ఇలా చేస్తే ‘బ్యాలన్స్’ సాధ్యమే!

ఇటు ఇంటి పనైనా, అటు ఆఫీస్‌ వర్క్‌ అయినా సమయానికి పూర్తి కావాలంటే ముందుగా ప్రాథమ్యాలను నిర్ణయించుకోవడం ముఖ్యమన్నది తెలిసిందే. ఇందుకోసం ఆ రోజు చేయాల్సిన పనులేంటి? వాటిలో అత్యంత ప్రాధాన్యమున్నవేంటి? ఇలా ఓ జాబితా.....

Published : 20 Oct 2022 20:03 IST

ఇటు ఇంటి పనైనా, అటు ఆఫీస్‌ వర్క్‌ అయినా సమయానికి పూర్తి కావాలంటే ముందుగా ప్రాథమ్యాలను నిర్ణయించుకోవడం ముఖ్యమన్నది తెలిసిందే. ఇందుకోసం ఆ రోజు చేయాల్సిన పనులేంటి? వాటిలో అత్యంత ప్రాధాన్యమున్నవేంటి? ఇలా ఓ జాబితా తయారుచేసుకోవాలి. ఈ సూత్రం ఆఫీస్‌ పనులకే కాదు.. ఇంటి పనులకూ వర్తిస్తుంది.

విరామం కావాల్సిందే..!

నిరంతరాయంగా పని చేసినా తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. తద్వారా ఆపై అటు ఆఫీస్‌ పని, ఇటు ఇంటి పనిపై దృష్టి పెట్టలేరు. ఫలితంగా దాని ప్రభావం చివరికి వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ పైనే పడుతుంది. కాబట్టి ఏ పనైనా, ఎంత బిజీగా ఉన్నా నిర్ణీత వ్యవధుల్లో కొద్దిసేపు విరామం తీసుకోవడం మంచిది. దానివల్ల మనసు తిరిగి ఉత్తేజితమవుతుంది. అలాగని కాఫీ/టీలు తెగ తాగేయడం వల్ల ఆరోగ్యానికే నష్టం. కాబట్టి ఈ క్రమంలో పని ప్రదేశాన్ని వదిలి కాసేపు నడవడం, మీకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడడం, ఉన్న చోటే మెడిటేషన్‌ చేయడం, ఆహ్లాదకరంగా ఉండే మొక్కలు లేదా బొమ్మల్ని చూడడం.. వంటివి చేయచ్చు. ఎంతైనా.. మనసుకు ఒత్తిడిగా అనిపించినప్పుడు నచ్చిన పని చేస్తే ఆ ఆనందమే వేరు కదా! ఇలా ఎప్పటికప్పుడు మనసును ప్రశాంతపరచుకుంటే చాలు.. ఏ పనైనా చకచకా పూర్తి చేసేసుకోవచ్చు.

కలిసి పంచుకోవాల్సిందే!

‘సంపాదిస్తోంది కాకుండా ఇంటి పనులన్నీ నేనే చేయాలా?’ అంటూ పని ఒత్తిడితో అప్పుడప్పుడూ విసుక్కోవడం చాలామందికి అలవాటే! నిజానికి అన్ని పనులు మనమే చేసుకోవాలంటే రోజులో ఉన్న 24 గంటలు సరిపోదు. అలాగని విశ్రాంతి లేకుండా పనిచేయడం ఎవ్వరి వల్లా కాదు. కాబట్టి ఇంటిని-పనిని బ్యాలన్స్‌ చేసుకోవాలంటే ఇంటి పనుల్లో ఇల్లాలితో పాటు కుటుంబ సభ్యులు కూడా భాగం కావాలి. కూరగాయలు కట్‌ చేయడం, వంట చేయడం.. వంటివి భార్యాభర్తలిద్దరూ కలిసి పంచుకున్నా; బట్టలు ఆరేయడం, వాటిని మడతపెట్టడం, ఇల్లు ఊడవడం.. వంటి చిన్న చిన్న పనుల్లో పిల్లల్నీ భాగం చేయాలి. ఇలా చేయడం వల్ల పని భారం తగ్గడంతో పాటు పిల్లలకూ పని అలవాటవుతుంది. తద్వారా అలసిపోకుండా వృత్తిలోనూ మెరుగ్గా రాణించచ్చు. వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేసుకోవడానికి ఇదీ చక్కటి మార్గమే!

ఆరోగ్యంతో ‘బ్యాలన్స్’!

ఇటు ఇంటి పని చేయాలంటే శరీరం సహకరించాలి.. అటు ఆఫీస్‌ పనులు పూర్తి చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండూ సాధ్యం కావాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం. ఇందుకోసం తీసుకునే ఆహారం, చేసే వర్కవుట్స్‌ కీలకమని చెప్పచ్చు. చాలామంది మహిళలు బిజీ బిజీ అంటూ తమ కోసం కాస్త సమయమైనా కేటాయించుకోలేరు.. ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించరు. వేళకు భోజనం చేయరు. తద్వారా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సమయానికి భోజనం చేయడం ముఖ్యం. అలాగే రోజూ ఓ అరగంట పాటు వ్యాయామం, ధ్యానం.. వంటివి చేస్తే మనసుకూ ఉల్లాసంగా ఉంటుంది. ఇక కుటుంబంతో కలిసి చేస్తే వారితో మరింత సమయం గడిపిన వారవుతారు. ఇలా సంపూర్ణ ఆరోగ్యం సొంతమైతే వర్క్‌-లైఫ్‌ బ్యాలన్స్‌ చేయడం పెద్ద కష్టమనిపించదు.. కావాలంటే ట్రై చేసి చూడండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని