లేటు వయసులో అలా అమ్మలయ్యారు!

అమ్మతనం పొందడానికి వయో పరిమితి ఉందా? మెనోపాజ్‌ తర్వాత పిల్లలు పుట్టడం అసాధ్యమా? వయసు మీరిపోయిందని గొడ్రాలిగా మిగిలిపోవాల్సిందేనా? అంటే.. ఇవన్నీ వట్టి అపోహలే అని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు.

Updated : 20 Oct 2021 19:11 IST

(Image for Representation)

అమ్మతనం పొందడానికి వయో పరిమితి ఉందా? మెనోపాజ్‌ తర్వాత పిల్లలు పుట్టడం అసాధ్యమా? వయసు మీరిపోయిందని గొడ్రాలిగా మిగిలిపోవాల్సిందేనా? అంటే.. ఇవన్నీ వట్టి అపోహలే అని నిరూపిస్తున్నారు కొందరు మహిళలు. ఆ జాబితాలో తాజాగా చేరిపోయింది గుజరాత్‌కు చెందిన జివున్‌బెన్‌ రబరి. దశాబ్దాలుగా పిల్లల కోసం పరితపిస్తోన్న ఆమె కల.. ఏడు పదుల వయసులో తీరింది. దీంతో లేటు వయసులో అమ్మైన అతి కొద్దిమంది మహిళల్లో ఒకరిగా అరుదైన ఘనత సాధించేలా చేసింది. పిల్లల్లేని ఎంతోమంది దంపతులకు వరంగా మారిన ఐవీఎఫ్‌ పద్ధతి రబరి-ఆమె భర్త మల్ధారి విషయంలోనూ కలిసొచ్చింది. దీంతో తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఈ ఓల్డ్‌ కపుల్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం వీళ్ల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో లేటు వయసులో మాతృత్వపు మధురిమల్ని పొందిన కొంతమంది మహిళల గురించి తెలుసుకుందాం..

నాలుగున్నర దశాబ్దాల కల ఇది!

గుజరాత్‌లోని మోరా గ్రామానికి చెందిన 70 ఏళ్ల జివున్‌బెన్‌ రబరి, 75 ఏళ్ల మల్ధారీకి పెళ్లై 45 ఏళ్లు దాటింది. అందరు దంపతుల్లాగే పెళ్లి తర్వాత సంతానం కోసం ప్రయత్నించిందీ జంట. అయితే ఏళ్లు గడుస్తున్నా తమకు పిల్లలు కలగకపోయేసరికి తీవ్ర నిరాశకు గురయ్యారు రబరి-మల్ధారీ. ఇక తామెప్పటికీ తల్లిదండ్రులం కాలేమేమోనన్న నిర్ణయానికొచ్చారు. ఈ క్రమంలో ఆఖరి ప్రయత్నంగా ఐవీఎఫ్‌ను ఆశ్రయించి తమ నాలుగున్నర దశాబ్దాల కల సాకారం చేసుకున్నారీ గుజరాతీ కపుల్‌. ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారా ఏడు పదుల వయసులో గర్భం దాల్చిన రబరి.. ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే వయసుతో పాటు ఇతర కారణాల రీత్యా ఎనిమిదో నెలలోనే సి-సెక్షన్‌ ద్వారా రబరీకి పురుడు పోశారు వైద్యులు. ఐవీఎఫ్‌ పద్ధతి ద్వారానే అయినా ఇంత లేటు వయసులో గర్భం ధరించి, పిల్లలు పుట్టడం చాలా అరుదని అంటున్నారు ఆమెకు చికిత్స చేసిన వైద్యులు. ఇలా 70 ఏళ్ల వయసులో అమ్మతనాన్ని పొంది.. అతి పెద్ద వయసులో అమ్మయిన కొద్దిమంది మహిళల్లో ఒకరిగా నిలిచారు రబరి. ప్రస్తుతం ఈ జంట తమ చిన్నారిని చూస్తూ మురిసిపోతోన్న వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

నా కూతురే నన్ను బతికించింది!

హరియాణాలోని అలేవా గ్రామానికి చెందిన రజోదేవి లోహన్‌ కూడా తన 70 ఏళ్ల వయసులో (2008లో) తొలి సంతానానికి జన్మనిచ్చింది. తనకు 12 ఏళ్లున్నప్పుడు 14 ఏళ్ల బాబా రామ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుందామె. ఆ తర్వాత పిల్లల కోసం ఏళ్ల పాటు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఎన్ని నోములు నోచినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మందులు వాడినా.. అన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి. ఇలా సుమారు 15 ఏళ్ల పాటు ప్రయత్నించిన అనంతరం రజోదేవి చెల్లెలు ఓమ్నీని రెండో వివాహం చేసుకున్నాడు బాబా రామ్‌. అయినా కూడా సంతానానికి నోచుకోలేకపోయిందీ జంట. ఇన్ని ప్రయత్నాల అనంతరం ఐవీఎఫ్‌ చికిత్సను ఆశ్రయించారు రజోదేవి దంపతులు. అలా గర్భం దాల్చిన ఆమె.. ప్రసవ సమయంలో పలు తీవ్ర అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంది. ఈ క్రమంలో చావు అంచుల దాకా వెళ్లొచ్చిన రజోదేవి.. తన కూతురే తనకు ప్రాణం పోసిందని సంబరపడిపోయింది.

 

రెండు ఐవీఎఫ్‌లు ఫలించలేదు.. అయినా!

పిల్లల్లేని వారికి ఐవీఎఫ్‌ ఆశాకిరణంగా కనిపించినా.. దాని సక్సెస్‌ రేటు చాలా తక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు. అందులోనూ ఒక సైకిల్‌కి 25-30 శాతం మాత్రమే విజయవంతమయ్యే అవకాశాలుంటాయి. ఇలా రెండుసార్లు ఐవీఎఫ్‌ ఫెయిలైనా.. పట్టు వదలకుండా ప్రయత్నించింది హరియాణా హిసర్‌ జిల్లాలోని సాట్రోడ్‌ గ్రామానికి చెందిన భతేరీ దేవి. పెళ్లై యాభై ఏళ్లైనా సంతానానికి నోచుకోని ఆమె.. ఆఖరి ప్రయత్నంగా ఐవీఎఫ్‌ చికిత్సను ఆశ్రయించింది. మొదటి రెండుసార్లు ఫెయిలైనా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదామె. ఈ క్రమంలో 2010, మే 29న తన 66వ ఏట ట్రిప్లెట్స్‌ (ఇద్దరు కొడుకులు, ఒక కూతురు)కి జన్మనిచ్చింది. అయితే కొన్నాళ్లకు పలు అనారోగ్యాల రీత్యా ఒక బిడ్డ చనిపోవడంతో ప్రస్తుతం ఇద్దరు బిడ్డలతో అమ్మతనాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానంటోందీ ఓల్డ్‌ మామ్.

 

72 ఏళ్లకు మగబిడ్డ!

అమృత్‌సర్‌కి చెందిన దల్జీందర్‌ కౌర్‌, మోహిందర్‌ సింగ్‌ గిల్‌.. దంపతులు కూడా పెళ్లయ్యాక పిల్లల కోసం పరితపించిపోయారు. సుమారు యాభై ఏళ్ల పాటు వీళ్లు చేయని ప్రయత్నమంటూ లేదు. దీంతో ఇక ఈ జన్మకు తమకు సంతాన భాగ్యం లేదేమోనన్న నిరాశలో కూరుకుపోయారు. అయితే 70 ఏళ్ల వయసులో చివరి ప్రయత్నంగా ఐవీఎఫ్‌ చికిత్సకు వెళ్లారీ జంట. దీంతో ట్రీట్‌మెంట్‌ కొనసాగే క్రమంలో రెండేళ్లకు గర్భం ధరించింది దల్జీందర్‌. నవ మాసాలు మోసి కొడుక్కి జన్మనిచ్చింది. ఆ బాబుకి ముద్దుగా అర్మాన్‌ అని పేరు పెట్టుకొని మురిసిపోయిందీ జంట. అయితే దల్జీందర్‌కి చికిత్స చేసే క్రమంలో చాలామంది ఇలాంటివి సక్సెస్‌ కావని, ఇవన్నీ అనవసర ప్రయత్నాలే అని విమర్శించారని.. కానీ తాను మాత్రం బిడ్డ కోసం పరితపించిపోయే ఓ మహిళ కలను నెరవేర్చడానికే ప్రయత్నించానని ఆమెకు చికిత్స చేసిన వైద్యుడొకరు తెలిపారు. 2016లో మగ బిడ్డకు జన్మనిచ్చి లేటు వయసులో అమ్మైన మహిళగా అప్పట్లో దల్జీందర్ పేరు వార్తల్లో నిలిచింది.

 

ఆ మురిపెం అలా తీరింది!

పెళ్లై ఏళ్లు గడుస్తోన్నా సంతానానికి నోచుకోలేకపోయింది ఆంధ్రప్రదేశ్‌ తూర్పు గోదావరి జిల్లా నెలపర్తిపాడుకి చెందిన మంగాయమ్మ. 1962లో సీతారామరాజారావుతో వివాహమైనప్పట్నుంచి పిల్లల కోసం వీళ్లు ఎక్కని ఆస్పత్రి మెట్టు లేదు.. మొక్కని దేవుడు లేడు. అమ్మనవ్వాలన్న ఆతృతతో అమెరికాలో ఉన్న బంధువుల దగ్గర్నుంచి మందులు తెప్పించుకొని వాడినా ఫలితం లేకుండా పోయింది. ఓ దశలో పిల్లల్ని దత్తత తీసుకున్నా.. ఏడాది తిరక్కముందే వాళ్లు వెళ్లిపోయారు. ఇక ఆఖరికి ఇరుగుపొరుగు వాళ్ల సలహా మేరకు ఐవీఎఫ్‌ పద్ధతిని ఆశ్రయించాలనుకున్నారు మంగాయమ్మ దంపతులు. అలా 57 ఏళ్ల వైవాహిక జీవితం ముగిసి తన 73వ ఏట అమ్మగా ప్రమోషన్‌ పొందిందీ బామ్మ. 2019లో ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. వయసు మీరుతున్నా చికిత్సకు తట్టుకొని తన మనోధైర్యంతోనే ఇద్దరు పిల్లల తల్లైందని ఆమెకు చికిత్స చేసిన వైద్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలా ఈ బామ్మ కూడా లేటు వయసులో అమ్మతనాన్ని పొంది అప్పట్లో పెద్ద సెన్సేషనే క్రియేట్‌ చేసింది.

వీళ్లే కాదు.. జైపూర్‌కు చెందిన 75 ఏళ్ల ప్రభాదేవి, అప్పటికే ఇద్దరు ఆడపిల్లలున్నా మగబిడ్డ కావాలన్న ఆశతో ముజఫర్‌నగర్‌కు చెందిన 70 ఏళ్ల ఓంకారీ పన్వర్‌.. వంటి మహిళలు కూడా లేటు వయసులో అమ్మతనాన్ని పొందారు.

ఈ విధంగా- సంతాన భాగ్యానికి నోచుకోలేకో, ఇతర అనారోగ్యాల వల్లో ఐవీఎఫ్‌ను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. మెనోపాజ్‌తో సంబంధం లేకుండా ఈ చికిత్స ద్వారా లేటు వయసులోనూ అమ్మలుగా తమ కలలు పండించుకుంటున్నారు కొందరు మహిళలు. అయితే పెద్ద వయసులో తల్లులవడం వల్ల అటు తల్లికి, ఇటు బిడ్డకూ ఎన్నో అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి కెరీర్‌, ఇతర కారణాల రీత్యా పిల్లల్ని కనడం వాయిదా వేయకుండా.. సరైన సమయంలో తల్లవడం వల్ల వయసులో ఉన్నప్పుడే వారి బాధ్యతల్ని చక్కగా నిర్వర్తించగలుగుతారని చెబుతున్నారు.

మరి, ఈ విషయంపై మీ స్పందనేంటి? అమ్మవ్వాలన్న ఆశతో లేటు వయసులో తల్లవడం వల్ల పిల్లల బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించగలుగుతారంటారా? ఈ క్రమంలో కలిగే లాభనష్టాలేమిటి? మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్