మోడల్, బాక్సర్, బైకర్.. ట్యాలెంట్ల పుట్ట.. ఈ లేడీ సింగం!

జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం.. కానీ అంతిమంగా ఒక వృత్తిని ఎంచుకొని దాన్నే కెరీర్‌గా మలచుకుంటాం. అయితే సిక్కింకు చెందిన ఇక్షా హంగ్మా సుబ్బ మాత్రం తన ఆసక్తులన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటోంది. నచ్చిన వృత్తిలో కొనసాగుతూనే.. ఇతర ప్రవృత్తుల పైనా దృష్టి పెడుతోంది.

Published : 26 Oct 2021 17:25 IST

(Photo: Instagram)

జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం.. కానీ అంతిమంగా ఒక వృత్తిని ఎంచుకొని దాన్నే కెరీర్‌గా మలచుకుంటాం. అయితే సిక్కింకు చెందిన ఇక్షా హంగ్మా సుబ్బ మాత్రం తన ఆసక్తులన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటోంది. నచ్చిన వృత్తిలో కొనసాగుతూనే.. ఇతర ప్రవృత్తుల పైనా దృష్టి పెడుతోంది. పోలీసాఫీసర్‌గా, బాక్సర్‌గా, మోడల్‌గా, బైకర్‌గా.. ఇలా తనలో లేని ట్యాలెంట్ లేదన్నట్లుగా దూసుకుపోతోంది. అందుకే టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా కూడా ‘వండర్‌ ఉమన్‌’ అంటూ ఇక్షాను ఇటీవలే ట్విట్టర్‌ వేదికగా ప్రశంసించారు. దీంతో ఆమె పేరు, ట్యాలెంట్‌ సామాజిక మాధ్యమాల్లో తెగ మార్మోగాయి. మరి, 21 ఏళ్ల వయసులో ఇక్షాకు ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? రండి తెలుసుకుందాం..!

ఇక్షా హంగ్మా సుబ్బ.. సిక్కింలోని Rumbuk గ్రామంలో జన్మించింది. చిన్నతనం నుంచి ఏ పని చేయడానికైనా భయపడేది కాదు. ఇలా తన ధైర్యానికి తన తండ్రి ప్రోత్సాహం తోడైంది. అయితే తన కూతురు ఏ రంగంలోనైనా రాణించాలంటే అందుకు ఫిట్‌గా ఉండడం చాలా ముఖ్యమని భావించిన ఆమె తండ్రి చిన్న వయసులోనే తనను బాక్సింగ్‌ శిక్షణలో చేర్పించారు. ఈ ఫిట్‌నెస్‌ క్రీడతో మరింత రాటుదేలిపోయింది ఇక్షా. ఇదే ఊపుతో జాతీయ స్థాయి బాక్సర్‌గానూ పేరు తెచ్చుకుందామె.

మోడలింగ్‌పై మక్కువతో..!

మోడలింగ్‌ అంటే ఇక్షాకు చిన్న వయసు నుంచే ఇష్టం. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అందుకు సహకరించకపోయేసరికి.. ఇది సమయం కాదని చదువు పైనే దృష్టి పెట్టింది. 19 ఏళ్ల వయసులో డిగ్రీ పూర్తి చేసిన ఆమె.. తన ప్రతిభకు గుర్తింపుగా అదే ఏడాది సిక్కిం పోలీస్‌ ఫోర్సులో చేరింది. ఈ క్రమంలో 14 నెలల కఠిన శిక్షణను పూర్తి చేసింది. ఇలా ఇంటికి పెద్ద కూతురిగా కుటుంబం బరువు బాధ్యతల్ని తన భుజాలపై వేసుకుందీ సూపర్‌ కాప్. పోలీసు యూనిఫాం ధరించినప్పుడల్లా ఈ దేశమాత ముద్దుబిడ్డగా గర్వపడతానంటోంది ఇక్షా. ఇక, పోలీసు శాఖలో పనిచేస్తూనే ‘MTV Supermodel of the Year’ షో ఆడిషన్‌కి వెళ్లింది. తనెంతో ఇష్టపడే పోలీసు యూనిఫాంలోనే ఆడిషన్‌కి హాజరై షోకు ఎంపికైంది. నా ఫిట్‌నెస్‌ అప్పుడు పోలీసు ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడితే.. ఇప్పుడు ఈ టీవీ షోకు ఎంపికవడానికీ దోహదం చేసిందంటోందీ సిక్కిం పోలీస్.

అది ఇప్పుడు పనికొచ్చింది!

‘అందాల పోటీలకు ఎంపికవడమంటే మాటలు కాదు. ఈ క్రమంలో చూడ్డానికి అందంగా కనిపిస్తే చాలదు.. చక్కటి శారీరక సౌష్ఠవం కూడా ముఖ్యమే! అలాగే మానసికంగా దృఢంగా ఉండాలి. చిన్నప్పట్నుంచి నేను చేస్తోన్న బాక్సింగ్‌ సాధన, 14 నెలల పోలీస్‌ శిక్షణ ఇప్పుడు నాకు ఉపయోగపడ్డాయనిపిస్తోంది..’ అంటోంది ఇక్షా. ప్రస్తుతం ఈ షోలో మూడో స్థానానికి చేరుకున్న ఈ లేడీ సింగం ట్యాలెంట్‌కు బాలీవుడ్‌ భామ మలైకా అరోరా కూడా ఫిదా అయిపోయింది. ఈ అందాల పోటీ జడ్జిల్లో ఒకరైన ఆమె.. షోలో భాగంగా నిల్చొని చప్పట్లు కొడుతూ మరీ ఇక్షాను ప్రశంసించింది.

మనసు పెడితే చాలు!

చిన్నతనం నుంచి తనను అన్ని విషయాల్లో ప్రోత్సహించిన తన తండ్రే బైక్‌ రైడింగ్‌లోనూ గురువయ్యాడు. ఇలా మోడల్‌గా, బాక్సర్‌గా, బైకర్‌గా, పోలీస్‌గా రాణిస్తోన్న ఇక్షా.. తనలోని ప్రతిభను ఫొటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంటుంది. ‘మనలో వంద ట్యాలెంట్లుండచ్చు.. కానీ వాటిని సాధించాలంటే మాత్రం మనసు పెట్టడమొక్కటే మార్గం!’ అంటోన్న ఇక్షా.. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఇలా ఆమె ప్రతిభను ప్రశంసిస్తూ ఇటీవలే టెక్‌ దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ‘ఈశాన్య రాష్ట్రాల్లో ఎంతోమంది అనితర సాధ్యులున్నారు. వారిలో ఇక్షా ఒకరు. తనొక వండర్ ఉమన్‌.. ఎంతోమందికి ఆదర్శం!’ అంటూ ప్రశంసించారు. దీంతో ఈ ట్వీట్‌ కాస్తా వైరల్‌గా మారి.. ఈ లేడీ సింగం ప్రతిభ గురించి అందరికీ తెలిసిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్