పుట్టిన వెంటనే పాపాయికి స్నానం చేయించచ్చా?!

కొత్తగా తల్లైన మహిళలకు పుట్టిన పాపాయి విషయంలో బోలెడన్ని సందేహాలుంటాయి. వారికి పాలు పట్టడం, నిద్ర పుచ్చడం, ఏడిస్తే లాలించడం.. ఆఖరికి స్నానం చేయించే క్రమంలోనూ వివిధ రకాల సందేహాలొస్తుంటాయి. పుట్టిన వెంటనే స్నానం చేయించచ్చా? ఎన్ని రోజులకోసారి....

Published : 18 Sep 2022 15:04 IST

కొత్తగా తల్లైన మహిళలకు పుట్టిన పాపాయి విషయంలో బోలెడన్ని సందేహాలుంటాయి. వారికి పాలు పట్టడం, నిద్ర పుచ్చడం, ఏడిస్తే లాలించడం.. ఆఖరికి స్నానం చేయించే క్రమంలోనూ వివిధ రకాల సందేహాలొస్తుంటాయి. పుట్టిన వెంటనే స్నానం చేయించచ్చా? ఎన్ని రోజులకోసారి చేయించాలి? తలంటు పోయచ్చా? అన్న విషయాల్లో స్పష్టత కొరవడుతుంటుంది. ఇక ఈ మధ్య చాలా ఆస్పత్రుల్లో పుట్టిన వెంటనే పాపాయికి స్నానం చేయించాకే తల్లి పొత్తిళ్లలో పడుకోబెట్టడం చూస్తున్నాం. కానీ ఇది కరక్ట్‌ కాదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. డబ్ల్యూహెచ్‌వో, ఎయిమ్స్‌ దిల్లీ, ఎయిమ్స్‌ రిషికేశ్‌.. సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం.. పుట్టిన పాపాయికి 24 గంటల దాకా స్నానం చేయించకపోవడమే మంచిదని వెల్లడించింది. మరి, ఎందుకలా? దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి? తెలుసుకోవాలంటే ఇది చదివేయండి!

పాపాయి పుట్టిన 24 నుంచి 48 గంటల వరకు స్నానం చేయించకపోవడమే మంచిదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఎంత ఎక్కువ సమయం పాటు స్నానం చేయించకపోతే అంత సురక్షితం అని చెబుతోందీ సంస్థ. అయితే ఇందుకు పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఒకవేళ ఎక్కువ సమయం వేచి చూడలేని పక్షంలో స్పాంజ్‌ బాత్.. అది కూడా పుట్టిన ఆరు గంటల తర్వాతే మంచిదని సూచిస్తోంది డబ్ల్యూహెచ్‌వో.

స్పాంజ్‌ బాత్‌ ఇలా!

తల్లి కడుపులో వెచ్చగా పెరిగిన పిల్లలు పుట్టిన వెంటనే ఈ వాతావరణాన్ని తట్టుకోలేక ఏడుస్తుంటారు. కాబట్టి వారిని సాధ్యమైనంత వెచ్చటి ప్రదేశంలోనే ఉంచాలంటున్నారు నిపుణులు. స్పాంజ్‌ బాత్‌ చేయించే క్రమంలోనూ వారికి ఇలాంటి వాతావరణాన్నే కల్పించాలంటున్నారు. ముందుగా వెచ్చగా ఉండే గది/ప్రదేశంలో పాపాయిని పడుకోబెట్టాలి. ప్లెయిన్‌ వాటర్‌ లేదా అందులో ఒకటి లేదా రెండు చుక్కల బేబీ లిక్విడ్‌ సోప్‌ వేసి.. ఆ మిశ్రమంలో మెత్తటి కాటన్‌ వస్త్రాన్ని ముంచి, పిండి.. దాంతో తల దగ్గర్నుంచి అరికాళ్ల దాకా మృదువుగా తుడవాలి. కళ్లు, ముక్కు రంధ్రాలు, చెవి రంధ్రాలు, పెదాలు, బొడ్డుతాడు, వ్యక్తిగత భాగాల దగ్గర మరింత జాగ్రత్త వహించాలి. ఆపై పొడి కాటన్‌ వస్త్రంతో మరోసారి తుడిచి.. పాపాయిని టవల్‌లో ర్యాప్‌ చేయాలి. లేదంటే వెచ్చగా ఉండేలా మందపాటి దుస్తులు వేయాలి.

అందుకే స్నానం వద్దట!

పుట్టిన పాపాయికి స్నానం వాయిదా వేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..!

పాపాయి పుట్టిన వెంటనే స్నానం చేయించే బదులు.. దుస్తుల్లేకుండా తల్లి ఎదపై పడుకోబెట్టడం మంచిదట! ఇలా తల్లీబిడ్డల శరీరాలు స్పృశించుకోవడం వల్ల పాపాయి శరీర ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకొస్తాయట! అలాగే తల్లీబిడ్డల మధ్య అనుబంధం దృఢమై.. బిడ్డ తల్లిపాలు తాగడం మరింత సులువవుతుందంటున్నారు నిపుణులు.

తల్లి కడుపులో సుమారు 98.6 డిగ్రీల ఉష్ణోగ్రతలో బిడ్డ ఎదుగుతుంది. ఆ వాతావరణానికి బయటి వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అందుకే పుట్టగానే బయట ఉండే చల్లటి వాతావరణానికి పిల్లలు తట్టుకోలేరు. దీనికి బదులు అదే సమయంలో స్నానం చేయించడం వల్ల వారి శరీర ఉష్ణోగ్రత మరింతగా పడిపోతుంది. దీనివల్ల హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత బాగా పడిపోయే స్థితి) సమస్య తలెత్తే ప్రమాదం ఎక్కువంటున్నారు నిపుణులు. కాబట్టి పుట్టిన వెంటనే స్నానం వద్దంటున్నారు.

పాపాయి పుట్టగానే వారి చర్మంపై ఒక రకమైన తెల్లటి పొర ఉండడం మనం గమనించచ్చు. దీన్ని వెర్నిక్స్ అంటారు. ఇందులో ఉండే ప్రొటీన్లు వాతావరణంలో ఉండే పలు హానికారక ఇన్ఫెక్షన్ల నుంచి బేబీకి రక్షణ కల్పిస్తాయి. అదే స్నానం చేయించడం వల్ల ఆ పొర తొలగిపోతుంది.

పుట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే పాపాయికి స్నానం చేయించడం వల్ల వారిలో చక్కెర స్థాయులు పడిపోతాయట! దీనికి కారణం.. స్నానం వల్ల పాపాయి శరీరంలో ఒత్తిడి హార్మోన్లు విడుదలై.. చక్కెర స్థాయులు పడిపోయేలా చేస్తాయంటున్నారు నిపుణులు.

పుట్టిన పాపాయికి బొడ్డు తాడు ఊడిపోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది. ఈ వ్యవధిలో నాభి పూర్తిగా నయమవుతుంది. కాబట్టి ఇవేవీ పట్టించుకోకుండా స్నానం చేయించడం వల్ల ఆ భాగంలో ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే బొడ్డు తాడు ఊడిపోయే దాకా స్పాంజ్‌ బాత్‌ సరైందని సూచిస్తున్నారు.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

పుట్టిన పాపాయికి స్నానం చేయించే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవడమూ ముఖ్యమంటున్నారు నిపుణులు.

పాపాయికి స్నానం చేయించడానికి రోజూ ఓ కచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకోవాలి. దానివల్ల బిడ్డ నిద్ర, పాలిచ్చే సమయాలకు అంతరాయం కలగకుండా ఉంటుంది.

బిడ్డకు స్నానం చేయించే ప్రదేశం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.

చిన్నారుల శరీరం దూదిపింజలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ సోప్‌తో రుద్దకుండా ఉంటేనే మంచిది. లేదంటే చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఎక్కువ!

చాలామంది బిడ్డ వ్యక్తిగత భాగాల వద్ద సబ్బు అప్లై చేస్తుంటారు. కానీ అది కరక్ట్‌ కాదంటున్నారు నిపుణులు. ఆయా భాగాల్ని సాధారణ నీటితో శుభ్రం చేయడమే మంచిదట!

స్నానం పూర్తయ్యాక పాపాయిని కాసేపు కాటన్‌ టవల్‌లో ర్యాప్‌ చేసి.. తల్లి పొత్తిళ్లలో ఉంచాలి. తద్వారా వారి శరీర ఉష్ణోగ్రత బ్యాలన్స్‌ అవుతుంది.

అలాగే ఆపై పాపాయి చర్మాన్ని పొడిగా తుడిచి.. మాయిశ్చరైజర్‌ రాయాలి.

వీటితో పాటు బిడ్డ స్నానం విషయంలో ఏమైనా సందేహాలున్నా, ఇతర సమస్యలు తలెత్తినా ఆలస్యం చేయకుండా నిపుణుల్ని సంప్రదించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్