లేదో తెలుసుకోవాలి. ఉదాహరణకు.. కొంతమందికి చల్లటి ప్రదేశాలు పడవు.. మరికొందరు హ్యుమిడిటీ వాతావరణంలో ఎక్కువసేపు ఉండలేరు. వీటిని దృష్టిలో ఉంచుకొనే ఎక్కడికెళ్లాలో నిర్ణయించుకోవడం మంచిది.

ఇక మీరు వెళ్లే ప్రదేశం, అక్కడుండే హోటల్స్‌, ఇతర సౌకర్యాల గురించి కూడా ఓ చిన్నపాటి అధ్యయనమే చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చూడదగిన ప్రదేశాలకు, ఆస్పత్రులకు దగ్గర్లో ఉండే హోటల్స్‌ని ఎంచుకుంటే మంచిది.

దూర ప్రాంతాలైతే ఎలాగో విమానయానమే చేస్తాం. అయితే ముందుగా ఆయా విమానయాన సంస్థలకు సంబంధించిన ప్రయాణ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇక దగ్గరి ప్రాంతాలను ఎంచుకునేవారు తమ సొంత వాహనాన్ని ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే సొంత వాహనమైతే మధ్యమధ్యలో ఆపి.. కాసేపు నడుస్తూ సేదదీరచ్చు. పైగా గర్భిణులు ఎక్కువ సమయం కూర్చొని ఉండడం వల్ల జెస్టేషనల్‌ డయాబెటిస్‌ రిస్క్‌ కూడా పెరుగుతుందని ఓ అధ్యయనంలో తేలింది. కాబట్టి ప్రయాణంలో అలసట తెలియకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు తీసుకోవడం అన్ని విధాలా మంచిది.

డాక్టర్‌తో టచ్‌లోనే..!

బేబీమూన్‌ కోసం ప్లాన్‌ చేసుకునే క్రమంలో గర్భిణులు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవడం తప్పనిసరి! అలాగే ఈ సమయంలో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం. కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మీ వ్యక్తిగత డాక్టర్‌ని ఆన్‌లైన్‌లో లేదంటే ఫోన్‌లో సంప్రదించేందుకు ముందే అనుమతి తీసుకోవడం ఉత్తమం. ఇక మీ ప్రెగ్నెన్సీ రిపోర్టులు, మందుల ప్రిస్క్రిప్షన్లు మీ వెంటే తీసుకెళ్లాలి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా జాగ్రత్తపడచ్చు. వీటితో పాటు వేళకు ఆయా మందులు వేసుకోవడం, పొట్టలో బేబీ మూమెంట్స్‌ని చెక్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక హైరిస్క్‌ జోన్‌లో ఉన్న గర్భిణులు, తరచూ అబార్షన్లై ఆలస్యంగా గర్భం ధరించిన వారు ఇలాంటి యాత్రల్ని ఎంచుకోకపోవడమే మంచిదన్నది నిపుణుల సలహా.

సాహసాలు వద్దు!

విహారయాత్రలంటే చాలు.. చాలామంది సాహస క్రీడలపై మక్కువ చూపుతుంటారు. కొంతమంది గర్భిణులు కూడా తమ శరీరానికి వ్యాయామం మంచిది కదా అన్న ఉద్దేశంతో కిలోమీటర్ల కొద్దీ నడక, కొండలెక్కడం, స్కీయింగ్‌.. వంటి సాహసకృత్యాల్ని ఎంచుకుంటుంటారు. మరికొంతమంది రోప్‌వే వంటి ప్రమాదకర ప్రయాణాన్ని సైతం ఆస్వాదించాలనుకుంటారు. అయితే వీటివల్ల సరదా ఏమో గానీ గర్భిణులకు రిస్కే ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి అంత సరదాగా గడపాలనుకుంటే.. ప్రశాంతతను పంచే పచ్చటి ప్రదేశాలు, బీచ్‌లకు వెళ్లడం.. లేదంటే రిసార్ట్‌/హోటల్‌లోనే శరీరంపై ఒత్తిడి లేని ఇండోర్‌ గేమ్స్ ఆడుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం అంటున్నారు.

దృఢమయ్యే అనుబంధం!

ప్రెగ్నెన్సీ ఒత్తిళ్లను దూరం చేసుకుంటూ, కెరీర్‌ విరామాన్ని ఎంజాయ్‌ చేయడమే కాదు.. ఈ యాత్ర భార్యాభర్తల మధ్య అనుబంధాన్నీ దృఢం చేస్తుందంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. ఇంట్లో ఉంటే అటు పనులు, ఇటు ఆఫీస్ అంటూ కనీసం కలిసి కబుర్లు చెప్పుకోవడానికి కూడా వీలుండకపోవచ్చు. బేబీమూన్‌లో ఆ కబుర్లన్నీ కలిసి చెప్పుకోవచ్చు.. ఇక మీ కుటుంబంలోకి రాబోయే పాపాయి కోసం ప్రణాళికలు వేసుకోవచ్చు. భవిష్యత్తులో మీరు చేయాలనుకుంటోన్న, చేయకూడదనుకుంటోన్న పనుల గురించీ చర్చించుకొని నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇవి కాకుండా ముద్దూముచ్చట్లు, రొమాన్స్‌.. వంటివి దంపతుల మధ్య ఎలాగూ ఉండనే ఉంటాయి. ఇలా ఇద్దరూ కలిసి గడిపే విలువైన సమయం ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుందంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్