Published : 29/03/2022 18:37 IST

చనుబాలు మాన్పించేదెలా..?

మోహన వాళ్ల పాపకు రెండేళ్లు. అయినా ఇంకా ఆ పాప తల్లిపాలు తాగుతూనే ఉంది. ఎంత మాన్పిద్దామన్నా అది ఆమె వల్ల కావట్లేదు. పైగా పాపకు పాలివ్వకపోతే ఆకలికి తట్టుకోలేక ఏడుపు మొదలెడుతుంది. ఘనాహారం పెట్టినా తినకుండా మొహం తిప్పేస్తుంది. పాలే కావాలంటూ అల్లరి చేస్తుంది. ఇలా కొంతమంది పిల్లలు తల్లిపాలకు అలవాటు పడి వయసు పెరిగినప్పటికీ తల్లిపాలే తాగుతామని మొండికేస్తుంటారు. ఇదిలాగే కొనసాగితే వారికి వూహ తెలిసిన తర్వాత వారితో పాలు మానిపించడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి చిన్నారులకు సంవత్సరం నుంచి ఒకటిన్నర సంవత్సరాల వయసు వరకు మాత్రమే పాలిచ్చి ఆ తర్వాత పూర్తిగా ఘనాహారాన్ని అందించమని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలో పిల్లలతో పాలు మాన్పించడానికి తల్లులు ఎలాంటి నియమాలు పాటించాలి..? రండి తెలుసుకుందాం..

తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా వారిలో రోగనిరోధక శక్తి పెరగడానికి తల్లిపాలను మించిన ఆహారం లేదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తప్పనిసరిగా వారికి తల్లిపాలు పట్టడం అత్యవసరం. అది పిల్లల ఆరోగ్యానికే కాదు.. తల్లుల ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. అయితే పిల్లల ఆరోగ్యానికి చనుబాలు మంచివి కదా అని వారికి వూహ తెలిసే వరకు పాలివ్వడం కొనసాగిస్తే.. వారు ఘనాహారం తినడానికి నిరాకరిస్తుంటారు. పాల ద్వారా వారికి సరిపడా పోషకాలు అందక పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడవచ్చు. ఇక ఏడాదిన్నర దాటితే పిల్లలతో పాలు మాన్పించడం చాలా కష్టమవుతుంది. కాబట్టి పిల్లలకు సంవత్సరం తర్వాత నుంచే నెమ్మదిగా పాలు మాన్పించే ప్రయత్నం చేయాలి.

నెమ్మదిగా తగ్గించాలి..

పుట్టినప్పటి నుంచి పాలు తాగుతూ పెరిగిన పిల్లలతో ఒక్కసారిగా పాలు మాన్పించడం అస్సలు కుదరదు. కాబట్టి వారితో నెమ్మదిగా తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం వారికి ఎప్పటిలాగే తరచుగా పాలివ్వడం కాకుండా నెమ్మదిగా పాలిచ్చే వ్యవధిని పెంచుతూ పోవాలి. కొన్ని రోజులయ్యాక సగానికి సగం సార్లు పాలివ్వడం ఆపేయాలి. అంటే.. రోజుకు ఓ ఐదారు సార్లు పాలిస్తున్నారనుకోండి.. ఆ సంఖ్యను తగ్గించి.. రెండుసార్లకు మించకుండా చూసుకోవాలి. ఆ మధ్యలో పిల్లలకు ఆకలైనప్పుడు వారి నోటికి రుచిగా అనిపించేలా ఏదో ఒక ఘనాహారం అందించాలి. ఇలా క్రమంగా పాలు మాన్పించాల్సి ఉంటుంది.

రుచిగా అందించండి..

ఆరు నెలల వయసు దాటిన పిల్లలకు తల్లిపాలతో పాటు ఘనాహారం కూడా పెడుతుంటారు. ఇలా పెట్టడం వల్ల సంవత్సరం దాటేసరికి వారికి ఘనాహారం అలవాటైపోతుంది. కాబట్టి వారి నోటికి రుచించేలా ఉండే చారు కలిపిన అన్నం, ఇడ్లీ, దోశ.. వంటి ఆహార పదార్థాల్ని తినిపించాలి. దీంతో కడుపు నిండడమే కాదు.. పోషకాలూ అందుతాయి. అలాగే ప్రస్తుతం పిల్లల కోసం మార్కెట్లో లభించే విటమిన్లు, ఖనిజాలు నిండిన పోషకాలందించే పొడుల్ని పాలలో కలిపి తాగించడం కూడా చేయచ్చు. ఇలా వారి నోటికి రుచించే ఘనాహారం, ద్రవాహారం అందించడం వల్ల వారి మనసు తల్లి పాల నుంచి ఇతర ఆహార పదార్థాల మీదకు మళ్లే అవకాశం ఉంటుంది. ఇలా క్రమంగా చేస్తే వారితో పాలు మాన్పించడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే చిన్నారులకు పోషకాల పొడులను అందించే ముందు ఓసారి పిడియాట్రీషియన్ సలహా తీసుకోవడం మంచిది.

ఆ భావన కలగకుండా..

పిల్లల్ని తల్లిపాలకు దూరం చేసిన కొద్దీ వారు అభద్రతా భావానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారిలో ఇలాంటి భావన రాకుండా ఉండాలంటే.. వారిని ఒక్కసారిగా పాలకు దూరం చేయకూడదు. దాంతోపాటు వారితో ఎక్కువ సయమం గడపాలి. ఆటపాటలు, నడక, మాటలు నేర్పడం.. ఇలా వారికి కొత్తగా అనిపించే విషయాలతో వారిని ఎప్పుడూ బిజీగా ఉంచాలి. తద్వారా తల్లికి దూరమవుతున్నామనే భావన వారికి రాకుండా ఉంటుంది. ఇలా వారిలో కలిగే అభద్రతా భావాన్ని దూరం చేసినట్లయితే వారితో చనుబాలు సులువుగా మాన్పించవచ్చు.

పొజిషన్ ఛేంజ్..

మంచంపై పడుకొని సౌకర్యవంతంగా పాలిస్తుంటే ఇక పిల్లలు పాలెలా మానతారు? కాబట్టి వారితో పాలు మాన్పించాలంటే వారికి సౌకర్యవంతంగా పాలివ్వడాన్ని తగ్గించాలి. ఇందుకోసం నిల్చుని పాలు పట్టడం.. మరికాసేపు ఎత్తుకొని అటూ ఇటూ తిరగడం.. వంటివి చేయాలి. ఇలా వారు తరచూ పాలు తాగే ప్రదేశం నుంచి వారిని దూరం చేయడం వల్ల కూడా వారు పాలు మానే అవకాశాలు కొంతవరకు ఉంటాయని చెప్పుకోవచ్చు.

సహజసిద్ధంగా..

పిల్లలతో పాలు మాన్పించడానికి కొన్ని సహజసిద్ధ పద్ధతుల్ని కూడా ప్రయత్నించవచ్చు. అందుకోసం..

* కాకరకాయ లేదా వేపాకుల నుంచి తీసిన రసాన్ని కాసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఈ రసాన్ని పిల్లలకు పాలిచ్చే ముందు రొమ్ములకు పూసుకోవాలి. ఇందులోని చేదు వల్ల పిల్లలు పాలు తాగడానికి అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. అలాగే ఒకసారి చేసి వదిలేయడం కాకుండా తరచూ ఈ పద్ధతిని పాటించడం వల్ల కొన్ని రోజుల్లోనే పిల్లలతో పాలు తాగే అలవాటును మాన్పించచ్చు.

* వయసు పెరిగే పిల్లలతో పాలు మాన్పించడానికి శొంఠి పొడి కూడా ఉపయోగపడుతుంది. పైగా ఇది అమ్మమ్మల కాలం నుంచి ఆచరిస్తోన్న చిట్కా కూడా! శొంఠి పొడిలో కొన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని పాలిచ్చే ముందు రొమ్ములకు రాసుకొని ఆ తర్వాత వారికి పాలు పట్టాలి. దీని ఘాటు వల్ల పిల్లలు మరోసారి పాలు తాగడానికి అయిష్టత చూపే అవకాశం ఉంది. ఈ పద్ధతిని తరచూ పాలిచ్చే ముందు పాటించడం వల్ల పిల్లలు త్వరలోనే పాలు మానే అవకాశం ఉంటుంది. అలాగే ఈ పదార్థాలతో పాటు నిమ్మరసాన్ని కూడా ఉపయోగించచ్చు.

ఓ వయసొచ్చాక పిల్లలతో పాలు మాన్పించడమెలాగో తెలుసుకున్నారు కదా! మరి, మీరూ మీ పిల్లల విషయంలో ఇవన్నీ పాటించి చూడండి. ఒకవేళ ఫలితం లేకపోతే సంబంధిత పోషకాహార నిపుణుల వద్దకు తీసుకెళ్తే వారేమైనా సలహాలు సూచించే అవకాశం ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని