‘మాడ్యులర్ కిచెన్’.. ఎలా ఉండాలంటే..?!

ట్రెండ్స్‌ మనకే కాదు.. మన ఇంటికీ అవసరమే! ఈ క్రమంలోనే కొంగొత్త ఇంటీరియర్స్‌తో ఇంటిని మోడ్రన్‌గా మార్చేస్తుంటారు మగువలు. ఈ నేపథ్యంలోనే మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో....

Published : 06 Sep 2022 20:09 IST

ట్రెండ్స్‌ మనకే కాదు.. మన ఇంటికీ అవసరమే! ఈ క్రమంలోనే కొంగొత్త ఇంటీరియర్స్‌తో ఇంటిని మోడ్రన్‌గా మార్చేస్తుంటారు మగువలు. ఈ నేపథ్యంలోనే మాడ్యులర్ కిచెన్‌కు ఈ రోజుల్లో ఆదరణ పెరుగుతోంది. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

ఎలక్ట్రిక్ కనెక్షన్స్..

వంటగదిలో ప్రస్తుతం గ్రైండర్, అవెన్, ఫ్రిజ్.. వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించడం మామూలైపోయింది. కాబట్టి ఇలాంటి పరికరాలు వినియోగించడానికి వీలుగా అవసరమైన చోట్లలో ప్లగ్ బోర్డ్స్ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఏ వస్తువును ఎక్కడ ఉంచాలనుకొంటున్నారో ముందుగానే ఒక అంచనా వేసుకోవాలి. లేదా మీ వద్ద ఉన్న, మీరు కొనాలనుకుంటున్న ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ గురించి ఇంటీరియర్ ఎక్స్‌పర్ట్‌కి ముందుగానే తెలియజేయాలి. ఫలితంగా వాటిని ఉపయోగించేందుకు వీలుగా కనెక్షన్స్ ఏర్పాటు చేస్తారు.

వెలుతురు ప్రసరించేలా..

వంటగదిలోకి సహజసిద్ధమైన వెలుతురు రావడం చాలా అవసరం. అలాగే గాలి కూడా బయటకు వెళ్లేలా ఏర్పాట్లుండాలి. కిటికీలు ఉన్న ప్రాంతంలో సింక్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వీలైతే ఆ కిటీకీలలో చిన్న చిన్న మొక్కలను పెట్టి చూడండి. అందంగా కనిపించడంతోపాటు లోపలికి తాజా గాలి ప్రసరించేలా చేస్తాయి. ఇక వంటగదిలోని పొగలు, ఘాటు వాసనలు ఎప్పటికప్పుడు బయటకు పోవడానికి కిటికీ తలుపులు తీసి ఉంచడంతోపాటు చిమ్నీ కూడా బిగించుకోవాలి.

సరుకులు భద్రంగా..

సాధారణంగా ఇంటి అవసరాలకు సరిపడా సరుకులన్నింటినీ మనం నెలకోసారి కొనుగోలు చేస్తుంటాం. అందుకే ఆ సరుకులన్నీ భద్రపరచడానికి వీలుగా అల్మరా లేదా డీప్ డ్రాలను నిర్మించుకోవాలి. సరుకులను విడివిడిగా సీసాల్లో నింపి వీటిలో పొందిగ్గా సర్దుకోవడం ద్వారా వంటగది నీట్‌గా కనిపించేలా జాగ్రత్తపడచ్చు.

సర్దుకోవడానికి వీలుగా..

వంటగదిలో రకరకాల పాత్రలు, స్పూన్లు, గరిటెల వంటివి ఉపయోగించడం మామూలే! మాడ్యులర్ కిచెన్స్ నిర్మించుకునేటప్పుడు వీటన్నింటినీ భద్రపరుచుకోవడానికి వీలుగా డ్రాయర్లను అమర్చుకోవాలి. వీటిలో రకరకాల చాకులు, స్పూన్‌లు, గరిటెలు.. మొదలైనవన్నీ వేటికవి విడివిడిగా పెట్టుకొనే సౌలభ్యం ఉండేలా జాగ్రత్తపడాలి. అప్పుడే వస్తువులు నీట్‌గా కనిపిస్తాయి. కావాల్సిన వస్తువు వెంటనే చేతికి దొరుకుతుంది. అయితే కేవలం ఇలా ర్యాక్స్‌ని అమర్చుకుంటేనే సరిపోదు.. వస్తువులను దేనికది విడదీసి దానికోసం కేటాయించిన స్థలంలోనే అమర్చడం కూడా తప్పనిసరి..

ప్రకాశవంతమైన రంగులు..

వంట గదిలో ఉపయోగించే ఇంటీరియర్స్, గోడకు వేసే పెయింటింగ్స్ రంగులు ప్రకాశవంతంగా ఉండేవే ఎంపిక చేసుకోవాలి. వంటగది కోసం ముదురు రంగులను అస్సలు ఉపయోగించకూడదు. వీటి కారణంగా సహజసిద్ధమైన వెలుతురు తగ్గిపోవడం మాత్రమే కాదు.. ఈ రంగులు గది చీకటిగా కనిపించేలా చేస్తాయి.

చూడచక్కని ఫ్లోరింగ్..

మాడ్యులర్ కిచెన్ చేయించుకున్నప్పుడు దానికి అనుగుణంగా ఫ్లోరింగ్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మీ అభిరుచికి తగినట్లుగా టైల్స్ లేదా వుడెన్ ఫ్లోరింగ్.. వంటివి ప్రయత్నించవచ్చు. అయితే ఫ్లోరింగ్ విషయంలో కూడా శుభ్రం చేయడానికి సౌకర్యవంతంగా ఉన్నవాటికే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఫలితంగా తక్కువ సమయంలోనే ఇంటిని శుభ్రం చేసేయచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్