Updated : 06/03/2022 17:33 IST

ఉద్యోగం మానకుండానే ఇలా బ్యాలన్స్ చేయండి..!

స్వప్న ఎంబీయే చేసి ఓ పెద్ద కంపెనీలో హెచ్ఆర్ హెడ్‌గా పనిచేస్తోంది. జీతం ఆరంకెల్లో ఉంటుంది. అయినా తనెప్పుడూ ఆనందంగా ఉండటం ఎవరూ చూడలేదు. కారణం తన ఉద్యోగంలో ఆమెకు సంతృప్తి లేక కాదు.. దీనివల్ల పిల్లలకు దూరమవుతున్నాననే బాధ.. తను ఉదయాన్నే లేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఆఫీసుకొస్తుంది. ఆఫీసులో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుందేమో.. ఇంటికి బయల్దేరేసరికి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లేసరికి పిల్లలు నిద్రపోయే మూడ్‌లో ఉంటారు.. వాళ్లతో కలిసి గడపలేకపోతున్నానని, వాళ్ల చదువుల్లో సహాయం చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉంటుంది స్వప్న. అయితే తన ఆర్థిక స్థితి బాగుండాలంటే ఉద్యోగం తప్పనిసరి. అందుకే ఉద్యోగం చేయలేక, మానలేక ఇబ్బంది పడుతోంది స్వప్న. కరోనా నేపథ్యంలో ఇటీవల కొన్ని నెలల పాటు ఇంటి నుంచే పని చేసినా, ఇప్పుడు మళ్లీ ఆఫీసుకు వెళ్లాల్సి రావడంతో పిల్లల గురించి స్వప్న బాధ మళ్లీ మొదలైంది.

ఇదే సమస్య!

చాలామంది వర్కింగ్ మదర్స్‌ది ఇదే సమస్య.. భార్యా, భర్త ఇద్దరూ కలిసి ఉద్యోగాలు చేస్తే గానీ ఇల్లు గడవని ప్రస్తుత పరిస్థితుల్లో ఆడవాళ్లు కూడా ఇంటి పనులతో పాటు ఆఫీసు బాధ్యతలనూ మోస్తున్నారు. ఆర్థికంగా భర్తకు తోడ్పాటునందిస్తున్నారు. ప్రత్యేకించి కరోనా తర్వాత మారిన ఆర్ధిక సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు చాలా ఇళ్లల్లో భార్యాభర్తలిద్దరూ తప్పక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి.

అయితే ఈ క్రమంలో- పిల్లలతో గడపలేకపోతున్నామనే బాధ తల్లుల్లో ఎక్కువవుతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం ఉద్యోగం చేసే తల్లులు తమ పిల్లలతో రోజుకు కేవలం గంట, గంటన్నర కంటే ఎక్కువ సమయం వెచ్చించలేకపోతున్నారట.

'గిల్టీ బయింగ్' వద్దు..

చాలామంది తల్లులది ఇదే సమస్య.. 'ఇంత కష్టపడుతోంది పిల్లల కోసమే.. కానీ వాళ్లతో గడిపే సమయమే దొరకట్లేదు..' ఎవర్ని కదిపినా ఇదే పరిస్థితి. ఈ ఫీలింగ్ వల్లే చాలామంది అమ్మలు పిల్లలు ఏదడిగితే అది ఇట్టే కొనిచ్చేస్తుంటారు. తమ ప్రేమను ఆ రకంగా చూపిస్తున్నామని వాళ్లనుకుంటారు. వాళ్లతో తాము గడపలేకపోయిన సమయానికి ఈ రకంగా పరిహారం చెల్లిస్తున్నామని భావిస్తుంటారు. కానీ ఈ రకమైన 'గిల్టీ బయింగ్' తప్పంటున్నారు నిపుణులు. దీనివల్ల పిల్లలకు తామేదడిగితే అది వెంటనే దొరుకుతుందన్న భావన కలుగుతుంది. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా అలా జరగకపోతే వాళ్లు చాలా బాధపడతారు. రెబల్ మనస్తత్వాన్ని పెంచుకుంటారు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉద్యోగం మానద్దు...

'ఇలా అయితే వీడు చదవడు.. నేను ఉద్యోగం మానేసి వీడిని చదివించాల్సిందే.. లేకపోతే మంచి మార్కులు అస్సలు రావు..' ఇలాంటి మాటలు చాలామంది అమ్మల నోటి నుంచి వింటుంటాం.. అయితే పిల్లల చదువు కోసం పూర్తిగా ఉద్యోగం మానడమే సరైన పద్ధతి కాకపోవచ్చు. మీరిప్పుడున్న లైఫ్‌స్త్టెల్‌లోనే పిల్లల కోసం ఎక్కువ సమయం ఎలా కేటాయించగలరో ఆలోచించండి. పనులన్నీ ఓ లిస్టు రాసుకొని చేసుకోవడం వల్ల తొందరగా పూర్తవుతాయి. ఆఫీసు పనులను కూడా మరీ ఎక్కువ సేపు కాకుండా త్వరగా పూర్తి చేసుకొని వీలైనంత తొందరగా ఇంటికి బయల్దేరే విధంగా చూసుకోండి. అవసరమైతే దీని కోసం మీరు మీ యాజమాన్యంతో మాట్లాడండి. కరోనా వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా కంపెనీలు ఇంటి నుంచి పనికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఒకవేళ మీకు అలాంటి సౌకర్యం లేకపోతే- నిదానంగా కంపెనీ మారే అవకాశం ఉంటుందేమో ఆలోచించండి. ఉద్యోగం మారిపోవడమో లేక మానేయడమో అప్పుడు తేల్చుకోవచ్చు.

అయితే 'క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.. బట్ క్వాలిటీ ఈజ్' అనే ఇంగ్లిష్ సామెతలాగా మనం పిల్లలతో ఎంతసేపు గడుపుతున్నామన్నది కాదు ప్రశ్న.. గడిపే కొద్ది సమయంలోనే ఎంత ఆనందంగా ఉంటున్నామన్నదే ముఖ్యం.. సాయంత్రం మిగిలిన కొద్ది నిమిషాల్లోనే పిల్లలతో గేమ్స్ ఆడండి, వాళ్లతో కబుర్లు చెప్పండి, స్కూలు విషయాలు, బయట విషయాలు, ఫ్రెండ్స్ గురించి.. ఇలా చెప్పాలంటే పిల్లల దగ్గర లేని విషయాలంటూ ఉండవు.. ఒక్కసారి అడగడం ప్రారంభిస్తే చాలు.. వసపిట్టలా గడగడా మాట్లాడటం ప్రారంభించేస్తారు. తర్వాత దాన్ని ఆపడం మన చేతిలో ఉండదు. పిల్లల మాటల్ని కూడా వినీ విననట్టు ఉండకుండా పూర్తి శ్రద్ధతో వాళ్లతో సమయాన్ని గడపండి. కావాలంటే కాసేపు ఇంకే పనులూ పెట్టుకోకుండా కేవలం వాళ్లకే కేటాయించినా మంచిదే..!

పనులు పంచండి...

అలాగే మరో విషయం.. ఇంట్లో లేదా ఆఫీసులో అన్ని పనులూ మీరొక్కరే చేసుకుంటూ పోతే సమయమంతా వాటికే సరిపోతోంది అని బాధ పడటం సరైంది కాదు.. పనులను పంచడం అలవాటు చేసుకోండి. ఆఫీసులో మీ కింద ఉద్యోగులు చేయగలిగిన పనులను మీ చేతిలోకి తీసుకోవద్దు. దీనివల్ల మీ మీద పనిభారం పెరగడం తప్ప ఇంకెలాంటి ఉపయోగమూ లేదు. మీకు సపోర్టింగ్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకోండి. మీరు లేని సమయాల్లో ఇంట్లో లేదా ఆఫీసులో పని పూర్తిగా ఆగిపోకుండా ఉంటే మంచిది. ఇక పిల్లలతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలంటే మీకు నచ్చిన పనిని మీకు నచ్చిన వేళల్లో చేసుకొనే అవకాశం కల్పించే ఉద్యోగం ఏదైనా ఉంటే దాన్ని వెతుక్కోవడం చాలా మంచి పద్ధతి. ఈ రోజుల్లో చాలామంది మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఇలాంటి అసైన్‌మెంట్స్ వెతుక్కుంటున్నారు కూడా.. అందులోనూ కరోనా నేపథ్యంలో - ఇప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల కంటే తాత్కాలికంగా అయినా సరే ఇంటి నుంచే పని చేసే మహిళలకు చాలా కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. సో.. మీరూ వాళ్లను ఫాలో అయిపోండి. పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగం మానేయాలని మాత్రం ఆలోచించద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని