‘ఎముక బలం’ కన్నా ఈ అమ్మాయి పట్టుదలే గట్టిది!

శారీరక లోపాన్ని జీవిత లోపంగా భావిస్తుంటారు చాలామంది. తాము ఏమీ సాధించలేమని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. కానీ మనసులో పట్టుదల ఉంటే ప్రతికూలతలు కూడా పాజిటివ్‌గానే కనిపిస్తాయంటోంది కేరళకు చెందిన ఫాతిమా అస్లా. పుట్టిన మూడో రోజు నుంచే ఎముకల వ్యాధితో బాధపడుతోన్న ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో చక్రాల కుర్చీకే పరిమితమైంది.

Published : 03 Nov 2021 18:14 IST

(Photo: Instagram)

శారీరక లోపాన్ని జీవిత లోపంగా భావిస్తుంటారు చాలామంది. తాము ఏమీ సాధించలేమని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. కానీ మనసులో పట్టుదల ఉంటే ప్రతికూలతలు కూడా పాజిటివ్‌గానే కనిపిస్తాయంటోంది కేరళకు చెందిన ఫాతిమా అస్లా. పుట్టిన మూడో రోజు నుంచే ఎముకల వ్యాధితో బాధపడుతోన్న ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో చక్రాల కుర్చీకే పరిమితమైంది. అయినా తన జీవితం ఇంతే అని కుంగిపోలేదు. డాక్టర్‌ కావాలన్న తన కలలకు తల్లిదండ్రుల సహకారం తోడైంది. అనుకున్నది సాధించి జీవితాన్ని గెలవడమే కాదు.. మనసుకు నచ్చిన వాడిని మనువాడి ఇటీవలే దాంతప్య బంధంలోకీ అడుగుపెట్టింది. శారీరక లోపముందని వివక్ష చూపే ఈ సమాజానికి మనలోని ప్రత్యేకతను రుచి చూపించాలంటూ అందరిలో స్ఫూర్తి నింపుతోన్న ఫాతిమా విజయ గాథ ఇది!

తమకు ఆడపిల్ల పుట్టిందని మురిసిపోయే తల్లిదండ్రుల్లో ఫాతిమా అస్లా పేరెంట్స్‌ ఒకరు. కోరుకున్న కలల పంటను కళ్లారా చూస్తూ మురిసిపోతున్న వారికి మూడో రోజే డాక్టర్లు ఓ షాకింగ్‌ విషయం చెప్పారు. ‘మీ పాపకు Osteogenesis Imperfecta (Brittle Bone Disease) ఉంది’ అని! అంటే.. శరీరాన్ని కాస్త కదిలించినా కాళ్లు, చేతుల్లో ఎముకలు విరిగిపోతాయని దాని అర్థం. ఈ క్రమంలోనే ఆమెకు చాలాసార్లు ఎముక ఫ్రాక్చర్లు, వాటిని అతికించడానికి సర్జరీలు కూడా జరిగాయి.

అదొక్కటే వెలితి!

అయితే తన శారీరక లోపాన్ని తన కలలపై ఎప్పుడూ రుద్దలేదని చెబుతోంది ఫాతిమా. ‘నాన్నకు చిన్నతనంలో నాలాంటి వ్యాధే వచ్చిందట! అయితే నాలాగా తీవ్రమైనది కాదు.. నా పసి వయసు నుంచి నాకు చికిత్స చేస్తున్న డాక్టర్లను చూస్తూ పెరిగిన నేను.. భవిష్యత్తులో వీరిలాగే డాక్టర్‌ని కావాలనుకున్నా.. వాళ్లు నాకు సేవ చేస్తున్నట్లే నేనూ ఎంతోమందికి సహాయపడచ్చు కదా అనుకున్నా. ఈ లక్ష్యంతోనే నా చదువు ప్రారంభించా. అయితే స్కూల్లో టీచర్లు, ఫ్రెండ్స్‌ అంతా నన్ను బాగా చూసుకునే వారు.. ప్రోత్సహించేవారు. కానీ నా మనసులో ఒకే ఒక వెలితి ఉండేది. అదేంటంటే.. వాళ్లతో కలిసి కూర్చోలేకపోతున్నాను.. ఆడుకోలేకపోతున్నాను అని! కానీ రాన్రానూ దాన్నీ అధిగమించా. అయితే అప్పుడప్పుడూ నా శరీర భాగాల్లోని ఎముకలు విరిగిపోయేవి. దాంతో నెలల పాటు క్లాసులకు దూరమయ్యేదాన్ని.. వార్షిక పరీక్షలు మాత్రమే రాసేదాన్ని. అయినా చదువంటే ఇష్టం కాబట్టి మంచి మార్కులతో పాసయ్యేదాన్ని..’ అంటూ చెప్పుకొచ్చింది ఫాతిమా.

‘అర్హురాలివి కాద’న్నారు!

ఇంటర్మీడియట్‌లో 85 శాతం మార్కులు సంపాదించిన ఆమె.. మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షలోనూ మంచి ర్యాంక్‌ సాధించింది. అయితే ఇంటర్వ్యూ చేసే క్రమంలో తనకు ఓ చేదు అనుభవం ఎదురైందని చెబుతోందీ కేరళ డాక్టర్‌. ‘మెడిసిన్‌ అర్హత పరీక్షలో ర్యాంక్‌ వచ్చిందన్న సంబరంతోనే ఇంటర్వ్యూకి హాజరయ్యా. అయితే నేను వీల్‌ ఛైర్‌లో రావడం చూసి నా తెలివితేటల్ని పరీక్షించకముందే నేను మెడిసిన్‌ చదవడానికి అర్హురాలిని కాదు అన్నారు అక్కడి స్టాఫ్‌. వాళ్ల మాటలతో ఆ క్షణం బాధపడ్డా.. నా ఆశయాన్ని మాత్రం వీడలేదు. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నా. ఈ క్రమంలో వాకర్‌ పట్టుకొని నిలబడడం, నడవడం నేర్చుకున్నా. పట్టు వీడకుండా చదివి తదుపరి ఏడాది కూడా ర్యాంక్‌ సంపాదించా.. అయితే నా పట్టుదల చూసి ఈసారి నాకు సీటిచ్చారు. హోమియోపతిక్‌ మెడిసిన్‌ విభాగంలో మెడిసిన్‌ పూర్తి చేసిన నేను.. ప్రస్తుతం కొట్టాయంలోని ఓ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో హౌస్‌ సర్జన్‌గా పనిచేస్తున్నా..’ అంటూ తన సక్సెస్ స్టోరీని పంచుకుంది ఫాతిమా.

నచ్చిన వాడితోనే మనువు..!

నిజమైన ప్రేమకు ఆస్తులు-అంతస్తులు, శారీరక లోపాలు ఇవేవీ ఉండవంటారు. ఫాతిమా-ఫిరోజ్‌ ప్రేమ కథా ఇందుకు మినహాయింపు కాదు. గతేడాది ఓ మ్యూచువల్‌ ఫ్రెండ్‌ ద్వారా కలుసుకున్న వీరు తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. వీళ్ల అనురాగానికి ఇరువైపులా కుటుంబ సభ్యులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిందీ అందాల జంట.

‘భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలుండాలి కానీ.. గౌరవమర్యాదల పేరుతో అంతరాలుండకూడదు. ఫిరోజ్‌, నేను ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతాం. నాలో శారీరక లోపం ఉందని నాపై జాలి చూపించడం తనకు ఇష్టముండదు. నేను అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. ఈ క్రమంలో నన్ను మరింత ప్రోత్సహించే దిశగా మా పెళ్లిలో తను ఆటోమేటిక్‌ వీల్ఛైర్‌ని నాకు బహూకరించాడు. తను వృత్తిరీత్యా డిజిటల్‌ ఆర్టిస్ట్..’ అంటూ తన శ్రీవారి గురించి చెప్పుకొచ్చిందీ యువ డాక్టర్.

ఆత్మకథ రాసుకుంది!

ఓ శారీరక లోపమున్న అమ్మాయిగా చిన్న వయసు నుంచి తానెదుర్కొన్న అనుభవాలను రంగరించి ‘Nilavupole Chirikkunna Penkutty’ పేరుతో ఆత్మకథ రాసిందీ కేరళ డాక్టర్‌. అంతేకాదు.. ‘Dream Beyond Infinity’ పేరుతో ఆమెకు ఓ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఉంది. ఈ వేదికగా తన ఆలోచనల్ని పంచుకుంటుంటుంది ఫాతిమా. ఇక ఇప్పుడు పెళ్లయ్యాక ఫాతిమా-ఫిరోజ్‌ దంపతులిద్దరూ మరో యూట్యూబ్‌ ఛానల్‌ని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారు. ట్రావెలింగ్‌ అంటే ఇష్టపడే వీరు.. వివిధ పర్యటక ప్రాంతాల్ని సందర్శిస్తూ తమ అనుభవాలు, అనుభూతులు ఈ వేదికగా పంచుకుంటామంటున్నారు.

ఇలా తన జీవితంతోనే కాదు.. ‘శారీరక లోపం పేరుతో మన పట్ల వివక్ష చూపే ఈ సమాజానికి.. మనలోని ప్రత్యేకతను రుచి చూపించడమే అసలు సిసలైన సమాధానం’ అంటూ తన మాటలతోనూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది ఫాతిమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్