Published : 20/09/2021 17:35 IST

Ganesh Nimajjanam : ఆ విగ్రహాలకు కొత్త రూపు తీసుకొస్తోంది!

(Photos: Facebook)

నవరాత్రుల అనంతరం గణనాథులను దగ్గర్లోని కొలనులు, చెరువులు, నదులు, సరస్సుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ! అయితే వినాయక ప్రతిమల తయారీలో వాడిన ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్‌, ఇతర సింథటిక్‌ రసాయనాలు నీళ్లను విషపూరితం చేస్తున్నాయి. అందుకే పర్యావరణంపై స్పృహ ఉన్న వారు మట్టి విగ్రహాలు, సీడ్‌ గణపతుల్ని పూజించడం, వాటిని ఇంట్లోనే నిమజ్జనం చేయడం, సీడ్‌ గణపతులు మొక్కలుగా మొలకెత్తడం.. ఇవన్నీ మనకు తెలిసినవే!

అయితే ఈ విషయంలో మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన తృప్తి గైక్వాడ్‌ అనే మహిళ మరింత సృజనాత్మకంగా ఆలోచించింది. న్యాయవాద వృత్తితో పాటు ‘సంపూర్ణం సేవా ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తోన్న ఆమె గణపతి విగ్రహాలను అందమైన బొమ్మలుగా మలుస్తోంది. అనంతరం వాటిని అనాథ, పేద పిల్లలకు పంచి పెడుతోంది. ఇలా ఓవైపు పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తూనే.. మరోవైపు పేద పిల్లల కళ్లల్లో సంతోషాన్ని నింపుతోందీ లాయరమ్మ.

అలా ఈ ఫౌండేషన్‌కు పునాది పడింది!

‘మా ఇల్లు గోదావరి నది పక్కనే ఉంటుంది. ఒకరోజు ఒక వ్యక్తి విగ్రహాలు, ఫొటో ఫ్రేములతో నిండిన సంచిని తీసుకొచ్చాడు. దానిని నదిలో కలిపేయాలన్నది అతడి ఆలోచన! కానీ నేను.. ‘ఆ వస్తువులను నీటిలో పడేయద్దు. నేను వాటిని రీసైకిల్‌ చేసి ఉపయోగించుకుంటాను’ అని చెప్పి విగ్రహాలు, ఫొటో ప్రేములున్న సంచిని తీసుకున్నాను. అలా రెండేళ్ల క్రితం ‘సంపూర్ణం సేవా ఫౌండేషన్‌’కు పునాది పడింది. నా స్నేహితుల్లో చాలామంది ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. అంతా కలిసి విగ్రహాల రీసైక్లింగ్‌ గురించి సోషల్‌ మీడియా మాధ్యమాల వేదికగా విస్తృతంగా ప్రచారం చేశాం. దీనికి అద్భుత స్పందన వచ్చింది. ఇప్పుడు నాసిక్‌ నుంచే కాకుండా పుణే, ముంబయి, నాగ్‌పూర్‌ తదితర నగరాల నుంచి మాకు వినాయకుడితో పాటు ఇతర దేవుళ్ల ప్రతిమలు, ఫొటో ప్రేములు వస్తున్నాయి’.

ఫీడింగ్‌ బౌల్స్‌, పక్షిగూళ్లుగా మారుస్తూ!

‘విగ్రహారాధన మన భారతదేశ సంస్కృతికి నిదర్శనం. కానీ ప్రస్తుతం చాలా విగ్రహాలు  ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌, థర్మాకోల్‌, సింథటిక్ రంగులతో తయారైనవే. వీటిని చెరువులు, నదులు, సరస్సులు, సముద్రాల్లో కలపడం వల్ల స్వచ్ఛమైన జలాలు విషపూరితమవుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలన్న ముఖ్యోద్దేశంతోనే విగ్రహాలను రీసైక్లింగ్‌ చేసేందుకు సంపూర్ణం సేవా ఫౌండేషన్‌ను స్థాపించాను. మా దగ్గరకు వచ్చిన విగ్రహాల తయారీలో ఉపయోగించిన మెటీరియల్‌ను వేరుచేసి కొత్త కొత్త బొమ్మలు తయారుచేస్తున్నాం. ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ పొడితో చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలను రూపొందిస్తున్నాం. అదేవిధంగా ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌ పొడిని సిమెంట్‌తో కలిపి పక్షులు, జంతువుల ఫీడింగ్‌ బౌల్స్‌ తయారుచేస్తున్నాం. ఇక కొయ్య, చెక్క ఫొటో ప్రేములను రీసైక్లింగ్‌ యూనిట్లకు పంపించి అందమైన పక్షిగూళ్లుగా మారుస్తున్నాం.’

మనోభావాలు దెబ్బతినకుండా!

‘ఇలా దేవతామూర్తుల విగ్రహాలను రీసైక్లింగ్‌ చేసేటప్పుడు మేమెంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాం. ఎందుకంటే ఇది మనుషుల మనోభావాలతో కూడుకున్న వ్యవహారం. అందుకే విగ్రహాలు, బొమ్మలను రీసైక్లింగ్‌ యూనిట్లకు పంపించే ముందు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సుమారు 10వేలకు పైగా విగ్రహాలు, ఫొటో ప్రేములు నీళ్లలో కలవకుండా చూశాం. అంతేకాదు వాటికి తిరిగి ప్రాణం పోస్తున్నాం’ అంటోంది తృప్తి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని