Published : 01/11/2021 21:35 IST

మీ బంధం ఆరోగ్యకరంగానే ఉందా? చెక్ చేసుకోండి...

ప్రేమతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను పరిష్కరించవచ్చని మనందరికీ తెలుసు. కానీ అదే ప్రేమ పేరుతో ప్రమాదకరమైన మనుషులు మన జీవితంలోకి వస్తే ఆ విషయాన్ని శరీరం వెంటనే గుర్తించి కొన్ని రకాల హెచ్చరికలు చేస్తుందట. ఓ రిలేషన్‌షిప్‌లో నిరంతరమైన అసంతృప్తితో పాటు, శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తే తక్షణం ఆ మనుషులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలట.. మరి అలాంటి కొన్ని లక్షణాలేంటో తెలుసుకుందామా..!

తెలియని బాధ

అతడు/ఆమెతో మాట్లాడుతున్నంత సేపూ ఎంత సరదా సంభాషణ సాగినా సరే.. మీ కడుపులో ఏదో తెలియని బాధ, వణుకు పుట్టడం, వారు దూరంగా వెళ్లగానే ఆ ఇబ్బంది తొలగిపోవడం జరుగుతుంటే అవతలి వారిని మీ శరీరం నిరాకరిస్తోందని గుర్తించండి. వారి గురించి ఆలోచించినప్పుడు కూడా ఇలాంటి ఫీలింగే ఉంటే మీ బంధం ఆరోగ్యకరంగా లేనట్లే!

కండరాలు పట్టేయడం

ఆహారంలో, జీవన విధానంలో, ఆరోగ్యంలో, వాతావరణంలో ఎటువంటి మార్పులూ లేకపోయినా, నిరంతరం కండరాలు పట్టేస్తుంటే కాస్త మీ రిలేషన్‌షిప్‌పై దృష్టి పెట్టండి. హానికరమైన మనుషులతో ఉండడం వల్ల కూడా ఇలా జరిగే అవకాశముందట.

ఎందుకిలా..?

మనకు సరిపడని మనుషులతో సర్దుకుపోయే క్రమంలో మెదడు విపరీతమైన ఒత్తిడికి గురౌతుంది. దీనివల్ల శరీరంలో సహజంగా విడుదలయ్యే వ్యాధి నిరోధక కణాల సంఖ్య తగ్గుతుంది. అంతేకాకుండా నొప్పులను నివారించి, శరీరాన్ని ఉత్సాహంగా ఉంచే డోపమైన్ల శాతం గణనీయంగా పడిపోతుంది. దీనివల్ల కండరాలు బిగుసుకుపోయి, నొప్పిగా ఉంటాయి. ఇతరత్రా కారణాలేవీ కాదని తెలుసుకున్న తర్వాతే ఈ లక్షణాన్ని రిలేషన్‌షిప్‌కి అన్వయించుకోండి.

మాటల్లో తడబాటు, మతిమరుపు

విపరీతమైన ఒత్తిడికి, భయానికి గురైనప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు మాటలు తడబడటం, తరచూ విషయాల్ని మర్చిపోవడం జరుగుతుంది. మెదడుకి సంబంధించిన ఆరోగ్య సమస్య ఉన్నా ఇలా జరిగే అవకాశముంది. కానీ అటువంటి కారణాలేవీ లేకుండానే మీలో ఈ లక్షణాలు కనిపిస్తే భాగస్వామి విషయంలో మీ నిర్ణయాన్ని మరోసారి ప్రశ్నించుకోండి.

ఎందుకిలా..?

మంచి స్నేహాలు మన ఆత్మస్త్థెర్యాన్ని పెంచి, జీవితంలో ఎదగడానికి కారణమౌతాయి. అలాగే ప్రమాదకరమైన స్నేహాలు/బంధాలు మనకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూనే, మనలోని ఆత్మస్త్థెర్యాన్ని నెమ్మదిగా నాశనం చేసి తమ మీద పూర్తిగా ఆధారపడేలా చేస్తాయి. ఇలాంటి వారు స్లో పాయిజన్ కన్నా తక్కువేమీ కాదు. మానసికస్త్థెర్యం దెబ్బతినడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దగా కనిపించి అనవసరమైన ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. దీనివల్ల మాట తడబడటం, మర్చిపోవడం జరుగుతుంది.

నిద్రలేమి

వృత్తి/ చదువు పరంగా, కుటుంబం విషయంలోనూ ఎలాంటి ఒత్తిడీ లేకున్నా, ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యా లేకున్నా నిద్రలేమి బాధిస్తోందంటే దానికి మీ రిలేషన్‌షిప్ కారణమేమో చెక్ చేసుకోండి. ప్రియురాలు/ ప్రేమికుని గురించిన ఆలోచనలతో నిద్రపట్టకపోవడం సహజమే అయినా అది ఆందోళన కలిగించేలా తయారైతే మాత్రం అనుమానించాల్సిందే..

ఎందుకిలా..?

మంచి వ్యక్తుల సహవాసం మనసుకే కాదు శరీరానికీ సాంత్వననిస్తుంది. కానీ మనం ఎంతగానో ప్రేమించే మనుషుల ప్రవర్తన అనుమానాస్పదంగా తయారైనా, వారి మాటలకూ బాడీ లాంగ్వేజ్‌కూ పొంతన లేకపోయినా ఇటువంటి సమస్యలు కలుగుతాయి. ఎందుకంటే వారి ప్రవర్తనని డీకోడ్ చేయడానికి మెదడు విపరీతంగా శ్రమించడం వల్ల, ఆ ఒత్తిడి నిద్రలేమి (ఇన్‌సోమ్నియా)కి కారణమౌతుంది.

అసౌకర్యం

ఎప్పుడూ కలిసే స్నేహితుల మధ్యలో ఉన్నా అసౌకర్యంగా అనిపించడం, అందంగా లేమనిపించడం, ఏ దుస్తులూ నప్పలేదనిపించడం.. అప్పటి వరకూ ఎంతో ఇష్టంగా కలిసి విన్న పాటలు తెలియని ఇబ్బందిని కలిగించడం జరుగుతుంటే మీరు అబ్యూజివ్ రిలేషన్‌షిప్ (నిందాపూర్వక బంధం)లో ఉన్నారేమో గమనించండి.

ఎందుకిలా..?

మనల్ని ప్రేమిస్తున్నామని చెబుతూనే నెమ్మదిగా మనలోని చిన్న చిన్న లోపాలను పెద్దవి చేసి చూపడం.. నిరంతరం మరొకరితో పోల్చడం వల్ల నెమ్మదిగా మన కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. దీనివల్ల మనకి మనం నచ్చకపోగా మరొకరిలా తయారవడానికి ప్రయత్నిస్తూ విఫలమౌతుంటాం. పక్కనే ఉండి ఇలా నిరంతరం వేధించేవారిని సాధ్యమైనంత త్వరగా వదిలించుకుంటే మంచిది.

ఆటో ఇమ్యూన్ సమస్యలు

హానికరమైన రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు శరీరంలో జరిగే మార్పుల్లో అతి ప్రమాదకరమైనది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీనివల్ల శరీరంలో సహజంగా వ్యాధికారక క్రిములను నివారించే రోగనిరోధక వ్యవస్థ వికటిస్తుంది. అంటే హానికారక క్రిములను నాశనం చేయాల్సిన వ్యవస్థ హైపరాక్టివ్‌గా పనిచేసి, శరీరానికి అవసరమైన కణాలను నాశనం చేస్తుంది. దీని వల్ల శరీరం శక్తిని కోల్పోతుంది. ఇతరత్రా వివిధ సమస్యలు తలెత్తుతాయి.

ఎందుకిలా..?

మెదడుకి విపరీతమైన ఒత్తిడి కలగడం వల్ల శరీరంలోని హార్మోనల్ వ్యవస్థ దెబ్బతింటుంది. అది ఈ ఆటో ఇమ్యూన్ సమస్యలకు దారితీస్తుంది.

భావోద్వేగాలు అదుపు తప్పితే శరీరానికి ఎంత నష్టం కలుగుతుందో దీనిద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రమాదకరమైన బంధాన్ని కొనసాగిస్తే అది మీ మనసునే కాదు శరీరాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన జీవితానికి మొదటి సూత్రం స్వచ్ఛమైన బంధాలని మర్చిపోకండి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని