మీరు పెట్‌ పేరెంటా? గార్డెనింగ్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

గార్డెనింగ్‌.. కొందరికి అభిరుచి అయితే.. మరికొందరికి ఆహ్లాదం! అయితే తమ ఇంట్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి చిన్న పాటి ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసుకోవడం లేదంటే ఇండోర్‌ మొక్కల్ని పెంచుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది.

Published : 13 Dec 2023 12:22 IST

గార్డెనింగ్‌.. కొందరికి అభిరుచి అయితే.. మరికొందరికి ఆహ్లాదం! అయితే తమ ఇంట్లో ఉన్న ఖాళీ స్థలాన్ని బట్టి చిన్న పాటి ఉద్యానవనాన్ని ఏర్పాటుచేసుకోవడం లేదంటే ఇండోర్‌ మొక్కల్ని పెంచుకోవడం.. వంటివి చేస్తుంటారు చాలామంది. అయితే పెట్‌ పేరెంట్స్‌ ఈ విషయంలో మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఫలితంగా అటు పెంపుడు జంతువులకు ఇబ్బంది లేకుండా, ఇటు మీరు ఇబ్బంది పడకుండా ఉండచ్చంటున్నారు. మరి, ఆ జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

ఆ మొక్కలు వద్దు!

బయటైనా, ఇంటి లోపల పెంచుకునే మొక్కలైనా.. కొన్ని రకాల అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తుంటారు చాలామంది. అయితే వీటిలోనూ పెంపుడు జంతువులకు హాని కలిగించే మొక్కలు/పూల మొక్కలు కొన్నున్నాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పామ్‌, ఒలియాండర్‌, తులిప్స్‌, లిల్లీ.. వంటివి పెంచుకోకపోవడమే మేలంటున్నారు. వీటికి బదులుగా రాటిల్‌ స్నేక్‌ ప్లాంట్స్‌, స్పైడర్‌ ప్లాంట్‌, ఆఫ్రికన్‌ వయొలెట్‌, కాక్టస్‌.. వంటి విషపూరితం కాని మొక్కలకు ప్రాధాన్యమివ్వడం వల్ల అటు ఇంటిని అందంగా, ఆహ్లాదంగా మార్చుకోవచ్చు.

పెట్‌ కోసం ప్రత్యేకంగా!

ఎంత ఒత్తిడిలో ఉన్నా కాసేపు గార్డెన్‌లో/పచ్చటి ప్రకృతి మధ్య గడిపితే మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తుంటుంది. అందుకే ఇంటి గార్డెన్‌లో లేదంటే బాల్కనీలో పెంచుకున్న మొక్కల వద్ద కాసేపు సేదదీరుతుంటాం. అయితే మనకే కాదు.. పెట్స్‌కీ మానసిక ప్రశాంతత అవసరం. అందుకే వాటి కోసం గార్డెన్‌లో ప్రత్యేకంగా పచ్చటి గడ్డితో కూడిన చిన్న ప్రదేశాన్ని ఏర్పాటుచేయాలంటున్నారు నిపుణులు. అవసరమైతే ఆ గడ్డి చుట్టూ ఓ ఫెన్స్‌ని కూడా అమర్చచ్చు. ఇక రోజూ కాసేపు వాటిని అక్కడ తిప్పడం, వాటితో ఆడుకోవడం.. చేస్తే మనకూ కాస్త రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది.. పెట్స్‌ని మరింత యాక్టివ్‌గా మార్చేయచ్చు.

వాటికి దూరంగా..!

గార్డెనింగ్‌లో భాగంగా మనం వివిధ రకాల టూల్స్‌ని ఉపయోగిస్తుంటాం. ఈ క్రమంలో మొక్కల కొమ్మలు-ఆకులు కత్తిరించడానికి, మట్టి తవ్వడానికి.. ఇలాంటి పనుల కోసం పదునైన, ఫోర్క్‌ లాంటి పరికరాల్ని వాడుతుంటాం. అయితే పని పూర్తయ్యాక వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల.. వీటి కారణంగా పెట్స్‌, చిన్నారులకు హాని కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని పెంపుడు జంతువులకు అందకుండా అమర్చడం మంచిది. అలాగే లాన్‌ కట్టర్‌, లాన్‌ మూవర్‌ వంటి బరువైన పరికరాల్ని కూడా పెట్స్‌/చిన్నారులు చేరుకోని ప్రదేశంలో ఏర్పాటుచేయడం మరీ మంచిది.

‘కంటెయినర్‌ గార్డెన్‌’ తెలుసా?

కుక్కలు, పిల్లులు.. వంటి కొన్ని రకాల జంతువులు పదే పదే మట్టి తవ్వడం చూస్తుంటాం. అయితే ఇలాంటి పెట్స్‌ ఇంట్లో ఉన్నప్పుడు గార్డెనింగ్‌ సంరక్షణ కాస్త కష్టమే అని చెప్పాలి. అందుకే ఇలాంటప్పుడు ‘కంటెయినర్‌ గార్డెన్‌’కు ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. పేరుకు తగ్గట్లే చిన్న చిన్న కుండీలు, చతురస్రాకార/దీర్ఘచతురస్రాకార బాక్సులు, వేలాడే పూల కుండీల్లో ఆయా మొక్కల్ని పెంచుకోవడమన్నమాట! అలాగే ‘Raised Beds’ ఏర్పాటుచేసుకోవడం మరో పద్ధతి. ఖాళీ స్థలం కాస్త ఎక్కువగా ఉన్న వారు.. కొంత ప్రదేశంలో ఫెన్స్‌ ఏర్పాటుచేసుకొని.. అందులో మట్టి నింపుకొని మొక్కలు పెంచుకోవడమన్నమాట! ఇలాంటి పద్ధతుల వల్ల స్థలం ఆదా అవుతుంది.. మరోవైపు పెట్స్‌ మట్టి తవ్వకుండా, తద్వారా మొక్కలు డ్యామేజ్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు. ఒకవేళ తోట పెద్దగా ఉన్న వారు అక్కడక్కడా శాండ్‌ బాక్సుల్ని అమర్చుకుంటే.. పెట్‌ మట్టి జోలికి రాకుండా ఉంటుంది.

రసాయనాలు వద్దు!

పెంపుడు జంతువులున్న వారు గార్డెనింగ్‌లో భాగంగా విషపూరితం కాని మొక్కల్ని పెంచుకోవడమే కాదు.. వాటి సంరక్షణ కోసం వాడే ఎరువుల విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రసాయనపూరిత క్రిమిసంహారకాలు వాడడం వల్ల అటు మొక్కలకు, ఇటు పెట్స్‌, చిన్నపిల్లలకు హాని కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి సహజ ఎరువుల్ని వేయడమే ఉత్తమం అంటున్నారు. ఇందుకోసం కిచెన్‌ వ్యర్థాలతో కంపోస్ట్‌ ఎరువును తయారుచేసుకోవచ్చు.. లేదంటే బయట మార్కెట్లో దొరికే న్యాచురల్‌ ఫెర్టిలైజర్స్‌నీ వాడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్