close
Published : 07/11/2021 11:02 IST

వాళ్ల మాటలు పట్టించుకోకండి.. అప్పుడే మనకు విజయం!

‘ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం’ అన్నాడు మహాత్ముడు. కానీ ప్రస్తుతం జరుగుతోన్న ఘటనలు చూస్తుంటే గాంధీజీ కోరుకున్న స్వాతంత్ర్యం ఎప్పటికీ సిద్ధించేలా కనిపించట్లేదు. ఒంటరిగా బయటికి వెళ్తే ఇంటికి తిరిగొచ్చేదాకా భయమే, నచ్చిన దుస్తులేసుకుంటే ఏ కళ్లు ఏ ఆలోచనతో చూస్తాయోనన్న బెరుకు, మరోవైపు పురుష స్నేహితుల్నీ నమ్మలేని పరిస్థితి! ఇలా రోజూ మనం వేసే ప్రతి అడుగూ ఓ సవాలే అని చెప్పాలి. మరి, కాలం మారుతున్నా ఇలాంటి సవాళ్లు తప్పవని చేతులు ముడుచుక్కూర్చుంటే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. అదే వీటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగితే నలుగురిలోనూ స్ఫూర్తి నింపచ్చు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ఒంటరిగా వెళ్తే భయమెందుకు?

రాత్రీపగలు తేడా లేకుండా ఒంటరిగా ఉద్యోగాలకు, విహారయాత్రలకు, ఇతర పనుల రీత్యా బయటికి వెళ్లే అమ్మాయిల్ని ఎంతోమందిని చూస్తుంటాం. అయితే కొంతమంది మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ భయపడుతున్నారన్నది కాదనలేని వాస్తవం! ఇందుకు ఓ కారణం వాళ్ల కుటుంబమైతే.. మరో కారణం ఈ సమాజం! ‘చుట్టూ ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఒంటరిగా వెళ్లడం క్షేమం కాదు..’ అంటూ కొన్ని కుటుంబాలు ఆడవారిలో ఉన్న ధైర్యాన్ని ఆవిరి చేస్తున్నాయి. ‘ఇంత జరిగినా బుద్ధి రావట్లేదు.. అన్ననో, తమ్ముడినో వెంటేసుకెళ్లకుండా.. ఒంటరిగా మగరాయుడిలా ఎలా వెళ్తుందో చూడండి!’ అంటూ సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటలు మరోవైపు మహిళల్ని మానసికంగా దెబ్బతీస్తున్నాయి.

అలాగని వీటిని పట్టించుకుంటూ ఇంటికే పరిమితమవడం, భయపడిపోవడం కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడానికి ఆత్మరక్షణ విద్యలు మనకు మేలు చేస్తాయంటున్నారు. అందుకే వాటిలో శిక్షణ పొందడం, ఆపదొచ్చినప్పుడు చాకచక్యంగా వ్యవహరించే నేర్పును అలవర్చుకోవడం వల్ల ఇతరులపై ఆధారపడకుండా ఒంటరిగానే మన పనులు పూర్తిచేసుకోవచ్చు.

నచ్చిన దుస్తులేసుకుంటే తప్పేంటి?!

అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాలకు కారణం.. వాళ్లు ధరించే దుస్తులే అన్న భావన ఈ సమాజానికి ఎప్పట్నుంచో ఉంది. తనకు నప్పిందని కాస్త మోడ్రన్‌గా ఉండే డ్రస్సులు వేసుకుంటే చాలు.. సోషల్‌ మీడియాలో వచ్చే నెగెటివ్‌ కామెంట్లు, విమర్శలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇక కాస్త అందంగా, ప్రత్యేకంగా తయారైతే చాలు.. ‘మగాళ్లను వలలో పడేయడానికి ఇదో ట్రిక్కు’ అనే వారూ లేకపోలేదు. నిజానికి ఒక్కోసారి ఇలా వాళ్లు మనపై ఈర్ష్యతో అంటున్నారో, లేదంటే నిజంగానే డ్రస్/మేకప్‌ మనకు నప్పలేదో అర్థం కాదు.

అయితే మనం ధరించిన దుస్తులు అభ్యంతరకరంగా లేకపోతే ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన పనిలేదని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఈ క్రమంలో బాడీ ఎక్స్‌పోజింగ్‌కి తావు లేకుండా పద్ధతిగా, సౌకర్యవంతంగా ఉండే ట్రెడిషనల్‌/ట్రెండీ దుస్తులేవైనా ధరించే హక్కు/అధికారం మనకు ఉన్నాయంటున్నారు. తద్వారా ఎదుటివారి విమర్శలకు తలొగ్గకుండా.. మన ఆత్మవిశ్వాసాన్ని చాటుకోవచ్చని చెబుతున్నారు.

‘నో’ చెప్పే హక్కు లేదా?

మనల్ని ప్రేమించిన వాడు మనకు నచ్చినా, నచ్చకపోయినా ప్రేమను అంగీకరించాల్సిందే అని ఒత్తిడి తెస్తారు.

పురుషాధిపత్యం కారణంగా ఆఫీస్‌లో అదనపు బాధ్యతలు/పనులు అప్పగించినా చచ్చినట్లు చేయాల్సి వస్తుంది.

రోడ్డున పోయేవాడు టీజ్‌ చేసినా వినీ విననట్లు ఊరుకోవాలే తప్ప కోపాన్ని ప్రదర్శించకూడదు.

ఇలా ఇంటా, బయటా.. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. మరి, వీటికి ఎదురుతిరిగి మాట్లాడాలంటే తననెక్కడ తప్పు పడతారోనన్న భయం! అలాగని ప్రతి విషయంలో అణిగిమణిగి ఉంటే.. ఈ ఒత్తిళ్లు మితిమీరిపోతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే మీ శక్తికి మించిన పనేదైనా/మీకు నచ్చని విషయమేదైనా సరే.. నిర్మొహమాటంగా, నిర్భయంగా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవాలంటున్నారు. వేధిస్తే మాటలతో/చేతలతో సమాధానం చెప్పడమూ తప్పు కాదంటున్నారు. నిజానికి ఇలాంటి ధైర్యమే ఎదుటివారిలో భయాన్ని పుట్టిస్తుంది. మనలోని ఆత్మవిశ్వాసాన్ని అందరికీ తెలిసేలా చేస్తుంది.

‘బాయ్‌’ఫ్రెండ్స్‌.. ఉండకూడదా?

అమ్మాయిలకు అమ్మాయిలే స్నేహితులుండాలి.. పొరపాటున ఎవరైనా అబ్బాయితో మాట్లాడినా, ఫలానా వ్యక్తి నా స్నేహితుడు అని పరిచయం చేసినా.. అంతకుమించిన అనుబంధమేదో ఉందని లేనిపోని సంబంధాన్ని అంటగట్టేస్తుంది ఈ సమాజం! మంచి కంటే చెడే వేగంగా వ్యాపిస్తుందన్నట్లు.. ఇదే విషయం ఆ నోటా ఈ నోటా పాకి అందరూ దీని గురించి ఓ కథలా చెప్పుకునే దాకా వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆలోచనా ధోరణి ఎంత మారుతున్నా; అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి స్నేహం చేస్తున్నా - ఇప్పటికీ ఇలా ఆలోచించేవారు లేకపోలేదు.

అయితే నిజానికి మన తప్పు లేనప్పుడు ఈ సమాజానికి భయపడాల్సిన పనే లేదంటున్నారు నిపుణులు. ఎవరో ఏదో అనుకుంటున్నారని.. ప్రాణ స్నేహాన్ని వదులుకోవడం కరక్ట్‌ కాదంటున్నారు. ఇలాంటి సానుకూల దృక్పథం మీ ఆత్మవిశ్వాసాన్నే కాదు.. స్నేహానికున్న విలువనూ నలుగురికీ తెలిసేలా చేస్తుందనడంలో సందేహం లేదు.

తప్పు లేకపోయినా మాటలు పడాలా?

విడాకుల విషయంలోనూ ఆడవాళ్లకు సవాళ్లు తప్పట్లేదు. ఆడ, మగ.. ఇద్దరి అంగీకారంతో విడాకులు తీసుకున్నా ఈ సమాజం ఆడవాళ్లనే ప్రశ్నించడం అటు సెలబ్రిటీలు, ఇటు సామాన్యుల విషయంలో మనం చూస్తూనే ఉన్నాం. కుటుంబం కంటే వృత్తికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుందని, మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌ కోసమే ఈ బంధాన్ని వదులుకుంటోందని, ఆడదానికి అణకువ ఉండాలే కానీ అంత పొగరు పనికి రాదని.. ఇలా ఎవరి నోటికొచ్చినట్లుగా వాళ్లు మాట్లాడుతుంటారు. అంతేకానీ.. బంధం వీగిపోయేదాకా వచ్చిందంటే.. ఈ క్రమంలో ఆమె ఎంత క్షోభను అనుభవించిందో, ఎన్ని సవాళ్లను ఎదుర్కొందోనని ఏ ఒక్కరూ ఆలోచించరు. నిజానికి ఇలాంటి సూటిపోటి మాటలు మనసుకు ఎంతో కష్టంగా అనిపిస్తుంటాయి.

అయినా మన తప్పు లేనప్పుడు ఎదుటివారి మాటల్ని మనసులోకి తీసుకొని బాధపడడం, అధైర్య పడడం వల్ల ఒరిగేదేమీ ఉండదని, వాళ్ల దృష్టిలో ఉన్న తప్పుడు భావన ఒప్పు కాదని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఈ క్రమంలో ఇతరుల మాటలు పట్టించుకొని బాధపడడం కంటే ఇకపై జీవితంలో ఎలా ముందుకెళ్లాలో అన్న దానిపై దృష్టి పెడితే అన్నింటా విజయం మనదే అంటున్నారు.

ఇవే కాదు.. విడాకుల తర్వాత సింగిల్‌గా ఉన్నా, ఎదుటివారి చేతిలో మోసపోయినా, నచ్చని విషయంలో కాస్త కోపగించుకున్నా.. ఆడవాళ్లదే తప్పంటుంది ఈ సమాజం! లావుగా/సన్నగా/చర్మ ఛాయ తక్కువగా ఉన్నా నిందిస్తుంది. మరి, ఇన్ని సవాళ్ల మధ్య బతుకు బండి లాగాలంటే.. భయాన్ని జయించి, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నప్పుడే సాధ్యమవుతుందంటున్నారు నిపుణులు. మరి, ఈ విషయంలో మీరేమంటారు?


Advertisement

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి