Updated : 04 Aug 2021 18:30 IST

దీపికని గుర్తుపట్టారా..!

తాజాగా వచ్చిన ‘ఛపాక్‌’లో కాలిన ముఖం... అట్టలు కట్టిన చర్మంతో దీపికా పదుకొణెని చూస్తే కళ్లు చెమ్మగిల్లాల్సిందే. కొన్ని సీన్లలో అయితే అసలైన బాధితురాలే తెరమీదకొచ్చిందా అనిపిస్తుంది. అందాల దీపికలోని ఆ మార్పు ప్రోస్థటిక్‌ మేకప్‌ మహిమ. దీనితో పడుచులు వృద్ధులైపోతున్నారు, బక్కగా ఉన్నవాళ్లు భారీకాయులైపోతున్నారు. ఈ ట్రిక్కుతోనే మన సినిమాల్లోని హీరోహీరోయిన్లు రూపాన్ని అనూహ్యంగా మార్చేసుకుని పాత్రల్ని పండిస్తున్నారు.

దీపికా పదుకొణె నిర్మాతగా మారి దిల్లీ యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా తీసిన చిత్రం ‘ఛపాక్‌’. లండన్‌కు చెందిన క్లోవర్‌ వూటన్‌ తన మేకప్‌తో ఈ చిత్రంలో దీపికనూ యాసిడ్‌ దాడి బాధితురాలిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటిరోజు మేకప్‌ అయ్యాక దీపిక అద్దంలో తన ముఖాన్ని చూసుకుని ఏడ్చేసిందట. దిల్లీ వీధుల్లో షూటింగ్‌ జరిగినా ఆ గెటప్‌లో దీపికను ఎవరూ గుర్తుపట్టలేదట. పైగా అక్కడ వేడికి పది గంటలపాటు గాలి తగలక దద్దుర్లు వచ్చి చర్మం మండిపోయేదట. అయినా విరామం తీసుకోకుండా దీపిక ఈ షూటింగ్‌లో పాల్గొందని చెబుతారు దర్శకురాలు మేఘనా గుల్జార్‌. అలానే దీపికకు క్లోవర్‌ బృందంలోని పదిమంది ఆర్టిస్టులు ప్రోస్థటిక్‌ మేకప్‌ని నాలుగు గంటలపాటు వేస్తే... దాన్ని తీయడానికి మరో రెండు గంటలు శ్రమించేవారట. ఈ మధ్య వచ్చిన ‘శాండ్‌ కీ ఆంఖ్‌’లో తాప్సీ కూడా ముడతల ముఖం, వదులైన మెడతో ఎవరూ గుర్తుపట్టలేని విధంగా అరవై ఏళ్ల బామ్మలా మారిపోయింది. బెంగళూరుకు చెందిన ధనరాజ్‌ ప్రజాపతి, పల్లవి షరాఫ్‌ల ప్రోస్థటిక్‌ మేకప్‌ మహిమే అదంతా. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో ఈ షూటింగ్‌ చేసేవారట. దాంతో తెల్లవారుజామున మూడున్నరకే లేచి ప్రయాణానికి ఓ గంటన్నరా, మేకప్‌కి మరో మూడు గంటలూ కేటాయించేదట తాప్సీ. ఆ సమయంలో తాప్సీకి ప్రోస్థటిక్‌ మేకప్‌ పడక బొబ్బలు వస్తే కలబంద గుజ్జు రాసుకుంటూనే మేకప్‌ వేయించుకుందట.

అక్షయ్‌ పక్షిలా...
‘రోబో’ అనగానే చిట్టి గుర్తుకొస్తే... ‘రోబో2.0’లో అక్షయ్‌కుమార్‌ కనిపించిన పక్షిరాజు పాత్రే కళ్ల ముందు మెదులుతుంది. ప్రోస్థటిక్‌ మేకప్‌లో ఒదిగిపోయిన అక్షయ్‌ని ఆ గెటప్‌లో తీర్చిదిద్దింది అవతార్‌ సినిమాకి పనిచేసిన హాలీవుడ్‌ సంస్థ వేట డిజైనర్స్‌. అక్షయ్‌ని పక్షిరాజుగా మార్చడానికి దాదాపు ఆరుగంటల సమయం పట్టేదట. షూటింగ్‌ కోసం దాదాపు నలభై రోజులపాటు రోజులో పన్నెండు గంటలు అక్షయ్‌ ఈ మేకప్‌తోనే ఉండేవాడట. ఆ సమయంలో శరీరానికి గాలి తగలక, ఒళ్లంతా చెమటలుపట్టి దుర్వాసన వచ్చేదట. పైగా మేకప్‌ ఉన్నంతసేపూ ఏమీ తినడానికి కూడా వీలుకాక రోజంతా మిల్క్‌ షేక్స్‌, జ్యూస్‌లూ, నీళ్ల మీదే ఆధారపడేవాడట అక్షయ్‌. అంతేకాదు, మొదటి రోజు షూటింగ్‌కి వచ్చిన అక్షయ్‌ కూతురు... అతడిని ఆ గెటప్‌లోచూసి భయపడి ఏడ్చేసిందట.

‘ఐ’లో విక్రమ్‌నీ ఒళ్లుగగుర్పొడిచేలా తీర్చిదిద్దింది ఈ బృందమే. కురూపి పాత్రలో ఉన్న సీన్స్‌ చూస్తే ఆ గెటప్‌లో ఉన్నది నిజంగా విక్రమేనా అనిపిస్తుంది. ఈ మేకప్‌ వేయడానికి దాదాపు ఐదు గంటలు పట్టేదట. అందుకోసం విక్రమ్‌ తెల్లవారుజామున నాలుగు గంటలకే సెట్‌కి వెళ్లేవాడట. పైగా గూని మౌల్డ్‌ తయారు చేయడానికి గంటలు గంటలు వంగిపోయి నిల్చోవాల్సి వచ్చేదట. అలా యాభైరోజులు చేయడంతో విక్రమ్‌ వెన్నునొప్పి బారిన పడ్డాడు. ఈ మేకప్‌తోనే ‘తలైవి’లో కంగన జయలలితగానూ, ‘భారతీయుడు 2’లో కమల్‌హాసన్‌ వృద్ధుడిగానూ మారిపోతున్నారు. ఎంతో శ్రమ, సహనంతో కూడుకున్న ఈ మేకప్‌ను వేసేవారూ వేయించుకునేవారూ నిజంగా గ్రేట్‌ కదూ!

 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని