మీ పెట్‌కి మరింత దగ్గరవ్వాలంటే..!

ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ పనులతో రోజంతా అలసి సొలసిన మనకు పెంపుడు జంతువులు ఒక రకమైన రిలాక్సేషన్‌ని అందిస్తాయి. ఒత్తిడి, ఒంటరితనాన్ని జయించడానికీ ఇవి ఎమర్జెన్సీ పిల్స్ లాంటివి. అందుకే పెంపుడు జంతువుల్ని పెంచుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

Published : 24 Sep 2021 16:08 IST

ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ పనులతో రోజంతా అలసి సొలసిన మనకు పెంపుడు జంతువులు ఒక రకమైన రిలాక్సేషన్‌ని అందిస్తాయి. ఒత్తిడి, ఒంటరితనాన్ని జయించడానికీ ఇవి ఎమర్జెన్సీ పిల్స్ లాంటివి. అందుకే పెంపుడు జంతువుల్ని పెంచుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మరి, కొత్తగా పెట్‌ని ఇంటికి తెచ్చుకున్న వాళ్లు దాన్ని ఓ ప్రత్యేక అతిథిలా, ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు. దాంతో అనుబంధాన్ని పెంచుకోవాలని ఆరాటపడుతుంటారు. అయితే ఈ క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకుంటే పెట్‌కి మరింత దగ్గరవ్వచ్చంటున్నారు నిపుణులు.

కాస్త స్వేచ్ఛనివ్వండి!

సాధారణంగా మన ఇంటికి మొదటిసారి ఎవరైనా అతిథులొచ్చినా/స్నేహితులొచ్చినా వారికి ఇల్లంతా చూపించడం, కుటుంబ సభ్యుల్ని పరిచయం చేయడం పరిపాటే! కొత్తగా ఇంటికి తీసుకొచ్చిన పెట్‌ విషయంలోనూ ఈ నియమం పాటించాలంటున్నారు నిపుణులు. అంటే పెంపుడు జంతువును కూడా అతిథిలా తిప్పి చూపించమని మా ఉద్దేశం కాదు.. ఇల్లంతా అదే తిరిగి చూసేలా దాన్ని స్వేచ్ఛగా వదిలేయాలి. ఈ క్రమంలో బెడ్‌పై పడుకుంటుందనో లేదంటే సోఫా ఎక్కి కూర్చుంటుందనో దాన్ని నిర్బంధించడం, చిరాకు పడడం, గట్టిగా అరవడం.. వంటివి అస్సలు చేయకూడదు. ఇలా ఇంట్లోని ప్రతి గదినీ పరిచయం చేసుకోవడం, ఇతర పెట్స్‌ ఏవైనా ఉంటే వాటితో కలిసిపోవడం వల్ల అది ఇంట్లో మరింత సౌకర్యవంతంగా ఉండగలుగుతుంది. మీరు దానికి సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నారన్న భావన దాని మనసులో నాటుకుపోయి మీతో, మీ కుటుంబ సభ్యులతో మరింత త్వరగా కలిసిపోగలుగుతుంది.

ఏదైనా ప్రణాళిక ప్రకారమే..!

ప్లానింగ్‌ అనేది మనకే కాదు.. ఇంటికి తెచ్చుకున్న పెట్స్‌కీ అవసరమే అంటున్నారు నిపుణులు. తద్వారా అటు పెట్‌ని చూసుకోవడం, ఇటు మన పనులు చేసుకోవడం, దాంతో కాస్త సమయం గడపడం సులువవుతుందంటున్నారు. ఈ క్రమంలో నిద్ర లేవడం, పడుకోవడం, స్నానం చేయించడం, పెట్‌కి ఆహారం అందించడం, బయటికి తీసుకెళ్లడం, దాంతో కాసేపు ఆడుకోవడం.. ఇలా ప్రతిదానికీ ఓ కచ్చితమైన సమయమంటూ కేటాయించుకోవాల్సి ఉంటుంది. తద్వారా అవి ఇంట్లో త్వరగా ఇమడగలుగుతాయి. వాటిని మీరు మరింత ప్రేమగా చూసుకుంటున్నారన్న భావనతో మీతో స్నేహం పెంచుకుంటాయి. అంతేకాదు.. ఇలాంటి ప్రణాళిక వల్ల రోజంతా అవి చలాకీగా ఉంటూనే.. మిమ్మల్నీ ఎంతో ఉత్సాహంగా ఉంచుతాయి.

తోకను బట్టి తెలుసుకోవచ్చట!

భావోద్వేగాలు మనకే కాదు.. పెంపుడు జంతువులకూ ఉంటాయి. వాటిని గ్రహించి ఆ సమయంలో వాటికి ప్రేమను పంచితే అవి మనకు తమ ప్రాణాన్నైనా ఇచ్చేంత దగ్గరవుతాయంటున్నారు నిపుణులు. మరి, పెట్స్‌ ఎమోషన్స్‌ని తెలుసుకోవడమెలా అంటే..? కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువుల భావోద్వేగాల్ని ముఖకవళికలు, తోక ఊపడం ద్వారా గుర్తించచ్చంటున్నారు నిపుణులు. తోక కుడివైపుకి ఎక్కువగా ఊపే పెట్స్‌ సంతోషంగా ఉన్నాయని, అదే ఎడమవైపుకి ఊపేవి లోలోపల ఏదో బాధపడుతున్నట్లు అర్ధమని పెట్స్‌పై జరిపిన ఓ అధ్యయనం చెబుతోంది. ఇక వాటి సంతోషం, బాధను అచ్చం మనలాగే కళ్లు, ముఖకవళికల్లో తెలియజేస్తాయట! కాబట్టి ఇలా కూడా వాటి ఎమోషన్స్‌ని తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. తద్వారా వాటిని చేరదీసి దగ్గరికి తీసుకోవడం, కౌగిలించుకోవడం.. వంటివి చేయడం వల్ల వాటి బాధ చాలా వరకు దూరమై.. తమకంటూ ప్రేమను పంచే నేస్తాలున్నట్లుగా అవి ఫీలవుతాయి. పెట్స్‌కి దగ్గరవడానికి ఇదీ ఓ మార్గమే!

సరదాగా కాసేపు!

కొత్తగా పెట్స్‌ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు వాటిలోని అభద్రతా భావాన్ని దూరం చేసి, అవి మనకు మరింత దగ్గరవ్వాలంటే రోజూ వాటితో కాస్త సమయం గడపడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీ బిజీ లైఫ్‌స్టైల్‌ నుంచి కాస్త వీలు చేసుకొని ఉదయం, సాయంత్రాలు మీతో పాటు జాగింగ్‌కి తీసుకెళ్లడం, పెట్‌తో కలిసి వ్యాయామం చేయడం, దాంతో కాసేపు ఆడుకోవడం, సరదాగా కబుర్లు చెప్పడం, కాస్త అలవాటు పడేదాకా దానికి మీ చేత్తోనే ఆహారం తినిపించినా తప్పు లేదు.. ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల మీకు, పెంపుడు జంతువులకు మధ్య దూరం క్రమంగా తగ్గుతుంది. అంతేకాదు.. ఒక్కోసారి మీరే వాటికి టీచర్‌లా మారి.. కూర్చోవడం, నిల్చోవడం, పరిగెత్తడం, ఏవైనా వస్తువులు తీసుకురమ్మనడం.. ఇలాంటివన్నీ నేర్పించాలి. ఇవి కూడా పెట్‌కి దగ్గరవడానికి దోహదం చేస్తాయి.

ఆ సంకేతాల్ని ఇలా గుర్తించండి!

మనకు వయసును బట్టి ఆరోగ్య పరీక్షలు ఎంత ముఖ్యమో.. పెట్‌కీ ఇవి అవసరమే అంటున్నారు నిపుణులు. అప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటూ.. మనల్నీ యాక్టివ్‌గా ఉంచగలుగుతాయి. అంతేకాదు.. తమకు అనారోగ్యంగా ఉందని అవి నోరు తెరిచి చెప్పలేవు.. అలాంటప్పుడు కొన్ని సంకేతాల ద్వారా వాటి అనారోగ్యాల్ని పసిగట్టచ్చంటున్నారు.

* సాధారణంగా పెంపుడు జంతువులు నిరంతరం యాక్టివ్‌గా ఉంటాయి. అలాకాకుండా అవి అలసిపోయినట్లుగా, నీరసంగా కనిపించినా.. వాటి శక్తిస్థాయులు తగ్గిపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం/పడుకోవడం.. వంటివి చేసినా వెంటనే పెట్‌ స్పెషలిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లాలి.

* తమకు నచ్చిన ఆహారం ఎంతో ఇష్టంగా తినే పెట్స్‌.. సరిగ్గా తినకపోవడం, నీళ్లు తాగకపోవడం.. వంటి సంకేతాలే అవి అనారోగ్యంగా ఉన్నాయనడానికి సూచనగా భావించాలంటున్నారు నిపుణులు.

* వాటి బొచ్చు రాలిపోవడం, వాటి చర్మంపై గీతలు కనిపించడం.. వంటి సందర్భాల్లోనూ అలర్ట్‌ కావడం మంచిదట!

ఇలా వాటి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటే.. అవి మనకు మరింత దగ్గరయ్యే అవకాశాలుంటాయి.

వీటితో పాటు ఇంట్లో పెట్స్‌కి ప్రత్యేకంగా ఓ వ్యక్తిగత ప్రదేశం ఏర్పాటు చేయడం, నిపుణుల సలహా మేరకు వాటికి పోషకాహారం అందించడం, ఇంట్లో పసి పిల్లలుంటే పెట్స్‌ వారిని గాయపరచకుండా చూసుకోవడం.. వంటివీ ముఖ్యమే!
అంతేకాదు.. పెట్స్‌ని ఎలా సంరక్షించుకోవాలి?, వాటిని క్రమశిక్షణతో ఎలా పెంచాలి?.. వంటి విషయాలన్నీ నేర్పించేందుకు ప్రస్తుతం పలు ‘పెట్‌ గ్రూమింగ్‌ కోర్సులు’ సైతం అందుబాటులో ఉన్నాయి. వీలైతే వాటిని నేర్చుకోవచ్చు.. లేదంటే అప్పటికప్పుడు ఏదైనా సలహా కావాలంటే నిపుణుల సలహా తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్