పాదాలు వాస్తున్నాయా?

గర్భిణుల్లో, ఎక్కువసేపు కూర్చున్న వారిలో పాదాల వాపు సహజమే. పాదాల్లో నీరు చేరడమే ఇందుకు కారణం. సాధారణంగా ఇది ఒకట్రెండు రోజుల్లో తగ్గినా.. కొన్నిసార్లు శరీరం బరువుగా అనిపించి.. అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఎదురవుతుంటుంది.

Published : 01 Nov 2023 12:33 IST

గర్భిణుల్లో, ఎక్కువసేపు కూర్చున్న వారిలో పాదాల వాపు సహజమే. పాదాల్లో నీరు చేరడమే ఇందుకు కారణం. సాధారణంగా ఇది ఒకట్రెండు రోజుల్లో తగ్గినా.. కొన్నిసార్లు శరీరం బరువుగా అనిపించి.. అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఎదురవుతుంటుంది. మరి, ఇంతకీ పాదాల్లో వాపు ఎందుకొస్తుంది? దీన్నుంచి బయటపడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం రండి..

కారణాలివే!

మన శరీరంలో అణువణువూ నీరు ఉంటుంది. ఈ నీటి శాతం తగ్గినా, పెరిగినా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అందులో పాదాల వాపు కూడా ఒకటి. నెలసరికి కొన్ని రోజుల ముందు హార్మోన్లలో వచ్చే మార్పులూ ఈ సమస్యకు కారణమవుతాయి. మూత్రపిండాల్లో సమస్యలు, కాలేయ సమస్యలు, హృద్రోగాలు.. మొదలైన వాటి వల్ల కూడా పాదాల్లో నీరు చేరడం సహజం. దీంతో శరీరం బరువుగా అనిపిస్తుంది. కీళ్లు, కండరాల్లో నొప్పులు వస్తాయి. నీటి శాతం మరింత పెరిగితే పాదాలు, కాళ్లు ఉబ్బుతాయి.

ఇలా చేసి చూడండి!

పాదాల వాపు సమస్యను తగ్గించుకోవాలంటే ముందుగా ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి.

కారం, మసాలాలు మితిమీరి తీసుకోకూడదు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని ఎంచుకోవాలి.

బార్లీ, అల్లం, ఆకుకూరలు, అరటిపండ్లు, మజ్జిగ.. వంటివి ఎక్కువగా తీసుకోవాలి. టొమాటో రసం తాగితే మంచిది.

పడుకునేటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకోవడంతో పాటు నడక, సైకిల్‌ తొక్కడం.. వంటి వ్యాయామాలు, కాళ్లు పైకి ఎత్తి చేసే ఆసనాలు సాధన చేయాలి.

మునగాకుతో..

మునగాకు రెమ్మలను తీసుకుని ఆకులు దూసేయాలి. ఆ కాడలను చిన్న ముక్కలుగా తరిగి, అందులోంచి గుప్పెడు తీసుకొని రెండు గ్లాసుల నీటిలో వేసి మరిగించాలి. నీరు సగం అయ్యాక ఆ కషాయాన్ని వడకట్టి, అందులో అరచెంచా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసుకొని వేడివేడిగా తాగాలి. ఈ కషాయం శరీరంలో ఉన్న అధిక నీటిని మూత్రం రూపంలో బయటికి పంపించేస్తుంది. తద్వారా వాపు సమస్య చాలా త్వరగా అదుపులోకి వస్తుంది. అలాగే బార్లీ గింజలు ఉడికించిన నీటిని రెండు పూటలా తాగినా సమాన ఫలితం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్