కూతుళ్లను తాలిబన్లకు తాకట్టు పెట్టాడు... పోలీసులకు చెబితే కత్తితో పొడిచేశాడు!

తాలిబన్ల చేతుల్లో అఫ్గాన్‌ మహిళల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఇస్లామిక్‌ చట్టాలకు లోబడే తమ పరిపాలన ఉంటుందంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీడియా సంస్థల్లో మహిళా యాంకర్లను ఇంటికి పంపించడం, కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేయడం, మహిళల ప్రాథమిక హక్కులను హరించేలా ఫత్వాలు జారీ చేయడం...

Published : 01 Sep 2021 17:28 IST

(Image for Representation)

తాలిబన్ల చేతుల్లో అఫ్గాన్‌ మహిళల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. ఇస్లామిక్‌ చట్టాలకు లోబడే తమ పరిపాలన ఉంటుందంటున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీడియా సంస్థల్లో మహిళా యాంకర్లను ఇంటికి పంపించడం, కో-ఎడ్యుకేషన్‌ను రద్దు చేయడం, మహిళల ప్రాథమిక హక్కులను హరించేలా ఫత్వాలు జారీ చేయడం... అక్కడి ఆడవారి దయనీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. తాలిబన్ల ధాటికి ఇతర దేశాల్లో తలదాచుకున్న అఫ్గాన్‌ శరణార్థులు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

తాలిబన్‌గా మారిన తన భర్త చేతిలో బానిసగా బతకలేక నాలుగేళ్ల క్రితం దిల్లీకి వలస వచ్చింది ఫరీబా అకేమి. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ తన ఇద్దరు కూతుళ్లను పోషిస్తోంది. ప్రస్తుతం స్థానికంగా ఓ జిమ్‌లో పనిచేస్తోన్న ఆమె అఫ్గాన్‌లోని తన కుటుంబ సభ్యుల పరిస్థితిని తలచుకొని తల్లడిల్లిపోతోంది. తన భర్త తనను చంపేస్తాడని తెగ ఆందోళన చెందుతోంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వమే తనను కాపాడాలంటూ ఫరీబా పంచుకున్న ఆవేదన ఎందరినో కదిలిస్తోంది..

అందుకే అతడితో నిఖా చేసుకున్నా!

‘అఫ్గాన్‌లో అతి పెద్ద మూడో నగరమైన హెరాత్‌ మా స్వస్థలం. పెళ్లి విషయంలో ఇక్కడి ఆడవారి వయసును ఎవరూ పట్టించుకోరు. కాస్త వయసొచ్చిందంటే చాలు... తమ కూతుళ్లను అత్తారింటికి పంపడానికి రడీగా ఉంటారు అక్కడి తల్లిదండ్రులు. నాకూ 14 ఏళ్లకే పెళ్లయింది. నా భర్త నా కంటే 20 ఏళ్లు పెద్దవాడు. ఇంట్లోని ఆర్థిక సమస్యల కారణంగా తప్పని పరిస్థితుల్లో అతడితో నిఖా కోసం తలవంచాల్సి వచ్చింది. నాకు పెళ్లి చేయాలన్న తాపత్రయం తప్ప... నా భర్త ఎలాంటి వాడో, అతడి పూర్వాపరాలేంటో ఏవీ తెలుసుకోలేదు మా అమ్మానాన్నలు’..!

కూతుళ్లను తాలిబన్లకు తాకట్టు పెట్టాడు!

‘పెళ్లైన కొన్ని రోజులకే నా భర్త నిజ స్వరూపం తెలిసిపోయింది. రోజూ నన్ను కొట్టి హింసించడం మొదలుపెట్టాడు. ఇంట్లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లేవాడు. కొన్నిసార్లు నెలరోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు. అతడి కారణంగా జీవితం అంధకారమయంగా మారిపోయింది. చదువుకో నివ్వలేదు... సరికదా ఇంట్లో నన్ను ఓ బానిసలా మార్చేశాడు. ఇదంతా నా తలరాత అనుకునే లోపే నలుగురు ఆడపిల్లలు పుట్టారు. నా భర్త డ్రగ్స్‌కు బానిసవ్వడమే కాకుండా వ్యాపారం కూడా చేసేవాడు. పెద్దమొత్తంలో నష్టాలు రావడంతో అతను అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేందుకు ఏకంగా కూతుళ్లను అమ్మకానికి పెట్టాడు. నా 14 ఏళ్ల కూతురును కేవలం 5 లక్షల రూపాయలకు తాలిబన్లకు అమ్మేశాడు. చేతికొచ్చిన బిడ్డ దూరమవ్వడంతో నేను తట్టుకోలేకపోయాను. రోజంతా ఏడుస్తూ ఉండిపోయాను. అయినా పట్టించుకునే వారు లేకపోవడంతో నా ఆవేదన అరణ్యరోదనగా మారిపోయింది. పైగా కూతురుని విక్రయించిన విషయం ఎవరికైనా చెబితే మిగతా కూతుళ్లకు కూడా ఇదే గతి పడుతుందని నా భర్త హెచ్చరించాడు.’

మెడపై గాయం ఇప్పటికీ మానలేదు!

‘నా భర్త ఆగడాలు ఇక్కడితో ఆగలేదు. కొన్ని రోజులయ్యాక పెద్ద బిడ్డను అమ్మేసినట్టే నా రెండో కూతురును కూడా అమ్మాడు. దీంతో నా ఇద్దరు కూతుళ్లను అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయం తెలిసి నా భర్త నాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శరీరంపై నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. మెడపై తగిలిన గాయం ఇప్పటికీ మానలేదు. చేతులు, వేళ్లు కూడా సరిగా పనిచేయడం లేదు. మళ్లీ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాను. అయితే అక్కడి పోలీసులు నా భర్త హెరాత్‌ వదిలి వెళ్లిపోయాడని... తాలిబన్‌ ఫైటర్‌గా చేరాడన్నారు. అప్పుడే నా మూడో కూతురును కూడా అప్పగించాలని తాలిబన్ల నుంచి ఫోన్లు వచ్చాయి. ఎందుకంటే నా భర్త అప్పటికే నా మూడో కూతురును కూడా తాలిబన్లకు తాకట్టు పెట్టేశాడు. వారి నుంచి డబ్బు కూడా తీసేసుకున్నాడు.’

‘ఇద్దరు కూతుళ్లను కళ్ల ముందే పొగొట్టుకున్నాను. మిగిలిన ఇద్దరు కూతుళ్లనైనా కాపాడుకుందామని అఫ్గాన్‌ను వదిలేసి ఇక్కడకు వచ్చాను. ఈ విషయం తెలుసుకున్న తాలిబన్లు ఇద్దరు కూతుళ్లను తీసుకుని వెంటనే హెరాత్‌కు తిరిగిరావాలని మా ఇంటికి నోటీసులు పంపించారు. డెత్‌ వారెంట్ కూడా జారీ చేశారు. కానీ నా ఇద్దరు బిడ్డల ఆచూకీ గురించి మాత్రం ఆ నోటీసులో పేర్కొనలేదు. వారిద్దరూ ఏమయ్యారో... అసలు జీవించి ఉన్నారో లేదో కూడా నాకు తెలియదు.’

తాలిబన్లు మారరు!

ఇప్పుడు కూడా షరియా చట్టాలకు లోబడే తమ పాలన ఉంటుందని తాలిబన్లు చెబుతున్నారు. కానీ వారి మాటలు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ ముష్కరులు తమ ఆలోచనలను అసలు మార్చుకోరు. వారి చేతుల్లో అఫ్గాన్‌ మహిళల భవిత ప్రశ్నార్థకంగా మారిపోయింది. తాలిబన్లు ప్రపంచానికి ముప్పుగా పరిణమించారు. నాలాగే తాలిబన్ల చేతుల్లో మోసపోయిన ఎంతోమంది మహిళలు తమ ఆవేదనను బయటకు చెప్పుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ ముష్కరుల ఆకృత్యాలను చూసి వెనక్కు తగ్గుతున్నారు.’

నేను ఇక్కడే ఉన్నట్లు అతడికి తెలుసేమో!

‘ఇటీవల ఓ యూట్యూబర్‌ నా వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో నేను నా ఇద్దరు కూతుళ్లతో ఇండియాలో ఉన్నట్లు ఈ పాటికే మా ఆయనకు తెలిసే ఉంటుంది. అప్పటి నుంచి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. పగటి పూట కూడా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఎవరైనా నన్ను కత్తితో పొడిచి, నా ఇద్దరు కూతుళ్లను తీసుకెళ్లిపోతారేమోననిపిస్తోంది. ఇక నా తల్లిదండ్రులు, తోబుట్టువులందరూ హెరాత్‌లోనే ఉంటున్నారు. అక్కడ ఇంటర్నెట్‌ సదుపాయాలు సరిగా లేకపోవడంతో వారితో సరిగా మాట్లాడలేకపోతున్నాను. వారి ముఖాలను కూడా చూడలేకపోతున్నాను. వారికేమైనా జరిగితే నేను తట్టుకోలేను. కట్టుబట్టలతో ఇక్కడకు వచ్చిన నాకు... భారత ప్రభుత్వం ఆశ్రయమిచ్చి ఎంతో మేలు చేసింది. ఇప్పుడు నా భవిష్యత్‌ కూడా ఇక్కడి ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. శరణార్థిగా నాకు గుర్తింపు కార్డు మంజూరయ్యేలా చూడాలి. దీని వల్ల నాతో పాటు నా ఇద్దరు బిడ్డలకు రక్షణ కలుగుతుంది.’ అని వేడుకుంటోంది ఫరీబా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్