Rape Survivor : వావి వరసలు మరిచి తన పశువాంఛ తీర్చుకున్నాడు!

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పసితనం.. తమపై జరిగే అన్యాయాన్ని ఎవరితో, ఎలా చెప్పాలో తెలియని అమాయకత్వం.. వెరసి ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. నమ్మి, నా అనుకున్న వాళ్లు, కుటుంబీకులే ఇలాంటి....

Published : 24 Jun 2022 11:20 IST

(Image for Representation)

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పసితనం.. తమపై జరిగే అన్యాయాన్ని ఎవరితో, ఎలా చెప్పాలో తెలియని అమాయకత్వం.. వెరసి ఎంతోమంది బాలికలు చిన్న వయసులోనే లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. నమ్మి, నా అనుకున్న వాళ్లు, కుటుంబీకులే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇక ఆ అమ్మాయి తన గోడు ఎవరితో చెప్పుకుంటుంది? పొరపాటున నోరు జారినా తనదే తప్పంటారేమోనన్న భయం! అందుకే ఏళ్ల పాటు ఈ బాధను, మౌనాన్ని తన మనసులోనే దాచుకుందో అమ్మాయి. ఆఖరికి బయటపెట్టి నిందితుడికి శిక్ష పడేలా చేసింది.. తనలా మరే అమ్మాయీ బలికాకూడదని నిర్ణయించుకుంది. అందుకే ప్రస్తుతం లైంగిక హింసపై తనదైన రీతిలో పోరాటం చేస్తోంది. మరోవైపు బాల్యంలో తనకెదురైన చేదు సంఘటనల్ని ఉదహరిస్తూ.. ఆడపిల్లలున్న తల్లిదండ్రుల్లో అప్రమత్తతను పెంచుతోంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఆమె కథేంటో తెలుసుకుందాం రండి..!

నా పేరు కార్తీక. పుట్టి పెరిగిందంతా ముంబయిలోనే! అమ్మ, నాన్న, నేను.. హాయిగా, ఆనందంగా ఉండేవాళ్లం. వాళ్లిద్దరూ ఉద్యోగస్థులే కావడంతో.. మాకు దొరికిన వారాంతాలు, సెలవుల్ని ఎంతో అమూల్యంగా వాడుకునేవాళ్లం. సరదాగా గడిపేవాళ్లం. అయితే నా పదో ఏట ఓ రోడ్డు ప్రమాదంలో నాన్న మాకు దూరమయ్యాడు. ఆ క్షణమే ఆయనతో గడిపిన జ్ఞాపకాలు తప్ప.. మా జీవితంలోని సంతోషమంతా ఆవిరైపోయింది.

******

ఇలా నిస్సారంగా రోజులు గడుస్తున్నాయి. ఎంతైనా.. ఒంటరి తల్లుల్ని, తండ్రి లేకుండా పెరిగే పిల్లల్ని ఈ సమాజం అంగీకరించదు. ఈ భయంతోనే అమ్మమ్మ-తాతయ్య వాళ్లు.. అమ్మ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అది అమ్మకు నచ్చలేదు. బతిమాలారు.. పోరుపెట్టారు.. ‘నువ్వు రెండో పెళ్లి చేసుకుంటే.. నీకు జీవితాంతం ఓ తోడు దొరుకుతుంది.. నీ బిడ్డకు తండ్రి లేని లోటు తీరుతుంది..’ అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా అమ్మ మనసు అంగీకరించలేదు. కారణం.. ఆ వచ్చే వాడు నన్ను తన కూతురిలా చేరదీస్తాడో లేదోనన్న భయం అమ్మను అడుగు ముందుకు వేయనివ్వలేదు. అయినా.. కొన్ని కారణాల వల్ల అమ్మ ఈ పెళ్లికి అంగీకరించక తప్పలేదు. అలా మా అమ్మమ్మ వాళ్ల దూరపు బంధువుతో మా అమ్మ పెళ్లి జరిగింది. తనూ ముంబయిలోనే ఉంటాడు. ఇక పెళ్లి తర్వాత అమ్మ, నేను.. నా సవతి తండ్రికి మారిపోయాం.

అతను అమ్మను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు.. నన్నూ కన్న కూతురి కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. అమ్మను ఆఫీస్‌ దగ్గర దిగబెట్టడం-తీసుకురావడం, నన్ను స్కూల్‌కి తీసుకెళ్లడం-తిరిగి ఇంటికి తీసుకురావడం.. ఇలా ఓవైపు తన వ్యాపారంలో ఎంత బిజీగా ఉన్నా మాకు సమయం కేటాయించేవాడు. అయితే నన్ను లోబరచుకోవడానికే ఇలా కపట ప్రేమ ఒలకబోస్తున్నాడని అప్పుడు నాకు తెలియలేదు. ఇలా కొన్ని నెలలు నాతో బాగానే గడిపిన నా సవతి తండ్రి ప్రవర్తనలో క్రమంగా మార్పు రావడం గమనించాను. అమ్మ లేని సమయంలో నన్ను తన గదిలోకి తీసుకెళ్లడం, దగ్గరికి తీసుకోవడం, అసభ్యంగా తాకడం.. ఇలా రోజురోజుకీ ఆయన ప్రవర్తన మితిమీరిపోయేది. ఆయన వింత ప్రవర్తన నాకు అసౌకర్యంగా అనిపించినప్పటికీ అమ్మకు ఇదంతా ఎలా చెప్పాలో, చెప్తే తనెలా స్పందిస్తుందోనన్న అనుమానం, భయంతో మిన్నకుండిపోయా.

******

కొన్నాళ్లకు నా సవతి తండ్రి మరింతగా పేట్రేగిపోయాడు. అమ్మ లేని సమయంలో అదను చూసి నాపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ బాధనంతా మౌనంగా భరిస్తూనే స్కూల్‌కి వెళ్లొచ్చేదాన్ని. అయితే ఆ సమయంలోనే మా స్కూల్లో లైంగిక విద్య, హింసపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో తరగతిలో ఒక్కో అంశం గురించి నిపుణులు వివరించేవారు. ఈ క్రమంలోనే గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌, శరీరంలోని వ్యక్తిగత భాగాలు, లైంగిక హింస, అత్యాచారం.. వంటి విషయాల గురించి నాకు అవగాహన ఏర్పడింది. నాపై జరిగింది కూడా ఇలాంటి అఘాయిత్యమే అని గ్రహించిన నేను.. ఈ విషయాన్ని ముందుగా మా టీచర్‌తో పంచుకున్నా. తను మా అమ్మను ఓ రోజు స్కూల్‌కి పిలిపించి.. జరిగిందంతా చెప్పింది. ‘నేను ఏ భయంతోనైతే ఒంటరి తల్లిగా ఉంటాననుకున్నానో.. ఇప్పుడు అదే నిజమైంది..’ అంటూ అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చేసింది. అప్పుడు నాకూ కన్నీళ్లాగలేదు.

అలాగని ఇందుకు కారణమైన నా సవతి తండ్రిని వదిలిపెట్టాలనుకోలేదామె. టీచర్‌ సలహాతోనే పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై కేసు పెట్టింది. వాదోపవాదాల తర్వాత అతడు తన నేరాన్ని అంగీకరించాడు. జీవితఖైదుగా ఇప్పుడు జైల్లో కూర్చొని ఊచలు లెక్కపెడుతున్నాడు. కనకపోయినా, సవతి తండ్రిగా నన్ను కూతురిగా చేరదీయాల్సిన స్థానంలో ఉండి కూడా వావి వరసలు మర్చిపోయి తన పశువాంఛ తీర్చుకున్న ఆ వ్యక్తికి పడిన శిక్ష నా దృష్టిలో చాలా తక్కువే! ఇలాంటి కామాంధులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. పైగా వాళ్లు ఇంట్లోనే, మన చుట్టూనే తిరుగుతున్నారు. అదను చూసి కాటు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇందుకు నా జీవితంలో జరిగిన చేదు సంఘటనలే సాక్ష్యం! ఈ విషయంలో తల్లిదండ్రుల్ని అప్రమత్తం చేయడానికే ఇలా మీ ముందుకొచ్చాను.

******

కొన్నాళ్ల క్రితమే మా అమ్మ ఆ కామాంధుడి నుంచి విడాకులు తీసుకుంది. ప్రస్తుతం అమ్మ, నేను హ్యాపీగా, ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా. మరోవైపు.. లైంగిక హింస, అత్యాచారాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోన్న ఓ ఎన్జీవోతో కలిసి పనిచేస్తున్నా. ఈ క్రమంలో మా టీమ్‌తో కలిసి స్కూళ్లకు వెళ్లి పిల్లలకు లైంగిక విద్య, గుడ్‌ టచ్‌-బ్యాడ్‌ టచ్‌.. వంటి విషయాలపై అవగాహన కల్పిస్తోన్నా. చాలామంది పిల్లలు సమాజానికి, తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు భయపడి.. ఈ అంశాలపై అవగాహన కొరవడి.. తమకు జరిగిన అన్యాయాన్ని బయటికి చెప్పలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ అవగాహన కార్యక్రమాలు మేలు చేస్తాయి. అంతేకాదు.. వీటి వల్ల పిల్లలూ బోలెడన్ని విషయాలు తెలుసుకొని.. తమకు తామే ముందు జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. ఆఖరుగా తల్లిదండ్రులకూ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. మీ పిల్లలకు రక్షణ కవచం మీరే! కాబట్టి మీ కెరీర్‌, ఇతర పనుల రీత్యా పిల్లల్ని నిర్లక్ష్యం చేయకుండా.. వారిని ఓ కంట కనిపెట్టండి.. అలాగే వారి సంరక్షకులపైనా ఓ కన్నేసి ఉంచండి. మన చేతుల్లో, చేతల్లో ఉండే ఇలాంటి చిన్న విషయాలే మన చిన్నారులకు శ్రీరామ రక్ష!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని