Updated : 23/10/2021 12:47 IST

Child Pornography: మీ పిల్లలు ఆ చిత్రాలు చూస్తున్నారా?

(Image for Representation)

హాయిగా తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ, పాఠాలు నేర్చుకుంటూ ఆనందంగా గడపాల్సిన వయసు వారిది. ఆన్‌లైన్‌ పాఠాల నేపథ్యంలో గంటల తరబడి మొబైల్‌కే అంకితమయ్యారు. తెలిసీ తెలియని వయసులో, పరిణతి లేని ఆలోచనలతో పోర్న్‌ వీడియోలకు బానిసయ్యారు. తాము చేస్తున్నదే తప్పుడు పని.. అలాంటిది మరో బాలికనూ ఈ కూపంలోకి లాగడానికి ప్రయత్నించారు. ఆమె నిరాకరించడంతో అతి కిరాతకంగా హత్య చేశారు. గువహటిలో తాజాగా చోటుచేసుకుందీ ఘటన.

గంటల తరబడి మొబైల్‌కే అంకితమయ్యే తమ చిన్నారులు ఏం చూస్తున్నారో నిఘా వేయడం తప్పనిసరి అంటూ ప్రతి తల్లికీ, తండ్రికీ ఓ హెచ్చరికను పంపిందీ ఘటన. అంతేకాదు.. అశ్లీలత అనే విషపు బీజం పిల్లల్లో నాటుకోక ముందే పేరెంట్స్‌ జాగ్రత్తపడాలంటూ చెప్పకనే చెప్పింది. మరి, ఈ నేపథ్యంలో పిల్లలు స్మార్ట్‌ఫోన్‌/కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌.. వంటివి వినియోగించే క్రమంలో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారు తప్పుదోవ పట్టకూడదంటే పేరెంట్స్‌ వారితో ఎలా మెలగాలి? తెలుసుకుందాం రండి..

అసోంలోని మిస్సా గ్రామానికి చెందిన 8-11 ఏళ్ల వయసున్న ముగ్గురు అబ్బాయిలు ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట అశ్లీల వీడియోలు చూడడానికి అలవాటు పడ్డారు. తమతో పాటు ఈ వీడియోలు చూడాలని ఓ ఆరేళ్ల బాలికను బలవంతం చేశారు. అందుకు తాను నిరాకరించడంతో రాళ్లతో ఆమెను కొట్టి చంపారు. అయితే ఈ ముగ్గురు నిందితుల్లో ఒకరు ఆన్‌లైన్‌ క్లాసుల కోసమని తన తండ్రి మొబైల్‌ తీసుకొని.. మిగతా ఇద్దరికి అలవాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పైగా ఆ ఫోన్లో అన్నీ అశ్లీల వీడియోలే ఉండడంతో.. అంతకుముందే ఆ తండ్రికి ఈ వీడియోలు చూసే అలవాటున్నట్లు, అవే తన కొడుకుతో పాటు మరో ఇద్దరు పిల్లల జీవితాల్ని నాశనం చేసినట్లు, అన్యాయంగా ఓ బాలిక ఉసురు తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా అశ్లీల వీడియోలు చిన్నారుల మనసుల్లో ఎలాంటి విషపు బీజం నాటుతాయో ఈ దారుణమైన ఘటన మరోసారి గుర్తు చేసింది.

పదిలో ఒక్కరు!

ఏ విషయం గురించైనా తెలుసుకోవాలన్న ఉత్సుకత పెద్దలతో పోల్చితే చిన్నారుల్లో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు పోర్న్‌ వీడియోలకు అలవాటు పడేందుకు ఇదీ ఓ కారణమే అంటున్నారు. అంటే.. పిల్లల ముందు పెద్దలు అన్యోన్యంగా మెలగడం, ఇంటర్నెట్‌లో ఏదైనా శోధిస్తున్నప్పుడు పొరపాటున పోర్న్‌ వెబ్‌సైట్స్‌/ప్రకటనలపై క్లిక్‌ చేయడం, పేరెంట్స్‌కి ఈ వీడియోలు చూసే అలవాటుండడం-అదే మొబైల్‌/ల్యాపీ పిల్లలు కూడా వాడడం.. ఇలా కారణమేదైనా దాని గురించి ఇంకా తెలుసుకోవాలన్న తపన వారిలో పెరుగుతుందట! ఇదే వారిని పూర్తి పెడదోవ పట్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కారణమేదైనా.. ప్రతి పది మంది పదేళ్ల లోపు పిల్లల్లో ఒకరు పోర్నోగ్రఫీకి అలవాటు పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ అలవాటు వారి బంగారు భవిష్యత్తును దెబ్బతీయడమే కాదు.. సమాజానికీ శాపంగా పరిణమించచ్చు. అందుకే ఇలాంటి తప్పులు జరగకుండా తల్లిదండ్రులు ముందే మేల్కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

మనసు పైనే తీవ్ర ప్రభావం!

పోర్నోగ్రఫీకి అలవాటు పడిన పిల్లలపై శారీరకంగా, మానసికంగా, సామాజిక పరంగా పలు ప్రతికూల ప్రభావాలుంటాయంటున్నారు నిపుణులు.

* అశ్లీల వీడియోలు/వెబ్‌సైట్స్‌ని చూడడం వల్ల పిల్లల ఆలోచనలన్నీ లైంగిక పరమైన అంశాల చుట్టే తిరుగుతాయి. వాటికి సంబంధించిన సమాచారం చదవడానికి, ఇంకా లోతుగా తెలుసుకోవడానికి వారిని ఉసిగొల్పుతాయి. ఇదే క్రమంగా ఇతరులపై అత్యాచారాలకు పాల్పడేలా, వాళ్లు ఇతరులకు లొంగిపోయేలా, చెడు తిరుగుళ్లకు బానిసయ్యేలా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

* మనసు నిండా ఈ ప్రతికూల ఆలోచనలే ఉంటే చదువుపై దృష్టి పెట్టలేరు. ఫలితంగా చదువులో వెనకబడడం, మొండితనం, కర్కశత్వం.. ఇవన్నీ పెద్దయ్యే కొద్దీ వారిని రెబల్‌గా మార్చుతాయి.

* ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీకి అలవాటు పడిన చిన్నారుల్లో తెలివితేటలు తగ్గిపోయి.. నేర్చుకునే సామర్థ్యం, గ్రాహక శక్తి క్రమంగా తగ్గుతున్నట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది.

* చిన్న వయసు నుంచే నీలి చిత్రాలు చూడ్డానికి అలవాటు పడిన బాలలు.. పెద్దయ్యాక మహిళలపై పెత్తనం చెలాయించే ప్రమాదమూ ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవతలి వారి ఇష్టాయిష్టాలతో పనిలేకుండా బలవంతపు శృంగారం, గృహ హింస.. ఇలాంటివన్నీ ఛైల్డ్‌ పోర్నోగ్రఫీతో కలిగే దుష్ప్రభావాలే!

* పోర్న్‌ వీడియోలు చూస్తూ తామూ అలాగే చేయాలన్న ఆసక్తితో చిన్న వయసులోనే సెక్స్‌ టాయ్స్‌ వాడడం, ఇతర లైంగిక చర్యలకూ పాల్పడే ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి పనులు వారిని శారీరకంగా, మానసికంగా దెబ్బతీస్తాయి.

ఇలా గుర్తించచ్చు!

కారణమేదైనా నీలి చిత్రాలకు అలవాటు పడిన పిల్లల్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మురికి కూపం నుంచి బయటికి లాగడం మంచిదంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి వీడియోలు చూడడం తప్పని పిల్లలకు తెలుసు. అయినా చాటుమాటుగా వాటిని చూస్తుంటారు. మరి, దీన్ని పసిగట్టేదెలా అంటే.. వారి ప్రవర్తనే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం అంటున్నారు నిపుణులు. అదెలాగంటే..!

* పిల్లలు ఒంటరిగా గడపడానికి ఇష్టపడడం, తదేకంగా ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం, నిద్రలేమి/ఎక్కువగా నిద్రపోవడం, సరిగ్గా తినకపోవడం.. వంటివి గమనిస్తే వారిని అనుమానించాల్సిందే!

* చాటుమాటుగా గంటల తరబడి మొబైల్‌ చూడడం, మీరు వెళ్లగానే ఒక్కసారిగా దాన్ని దాచేయడం/స్క్రీన్‌ లాక్‌ చేయడం, మీరు చూస్తారేమోనన్న భయంతో బాత్‌రూమ్‌కి వెళ్లినా మొబైల్‌ను వెంటే తీసుకెళ్లడం.. ఇలాంటి ప్రవర్తన ఉన్నా కూడా వారిని అనుమానించడంలో తప్పు లేదు.

* ఫోన్లో పేరెంటల్‌ ఫిల్టర్స్‌/పేరెంటల్‌ కంట్రోల్స్‌, స్క్రీన్‌ టైమ్‌ ట్రాకింగ్‌.. వంటి ఆప్షన్స్ తొలగించడం, రాత్రుళ్లు ఫోన్‌ ఎక్కువగా వాడడం.. వంటివి చేసినా నిఘా వేయడం తప్పనిసరి.

* చిన్న విషయానికే కోపం, భయం, యాంగ్జైటీ.. వంటి భావోద్వేగాలు ప్రదర్శించడం..

* విచక్షణ మరిచి, వయసుతో సంబంధం లేకుండా దుర్భాషలాడడం..

* హస్త ప్రయోగం (Masturbation), సెక్స్‌ టాయ్స్ వంటివి ఉపయోగించడం.. వంటివి చాటుమాటుగా చేస్తుంటారు.

పేరెంట్స్‌.. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

అయితే మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు/ప్రవర్తనను గమనిస్తే ఆలస్యం చేయకుండా వారిని ఆ కూపంలో నుంచి బయటికి లాగాలంటున్నారు నిపుణులు. అందుకోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు.

* ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో మీరు మీ పిల్లలకు మొబైల్‌ ఫోన్‌ ఇచ్చినా లేదంటే వారికే కొత్త ఫోన్‌ కొనిచ్చినా.. దానికి పూర్తి స్థాయి పేరెంటల్‌ యాక్సెస్‌ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పేరెంటల్‌ కంట్రోల్స్‌ సాఫ్ట్‌వేర్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

* కొన్ని రకాల పేరెంటల్ కంట్రోల్‌ టూల్స్‌ అనుచిత సైట్స్‌/సమాచారాన్ని బ్లాక్‌ చేయడంతో పాటు పిల్లల ఫోన్‌ను మానిటర్‌ చేయడానికి తల్లిదండ్రులకు సహాయపడతాయి.

* పిల్లల సోషల్‌ మీడియా అకౌంట్స్‌కి ప్రైవసీ ప్రొటెక్షన్‌ కల్పించడం మంచిది. లేదంటే ఇతరుల ద్వారా వారికి పోస్టులు/నోటిఫికేషన్లు రావడం.. అవి వారిని తప్పు దారి పట్టించడం వంటివి జరగచ్చు.

* కొంతమంది తల్లిదండ్రులకూ ఇలాంటి వీడియోలు చూసే అలవాటుంటుంది. అలాంటి వారు పిల్లలకు తమ ఫోన్‌ని ఇచ్చే క్రమంలో ఆయా సైట్స్‌ని బ్లాక్‌ చేయడం లేదంటే వాళ్లకు అవి కనిపించకుండా ముందే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్లే పిల్లలు నీలి చిత్రాలకు బానిసవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

* శృంగారం, లైంగిక పరమైన అంశాల గురించి పిల్లల ముందు చర్చించడానికి చాలామంది పేరెంట్స్‌ ఇష్టపడరు. నిజానికి ఈ గుసగుసలు/చాటుమాటు చేష్టలే వారిలో విషపు బీజం నాటుతున్నాయంటున్నారు నిపుణులు. అందుకే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, అనుబంధాలు, ఇంట్లో ఆడ-మగ పిల్లల్ని సమానంగా పెంచడం, లైంగిక పరమైన అంశాల గురించి సున్నితంగా వారికి వివరించడం.. వంటివన్నీ ముఖ్యమే!

* ఇంటర్నెట్‌ని వినియోగిస్తోన్న క్రమంలో బయట నుంచి వచ్చే తప్పుడు మెయిల్స్‌, నోటిఫికేషన్స్‌, అనవసరమైన సమాచారం.. వంటి వాటికి నేరుగా స్పందించకుండా.. మీ దృష్టికి తీసుకురమ్మని ముందే వారికి చెప్పాలి. తద్వారా వారు ఆ విషయంలో మరింత లోతుకు వెళ్లకుండా జాగ్రత్తపడచ్చు.

* పిల్లలపై అజమాయిషీ చేయడం, వారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం.. వంటివి చేస్తే వాళ్లు మరింత మొండిగా తయారవుతారు. కాబట్టి వారితో ఎంత స్నేహపూర్వకంగా మెలిగితే అంత మంచిది. తద్వారా వాళ్లు అన్ని విషయాలు మీతో పంచుకోగలుగుతారు.

* తల్లిదండ్రులు తమ బిజీలో పడిపోయి పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వారు మొబైల్‌నే నేస్తంగా భావిస్తున్నారని, ఇదే వారిని అశ్లీలత వైపు లాగుతోందని నిపుణులు అంటున్నారు. అందుకే దీనికి చరమగీతం పాడాలంటే పేరెంట్స్‌ ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు తగిన సమయం కేటాయించడం మంచిది.

* అలాగే మీ ఇష్టాయిష్టాల్ని పిల్లలపై రుద్దడం కాకుండా.. వారి మనసులో ఎలాంటి లక్ష్యాలున్నాయో తెలుసుకొని ప్రోత్సహించాలి. ఇది కూడా వారు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు ఓ మార్గమే అంటున్నారు నిపుణులు.

ఈ విషయాలన్నీ ముందు జాగ్రత్తగా కూడా పేరెంట్స్‌కి పిల్లలకు ఉపయోగపడతాయి. ఒకవేళ ఇంత చేసినా మీ పిల్లలు మారకపోతే మాత్రం మానసిక నిపుణుల్ని సంప్రదించి కౌన్సెలింగ్‌ ఇప్పించడం, థెరపీ చేయించడం.. మంచిది.

మరి, పిల్లలు అశ్లీల వీడియోలకు అలవాటు పడకూడదంటే తల్లిదండ్రులు ఇంకా ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలంటారు? మీ అమూల్యమైన అభిప్రాయాలను మాతో పంచుకోండి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని