జుట్టుకు, చర్మానికీ.. ఒకే సౌందర్య మంత్రం!

సౌందర్య పరిరక్షణలో భాగంగా శిరోజాలకు, చర్మ సంరక్షణకు వేర్వేరు ఉత్పత్తులను వాడుతుంటాం. మార్కెట్లో సైతం వాటికి సంబంధించిన సౌందర్య ఉత్పత్తులు విడిగానే లభ్యమవుతాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను....

Published : 27 May 2023 20:51 IST

సౌందర్య పరిరక్షణలో భాగంగా శిరోజాలకు, చర్మ సంరక్షణకు వేర్వేరు ఉత్పత్తులను వాడుతుంటాం. మార్కెట్లో సైతం వాటికి సంబంధించిన సౌందర్య ఉత్పత్తులు విడిగానే లభ్యమవుతాయి. అయితే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను మాత్రం అటు చర్మ సౌందర్యాన్ని, ఇటు కురుల ఆరోగ్యాన్ని కాపాడుకొనేందుకు ఉపయోగించవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం రండి...

కొబ్బరి నూనె

సాధారణంగా కొబ్బరి నూనెను మనం శిరోజాల సంరక్షణకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అది జుట్టుకి పోషణనిచ్చి దృఢంగా అయ్యేలా చేస్తుంది. అయితే దీన్ని మనం చర్మ సంరక్షణ కోసం కూడా ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్ గుణాలుంటాయి. ఇవి చర్మ సమస్యల్ని దూరం చేసి మేనికి మెరుపునిస్తాయి.

అవకాడో..

ఆరోగ్యాన్నిచ్చే అవకాడో అందాన్ని సైతం పెంపొందిస్తుంది. ఇది చర్మంలోని ఫ్రీరాడికల్స్‌ని బయటకు పంపిస్తుంది. దీనిలో ఉన్న మాయిశ్చరైజింగ్ గుణాలు జుట్టుకి, చర్మానికి పోషణనందిస్తాయి. రోజూ సగం అవకాడో ముక్కను ఆహారంగా తీసుకోవడం ద్వారా చర్మం, కురులు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు.

తేనె..

సౌందర్యాన్నందించే సహజసిద్ధమైన పదార్థాల్లో తేనె కూడా ఒకటి. దీనిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలు, ఆవశ్యక విటమిన్లు, ఖనిజ లవణాలున్నాయి. ఇవి ఆరోగ్యాన్నే కాదు.. అందాన్ని కూడా పరిరక్షిస్తాయి. ఇది కురులకు కండిషనర్‌లా పనిచేస్తుంది. చర్మం పీహెచ్ విలువను సమతుల్యం చేసి ముడతలు రాకుండా కాపాడుతుంది. అయితే దీనికోసం సహజసిద్ధమైన తేనెను ఉపయోగించడం మంచిది.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో సౌందర్యాన్ని పరిరక్షించే ఎన్నో అద్భుతమైన గుణాలున్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మం, వెంట్రుకలు పాడవకుండా ఇవి కాపాడతాయి. అలాగే అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వయసు ప్రభావం కారణంగా.. చర్మంపై ముడతలు రాకుండా, సాగిపోకుండా చేస్తాయి. కురుల విషయానికి వస్తే.. జుట్టు రాలిపోవడానికి కారణమైన ‘డై హైడ్రో టెస్టోస్టిరాన్’ ప్రభావాన్ని గ్రీన్ టీ తగ్గిస్తుంది. ఫలితంగా వెంట్రుకలు రాలే సమస్య తగ్గుముఖం పడుతుంది.

ఆలివ్‌నూనె..

ఆలివ్‌నూనె చక్కటి ఆరోగ్యాన్నివ్వడమే కాదు.. సౌందర్యాన్ని సైతం పెంపొందిస్తుంది. ఇది జుట్టుకి పోషణనిచ్చి మృదువుగా, పట్టులా మారేలా చేస్తుంది. దీనిలో ఉన్న ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తాయి. అలాగే వృద్ధాప్య ఛాయలు మీద పడకుండా చేస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని