Dumpers Remorse : ఆ పశ్చాత్తాపం వేధిస్తోందా?

కొన్నిసార్లు క్షణికావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం.. ఆపై ‘ఈ పొరపాటు ఎందుకు చేశానా?’ అని బాధపడుతుంటాం. ఇలాంటి పశ్చాత్తాప భావన వైవాహిక జీవితంలోనూ సహజమే! కారణమేదైనా అన్యోన్య దాంపత్యం బీటలు వారడం, అది బ్రేకప్‌కి దారితీయడంతో ఇద్దరూ విడిపోయినా.. ఆపై తలెత్తే సంఘటనలు కొంతమందిలో పశ్చాత్తాప భావనను రేకెత్తిస్తాయి.

Published : 23 Jan 2024 12:10 IST

కొన్నిసార్లు క్షణికావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటాం.. ఆపై ‘ఈ పొరపాటు ఎందుకు చేశానా?’ అని బాధపడుతుంటాం. ఇలాంటి పశ్చాత్తాప భావన వైవాహిక జీవితంలోనూ సహజమే! కారణమేదైనా అన్యోన్య దాంపత్యం బీటలు వారడం, అది బ్రేకప్‌కి దారితీయడంతో ఇద్దరూ విడిపోయినా.. ఆపై తలెత్తే సంఘటనలు కొంతమందిలో పశ్చాత్తాప భావనను రేకెత్తిస్తాయి. ఇలాంటి పరిస్థితిని ‘డంపర్స్‌ రిగ్రెట్‌/డంపర్స్‌ రిమోర్స్‌’గా పేర్కొంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ఇలా ఈ బ్రేకప్‌కి కారణమైన వారిని ‘డంపర్‌’గా, వారి భాగస్వామిని ‘డంపీ’గా పిలుస్తారు. అయితే ఈ క్రమంలో విడాకులు కోరుకున్న వారికి ఎలాంటి బాధా ఉండదనుకుంటాం.. వారి ఇష్టప్రకారమే విడిపోయారు కాబట్టి ప్రశాంతమైన జీవితం గడుపుతారనుకుంటాం.. కానీ ఇలాంటి సందర్భంలో విడిపోయిన దంపతులిద్దరూ తీవ్ర మనోవేదనకు గురయ్యే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. ‘జరిగిన దాన్ని మార్చలేం..’ కాబట్టి ఈ విషయంలో రియలైజై ముందుకు సాగడం ఇద్దరికీ మేలు చేస్తుందంటున్నారు. మరి, బ్రేకప్‌ తర్వాత ఈ పశ్చాత్తాప భావనను ఎలా గుర్తించాలి? దీన్నుంచి ఎలా బయటపడాలి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

అవన్నీ గుర్తొస్తున్నాయా?

చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదంటారు పెద్దలు. వివాహ బంధానికీ ఇది వర్తిస్తుంది. పరిస్థితి చేయి దాటకముందే భార్యాభర్తలిద్దరూ తమ అనుబంధంలో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించుకుంటే బంధం నిలబడుతుంది. కానీ కొంతమంది పంతాలు, పట్టింపులకు పోయి శాశ్వతమైన దాంపత్య బంధాన్ని మధ్యలోనే తెంచేసుకుంటారు. ఆపై తలెత్తే పరిస్థితుల వల్ల రియలైజై ‘తప్పు చేశానేమో’నని పశ్చాత్తాప పడ్డా ప్రయోజనం ఉండదు. అయితే ఇలాంటి వారు తమలో కలిగే పశ్చాత్తాప భావనను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించి స్వీయ పరిశీలన చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

⚛ భాగస్వామి నచ్చకో, వాళ్ల ప్రవర్తన నచ్చకో.. ఇలా కారణమేదైనా వాళ్ల నుంచి విడిపోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు కొందరు. ఇలా అనుకున్నది సాధించాక, ఆపై కొన్నాళ్ల వరకు తమ నిర్ణయమే సరైందని భావిస్తారు.. ఇక ఈ బ్రేకప్‌ దశను ఎంజాయ్‌ చేసే వారూ లేకపోలేదు. కానీ ఈ సంబరం కొన్నాళ్లే ఉంటుందంటున్నారు నిపుణులు. ఆపై తాము విడాకులిచ్చిన భాగస్వామి తమ కోసం చేసిన త్యాగాలు, మంచి పనులు, తమను కేరింగ్‌గా చూసుకోవడం.. వంటివన్నీ గుర్తొచ్చి వాళ్లను అనవసరంగా దూరం చేసుకున్నామని బాధపడుతుంటారు. మీ ఆలోచనల్లో ఇలాంటి సంకేతాలు కనిపించాయంటే అది బ్రేకప్‌ పశ్చాత్తాపమే అంటున్నారు నిపుణులు.

⚛ అప్పటిదాకా తమ భాగస్వామితో గడిపి.. ఒక్కసారిగా వారి నుంచి శాశ్వతంగా విడిపోతే ఒంటరితనం వేధిస్తుంది. ఇది ఒక రకమైన మానసిక వేదనకు, భావోద్వేగాలకు కారణమవుతుంది. ఇలాంటి సమయంలోనే భాగస్వామి తోడు కావాలనిపిస్తుంది.

⚛ కొంతమంది క్షణికావేశంలో బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ ‘నేను చేసింది కరెక్టేనా?’, ‘ఇతరుల సలహా తీసుకోవాల్సింది!’, ‘ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మరోసారి ఆలోచించాల్సింది!’ అని ఆ తర్వాత బాధ పడుతుంటారు. ఇలా అప్పుడు బాధపడ్డా ప్రయోజనమేమీ ఉండదు.

⚛ ఎదుటి వ్యక్తిలో ఉండే లోపాలు, వాళ్లు చేసిన పొరపాట్లు.. ఇలా అనుబంధాన్ని తెంచుకోవడానికి ఏవైతే ప్రధాన కారణాలనుకున్నారో.. ఇప్పుడు అవే చిన్నవిగా కనిపిస్తాయట! వాళ్లతో గడిపిన సంతోషకర క్షణాలు, ఇతర జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చి.. ‘అనవసరంగా వాళ్లను దూరం చేసుకున్నా’నన్న భావనతో బాధ పడే వారూ కొందరుంటారట!

⚛ అసూయ ద్వేషాలతోనూ కొంతమంది తమ భాగస్వామిని దూరం చేసుకుంటారు. ఇలాంటి వారు తాము చేసిన పొరపాటేంటో తెలుసుకొని ఆపై రియలైజ్‌ అవుతుంటారు. అంతేకాదు.. తమ ఎడబాటుకు కారణమైన ఈ ప్రవర్తనను మార్చుకునే ప్రయత్నం చేసే వారూ లేకపోలేదు.

ఆ బాధ దూరమవ్వాలంటే..!

ఏదేమైనా, ఎంతగా రియలైజ్‌ అయినా జరిగిపోయిన దాన్ని మార్చలేం. అలాగని బ్రేకప్‌ పశ్చాత్తాపంతో అవే విషయాల్ని తలచుకొని బాధపడితే జీవితంలో ముందుకెళ్లలేం. కాబట్టి ఈ బాధ నుంచి బయటపడాలంటే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.

⚛ అనుబంధంలో తమ వల్ల జరిగిన బ్రేకప్‌ పొరపాటుతో భాగస్వామినీ బాధపెట్టిన వారవుతారు. కాబట్టి ఈ పశ్చాత్తాప భావన దూరం కావాలంటే.. వాళ్ల నుంచి దూరమైనా కలిసి ఓ క్షమాపణ చెప్పండి.. తద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ఆపై మీ పనులపై మీరు దృష్టి సారించచ్చు.

⚛ దంపతులు విడిపోయినంత మాత్రాన శత్రువులైపోయినట్లు కాదు.. బ్రేకప్‌ తర్వాత స్నేహితులుగా మారే జంటలు ఎన్నో ఉన్నాయి. మీరూ అలా మీ అనుబంధాన్ని స్నేహబంధంగా మార్చుకోవచ్చు. తద్వారా వారికి ఏదో ఒక రకంగా దగ్గరగా ఉంటూనే మీ మనసునూ కుదుటపరచుకోవచ్చు.

⚛ మనసులోని బాధను దూరం చేసుకోవాలంటే నచ్చిన అంశాలపై దృష్టి పెట్టడమూ ఓ మార్గమే! కాబట్టి మీకు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా మేలు చేసే మార్గాల్ని అన్వేషించడం, అభిరుచులపై ఆసక్తి చూపడం.. వంటివి చేయచ్చు.

⚛ బ్రేకప్‌తో మీ మాజీని బాధపెట్టామనే పశ్చాత్తాపంతో కుమిలిపోయే వారు.. వారికి అన్ని విషయాల్లో సహకరిస్తూనే మీ మనసులోని ఈ భావనను దూరం చేసుకోవచ్చు.

⚛ బ్రేకప్‌ వల్ల మీ నుంచి విడిపోయినంత మాత్రాన అవతలి వారు ఒంటరిగా ఉండాలని లేదు.. కాబట్టి వాళ్లు మరో అనుబంధంలోకి అడుగుపెడతామని నిర్ణయించుకున్నప్పుడు ఓ ఫ్రెండ్‌గా మీరు వారి నిర్ణయాన్ని స్వాగతించాలి. ఆ బంధంలోనైనా వాళ్లు సంతోషంగా ఉండేందుకు మీ వంతుగా సహకరించడమూ మంచిదే! తద్వారా మీ మనసులోని బాధ కూడా దూరమవుతుంది.

⚛ విడాకులు తీసుకున్నా.. తప్పు తెలుసుకొని మళ్లీ పెళ్లితో ఒక్కటయ్యే వారూ ఉంటారు. మీరూ అలాంటి నిర్ణయం తీసుకునే ముందు.. మీ మాజీ భాగస్వామితో మీ నిర్ణయాన్ని వ్యక్తపరచండి. వారు సరేనంటే మీ బాధ శాశ్వతంగా దూరమైనట్లే! ఒకవేళ వాళ్లు కాదంటే వాళ్లను ఒత్తిడి చేయకండి. ఇదీ ఒక రకంగా వారిని గౌరవించినట్లే!

⚛ ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది తమలో ఉన్న పశ్చాత్తాప భావనను దూరం చేసుకోలేకపోతారు. మాజీ భాగస్వామితో ఉండే అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంటారు. ఇలాంటి వారు మానసిక నిపుణుల సహాయం తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్