పుట్టగానే విడిపోయి.. 19 ఏళ్ల తర్వాత కలుసుకున్న కవలలు!

పుట్టిన పిల్లల్ని ఆస్పత్రి బెడ్‌ పైనుంచే దొంగిలించడం/అమ్మేయడం.. పెద్దయ్యాక వారు తమ పుట్టుక రహస్యాన్ని తెలుసుకోవడం, తిరిగి తమ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువుల చెంతకు చేరడం.. ఇలాంటివన్నీ మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ అచ్చం ఇలాంటి సంఘటనే జార్జియాలో చోటుచేసుకుంది.

Updated : 28 Jan 2024 16:00 IST

(Photos: Facebook)

పుట్టిన పిల్లల్ని ఆస్పత్రి బెడ్‌ పైనుంచే దొంగిలించడం/అమ్మేయడం.. పెద్దయ్యాక వారు తమ పుట్టుక రహస్యాన్ని తెలుసుకోవడం, తిరిగి తమ కన్న తల్లిదండ్రులు, తోబుట్టువుల చెంతకు చేరడం.. ఇలాంటివన్నీ మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం.. కానీ అచ్చం ఇలాంటి సంఘటనే జార్జియాలో చోటుచేసుకుంది. కవలలుగా పుట్టిన ఇద్దరు అమ్మాయిల్ని తల్లి పొత్తిళ్లలోనే నిర్దాక్షిణ్యంగా విడదీశాడు వాళ్ల తండ్రి. డబ్బుకు ఆశపడి వాళ్లను వేర్వేరు కుటుంబాలకు అమ్మేయడంతో ఇద్దరూ విడివిడిగా పెరిగారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని బంధాలు విడిపోవన్నట్లు.. కలిసి పుట్టిన వీరిని విధి పూర్తిగా విడదీయాలని చూసినా.. 19 ఏళ్ల తర్వాత తిరిగి కలుసుకున్నారు. ఇలా ఒకే పేగు తెంచుకొని పుట్టిన ఈ అక్కచెల్లెళ్ల కథ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. మరి, ఇంతకీ వీళ్లిద్దరికీ తాము కవలలమని ఎలా తెలిసింది? తిరిగి ఇద్దరూ ఎలా కలుసుకోగలిగారు? తెలుసుకోవాలంటే వీళ్ల కథ చదివేయండి!

అది 2002. జార్జియాలోని ఓ మెటర్నిటీ ఆస్పత్రిలో అజా అనే మహిళ ఇద్దరు కవల అమ్మాయిలకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో అజా కోమాలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన ఆమె భర్త.. డబ్బు కోసం ఆశపడి తన ఇద్దరు బిడ్డల్ని తల్లి పొత్తిళ్లలో నుంచి తీసి.. రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశాడు. వాళ్లిద్దరిలో ఒకరు అమీ ఖ్విటియా కాగా, మరొకరు అనో సార్టానియా. ఇలా కలిసి పుట్టినా వేర్వేరు ఇళ్లకు చేరారీ ఇద్దరు అక్కచెల్లెళ్లు. వీరిలో అమీ జార్జియాలోని జుగ్దీదీలో, అనో జార్జియా రాజధాని Tbilisiలో పెరిగారు.

నా డోపుల్‌గ్యాంగర్‌ అన్నారు!

ఇక వీళ్లను దత్తత తీసుకున్న కుటుంబాలు కూడా ఈ చిన్నారుల్ని తమ కన్న బిడ్డల్లాగే ప్రేమగా పెంచాయి. ఏ దశలోనూ తాము సొంత తల్లిదండ్రులం కాదన్న సందేహం రాకుండా జాగ్రత్తపడ్డాయి. ఇలా చూస్తుండగానే 12 ఏళ్లు గడిచిపోయాయి. అయితే కవలలు కావడం వల్ల వీళ్లిద్దరిలో చాలావరకు ఉమ్మడి లక్షణాలున్నాయి. వాటిలో డ్యాన్స్‌ కూడా ఒకటి. ఇద్దరికీ డ్యాన్స్‌ అంటే ప్రాణం. ఈ మక్కువతోనే ఇద్దరూ చిన్న వయసు నుంచే ఇందులో శిక్షణ తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. అమీ ఓ రోజు తనకిష్టమైన ‘జార్జియాస్‌ గాట్‌ ట్యాలెంట్‌ షో’ అనే డ్యాన్స్‌ రియాల్టీ షో టీవీలో చూస్తోంది. అందులో అచ్చం తన పోలికలతో ఉన్న అమ్మాయి వేదిక పైకి వచ్చి డ్యాన్స్‌ చేయడం గమనించిందామె. దాని గురించి పంచుకుంటూ- 

‘మా కుటుంబమంతా కలిసి ఆ డ్యాన్స్‌ రియాల్టీ షో చూస్తున్నాం. ఆ వేదికపై అచ్చం నా పోలికలతో కూడిన ఓ అమ్మాయి డ్యాన్స్‌ చేయడం చూసి.. అక్కడున్న వారంతా ‘అమీ పేరు మార్చుకొని గానీ ఈ డ్యాన్స్‌ షోలో పాల్గొనలేదుగా?!’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నేను అమ్మ వైపు చూస్తూ ఆతృతగా.. ‘ఆ అమ్మాయి చూడమ్మా.. అచ్చం నాలానే ఉంది’ అన్నాను. దాంతో ‘మనుషుల్ని పోలిన మనుషులు ఈ లోకంలో ఏడుగురుంటారని అంటారు.. అలా ఈ అమ్మాయి నీ డోపుల్‌గ్యాంగర్‌ కావచ్చు!’ అంది అమ్మ. అయినా ఆ అమ్మాయి ప్రతిరూపం నా మనసులో నుంచి తొలగిపోలేదు.. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆ డ్యాన్స్‌ వీడియోనే చూస్తూ ఆమె ప్రతిరూపాన్ని తలచుకునేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చింది అమీ.

కట్ చేస్తే.. ఏడేళ్ల తర్వాత!

ఇలా చూస్తుండగానే మరో ఏడేళ్లు గడిచిపోయాయి. అమీ, అనో సోషల్‌ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. తమ జీవనశైలికి సంబంధించిన వీడియోల్ని తరచూ ఈ వేదికలపై పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన జుట్టుకు నీలం రంగు వేసుకొని, కనుబొమ్మల్ని కుట్టించుకున్న ఓ వీడియోను 2021లో టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసింది అమీ. ఇదే వీడియో అనో స్నేహితురాలి కంట పడింది. వెంటనే దీన్ని అనోకు షేర్‌ చేసింది. అలా తొలిసారి తన కవల సోదరిని చూసిన అనో.. ‘అబ్బ.. అచ్చం ఈ అమ్మాయి నాలాగే ఉందే!’ అనుకుంది. ఎలాగైనా ఆ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే నెట్‌లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయంలో తనకు సహాయం చేయాల్సిందిగా తాను చదువుకునే యూనివర్సిటీ వాట్సప్‌ గ్రూప్‌లో ఓ వీడియోను పోస్ట్‌ చేసింది అనో. దీంతో అమీ గురించి తెలిసిన ఓ వ్యక్తి.. ఇద్దరినీ ఫేస్‌బుక్‌లో పరిచయం చేశారు. ఇలా మాటల మధ్యలోనే ఏడేళ్ల క్రితం డ్యాన్స్‌ రియాల్టీ షోలో డ్యాన్స్‌ చేసిన అమ్మాయి అనోనే అని తెలుసుకుంది అమీ.

‘అన్నీ ఉన్నా నా జీవితం ఎప్పుడూ ఏదో ఒక వెలితిగా అనిపించేది. నా ఆత్మీయులు నాకు దూరమైన ఫీలింగ్‌ కలిగేది..’ అంటూ తన మనసులోని భావాల్ని పంచుకుంది అనో. ఇలా వీళ్లిద్దరూ ఎన్నో ఏళ్లుగా దూరమైన ఆత్మీయుల్లా మాట్లాడుకోవడం, తమ మనసులోని భావాల్ని పంచుకోవడం మొదలుపెట్టారు.

పోలికలే కలిపాయి!

ఇలా ఎట్టకేలకు పుట్టిన 19 ఏళ్ల తర్వాత ఈ అక్కచెల్లెళ్లిద్దరూ సోషల్‌ మీడియా పుణ్యమా అని తొలిసారి మాట్లాడుకోగలిగారు. ఈ క్రమంలో కొన్ని రోజుల్లోనే తమ మధ్య చాలా ఉమ్మడి పోలికలున్నట్లు గుర్తించారు. తామిద్దరూ ఒకే రోజు, ఒకే ఆస్పత్రిలో పుట్టినట్లు జనన ధ్రువీకరణ పత్రం ద్వారా తెలుసుకోగలిగారు. అలాగే ఇద్దరికీ సంగీతం, డ్యాన్స్‌ అంటే ప్రాణమని, హెయిర్‌స్టైల్స్‌లోనూ పోలికలున్నాయని.. ఇలా చాలా విషయాలు తెలుసుకోగలిగారు. అంతేకాదు.. ఇద్దరికీ ‘Displasia’ అనే ఎముక సంబంధిత జన్యుపరమైన వ్యాధి కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇలా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే కొద్దీ ఇద్దరి మధ్య ఏదో ఆత్మీయ బంధం ఉందేమో అనిపించింది. అదేంటో తెలుసుకోవాలనే వివిధ రకాల ప్రయత్నాలు చేశామంటోంది అమీ.

‘మా ఇద్దరి పోలికలు ఒకటే.. స్వభావాలూ దాదాపు కలిశాయి.. ఇద్దరి గొంతు కూడా ఒక్కటే. ఒక్కమాటలో చెప్పాలంటే నేనే తను, తనే నేను. ఇన్ని పోలికలున్నాయంటే మా మధ్య ఏదో అనుబంధం ఉందనిపించింది. ఈ విషయం తెలుసుకోవడానికే మా ఇద్దరి తల్లిదండ్రుల్ని ఆరా తీశాం. అప్పుడు తెలిసింది.. మా ఇద్దరినీ వారు దత్తత తీసుకున్నారని.. మేమిద్దరం కవల సోదరీమణులమని’ అంది అమీ.

అలా తల్లి చెంతకు..!

ఇలా మొత్తానికి తామిద్దరం అక్కచెల్లెళ్లమని తెలుసుకున్న ఈ కవలలిద్దరూ ఆపై తమను కన్న తల్లి కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే.. తమలా పుట్టినప్పుడు చట్టవిరుద్ధంగా దత్తత తీసుకున్నట్లు అనుమానించిన పిల్లల్ని తమ అసలు కుటుంబాలతో కలిపేందుకు కృషి చేస్తోన్న ఓ ఫేస్‌బుక్‌ గ్రూప్‌ అమీ కంట పడింది. దాన్ని అక్కడి జర్నలిస్ట్‌ తమునా నిర్వహిస్తున్నారు. అలా ఆ సోషల్‌ మీడియా గ్రూప్‌ సహాయంతో, డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తమ కన్న తల్లి గురించి తెలుసుకున్నారీ ఇద్దరు సోదరీమణులు. ఆపై జార్జియాలోని తన తల్లిని కలుసుకున్నాక ఈ తల్లీబిడ్డల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

‘నేను కోమా నుంచి బయటికొచ్చాక నాకు పుట్టిన ఇద్దరు బిడ్డలు చనిపోయారని నా భర్త చెప్పడంతో ఎంతగానో ఏడ్చా. కానీ ఆ తర్వాత ఆస్పత్రి రికార్డుల్ని పరిశీలించాక.. నా బిడ్డలు చనిపోలేదని, ఎక్కడో పెరుగుతున్నారని తెలియడంతో నా మనసు కాస్త కుదుటపడింది. అప్పట్నుంచి నా కంటి పాపల్ని ఎప్పుడెప్పుడు కలుసుకుంటానా అని కళ్లల్లో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నా.. నా స్వప్నం ఇప్పుడు ఫలించింది..’ అంటూ ఒకింత భావోద్వేగానికి గురైంది అజా. తన బిడ్డలిద్దరినీ గుండెలకు హత్తుకొని ఆనందం వ్యక్తం చేసింది. ఇలా ఈ కవలలు ఒకరినొకరు కలుసుకోవడం, తమ తల్లి వద్దకు చేరుకోవడంతో కథ సుఖాంతమైంది. అయితే ఇటీవలే ఈ ట్విన్‌ సిస్టర్స్‌ తమ కథను ఓ సందర్భంలో పంచుకోగా.. ప్రస్తుతం వీళ్ల కథ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్