ఆ లోపమే నాకు వరమైందేమో అనిపిస్తుంది!

పుట్టుకతో వచ్చిన శారీరక లోపాలకు మనం బాధ్యులం కాము. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది ఇలాంటి వారిని చులకనగా చూస్తుంటారు. ఆ లోపాల్ని ఎత్తి చూపుతూ.. కామెంట్లు చేస్తుంటారు.. జోకులు పేల్చుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు అవతలి వారికి బాధ కలిగిస్తాయేమోనన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు.

Updated : 23 Nov 2021 20:34 IST

(Image for Representation)

పుట్టుకతో వచ్చిన శారీరక లోపాలకు మనం బాధ్యులం కాము. ఈ విషయం తెలిసి కూడా కొంతమంది ఇలాంటి వారిని చులకనగా చూస్తుంటారు. ఆ లోపాల్ని ఎత్తి చూపుతూ.. కామెంట్లు చేస్తుంటారు.. జోకులు పేల్చుతుంటారు. నిజానికి ఇలాంటి మాటలు అవతలి వారికి బాధ కలిగిస్తాయేమోనన్న కనీస ఆలోచన కూడా వారికి ఉండదు. తానూ తన శారీరక లోపంతో ఇలాంటి ఎన్నో అవమానాలు భరించానంటోంది తిరునల్వేలికి చెందిన గ్రీష్మ. పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉన్న ఆమె.. వయసు పెరిగినా అందుకు తగ్గ ఎత్తు మాత్రం పెరగలేదు. నాలుగడుగుల ఎత్తుతో మరుగుజ్జుగా మారిపోయిన ఆమె.. సమాజం నుంచి ఎన్నో సూటిపోటి మాటల్ని భరించింది. తన శారీరక లోపాన్నే తన ప్రత్యేకతగా మలచుకుంది. తనను హేళన చేసిన వారికి విజయంతోనే సమాధానం చెప్పాలనుకుంది.. ఇప్పుడు అనుకున్నది సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. తన విజయగాథను మనతో పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చింది.

ఈ సృష్టిలో ఎవరూ పరిపూర్ణులు కాదు.. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. అయితే కొంతమందిలో అవి అంతర్గతంగా ఉండచ్చు.. మరికొంతమందిలో శారీరక లోపాల రూపంలో అవి బయటికి స్పష్టంగా కనిపించచ్చు. నిజానికి ఇలాంటి లోపాలున్న వారికి ఆ భగవంతుడు వాటిని జయించే శక్తిని అందిస్తాడంటారు.. తమలోని ప్రత్యేకతల్ని నిరూపించుకునేలా మార్గనిర్దేశనం చేస్తాడని చెబుతుంటారు.. ఇది నా విషయంలో అక్షర సత్యం అనిపిస్తుంటుంది.

******

అందరు పిల్లల్లాగే నేనూ చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేదాన్ని. చదువులో, ఆటల్లో నా ఫ్రెండ్స్‌కి గట్టి పోటీ ఇచ్చేదాన్ని. ఇటు ఇంట్లోనూ నేనొక్కదాన్నే ఆడపిల్లను కావడంతో అమ్మానాన్న, అన్నయ్య కూడా నన్ను ముద్దుచేసేవారు. ఇలా హాయిగా, ఆనందంగా రోజులు గడుస్తున్నాయి. చూస్తుండగానే పదో తరగతి పరీక్షలు కూడా పూర్తయ్యాయి. అయితే నేను చిన్నతనం నుంచే కాస్త బొద్దుగా ఉండేదాన్ని. దీనివల్లే తక్కువ ఎత్తున్నానేమో అనేవారు అమ్మానాన్న. కానీ అసలు సమస్య అది కాదు.. నా ఎదుగుదల ఆగిపోయిందన్న విషయం ఆ తర్వాత వైద్యులు పరీక్షించి చెప్తే గానీ మాకు తెలియలేదు. నేను మరుగుజ్జునని, ఇక ఎప్పటికీ ఎత్తు పెరగనని తెలుసుకొని చాలా బాధపడ్డా. ఆ సమయంలో మా ఇంట్లో వాళ్లే నాకు అండగా నిలిచారు. ‘అయినా అది నువ్వు కోరి తెచ్చుకున్న సమస్య కాదు.. అలాంటప్పుడు దాని గురించి బాధపడుతూ సమయం వృథా చేసుకోవడమెందుకు?!’ అంటూ నాలో ధైర్యం నింపేవారు.

ఎవరెన్ని సానుభూతి మాటలు చెప్పినా.. మనలో ఉన్న శారీరక లోపం మనల్ని ఆత్మన్యూనతలోకి నెట్టేస్తుంది. ఏదో తెలియని అభద్రతా భావానికి గురిచేస్తుంది. నా మనసులోనూ ఇలాంటి ప్రతికూల ఆలోచనలెన్నో మెదిలేవి. అయినా జీవితంలో ముందుకెళ్లక తప్పదు కదా.. అని నా మనసుకు సర్దిచెప్పుకొని కాలేజీలో చేరాను. కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్‌.. నన్ను, నా ఎత్తును చూసి అందరూ ఏమనుకుంటారోనన్న బెరుకైతే నా మనసులో ఉండేది. అదే నిజమైంది కూడా! మొదట్లో కొంతమంది సీనియర్‌ అబ్బాయిలు ర్యాగింగ్‌ పేరుతో నన్ను ఏడిపించేవారు. ‘ఏయ్‌ పొట్టి.. ఆ చెట్టుకున్న కాయ కోసుకురా.. పై అరలో ఉన్న పుస్తకం పట్టుకురా!’ అని హేళన చేసే వారు. నేను బాధపడతానేమోనన్న కనీస ఆలోచన కూడా లేకుండా సూటిపోటి మాటలనే వారు. బయటికి వెళ్లినప్పుడు కూడా నన్ను ప్రత్యేకంగా చూసేవారు. ఇలాంటి మాటలు, చూపులు నా మనసును గాయపరిచేవి. దీని ప్రభావం నా చదువుపైనా పడింది. అప్పటిదాకా స్కూల్‌ టాపర్‌గా ఉన్న నాకు ఇంటర్‌ ఫస్టియర్‌లో తక్కువ మార్కులొచ్చే సరికి అమ్మానాన్న ఆశ్చర్యపోయారు. ఇందుకు కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

******

అప్పుడే నా మనసులోని బాధను, ఈ సమాజం నుంచి ఎదురయ్యే సూటిపోటి మాటల్ని వాళ్లతో పంచుకున్నా. ఆ క్షణం వాళ్లు చెప్పిన ఒకే ఒక్క మాట నా మనసులోని ప్రతికూల ఆలోచనలన్నీ దూరం చేసింది. అదేంటంటే.. ‘మనం పొందని దాని గురించి ఎంత బాధపడినా లాభం లేదు. అదే మనలో ఉన్న ప్రతిభకు పదును పెడితే.. మనమేంటో ఈ సమాజానికి నిరూపించుకోవచ్చు. నీ విషయానికొస్తే.. చదువే నీ బలం. దాన్నే నీ ఆయుధంగా మార్చుకో!’ అంటూ నాలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆలోచిస్తే వాళ్లు చెప్పిందే నిజమనిపించింది. ఏ లోపముందని నన్ను చులకనగా చూస్తున్నారో.. ఆ భావాన్నే వారి మనసులో నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నా. ఇక అప్పట్నుంచి ఎవరేమనుకున్నా, ఎలా పిలిచినా సానుకూలంగా తీసుకోవడం మొదలుపెట్టా. నా దృష్టిని ఇలాంటి అనవసరమైన ఆలోచనల నుంచి చదువుపైకి మళ్లించా. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో మంచి మార్కులే కాదు.. మెడిసిన్‌ ప్రవేశ పరీక్షలో వంద లోపు ర్యాంకొచ్చింది. పేపర్లో నా ఫొటో చూసి అవహేళన చేసిన వాళ్లే అభినందించడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టించింది.

ఇదే ఊపుతో మెడిసిన్‌ పూర్తిచేశా. ఈ ఐదున్నరేళ్లలోనూ క్యాంపస్‌లో, బయట నా ఎత్తుపై ఎన్నో రకాల జోకులు పేలేవి. అయినా అలాంటి వాటిని పట్టించుకోవడం నేనెప్పుడో మానేశాను కాబట్టి వాటిని విని వదిలేయడం తప్ప లోతుగా ఆలోచించే తీరిక నాకు దొరకలేదు. ప్రస్తుతం మా ఊర్లోనే ఓ క్లినిక్‌ నడుపుతున్నా. నాకు చిన్నప్పట్నుంచి ఓ కోరిక ఉండేది. ఎప్పటికైనా డాక్టరై.. పేదలకు ఉచితంగా వైద్య సేవ చేయాలని! ఇప్పుడు నేను చేస్తోంది కూడా అదే! ఇప్పటికీ మా క్లినిక్‌కి వచ్చే పేషెంట్స్‌లో నన్ను ఎగాదిగా చూసే వాళ్లూ లేకపోలేదు. కానీ వాళ్ల చూపుల కంటే నా సేవను గుర్తించి నన్ను ఆశీర్వదించే చేతులే ఎక్కువగా ఉన్నాయి. అలాగని ఇక్కడితోనే ఆగిపోవాలనుకోవట్లేదు. భవిష్యత్తులో మా ఊర్లో సకల సదుపాయాలతో ఓ ఆస్పత్రిని నిర్మించాలని ఉంది. మరోవైపు నిరుపేద చిన్నారులు, నాలాగే శారీరక లోపాలతో బాధపడే పిల్లలకు చదువు విషయంలో సహాయ సహకారాలు అందించాలన్న ఆలోచన కూడా ఉంది. త్వరలోనే వీటిపై దృష్టి సారిస్తా.

******

ఇక చివరిగా మీతో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా.. పుట్టుకతో వచ్చిన శారీరక లోపాలనేవి కోరి తెచ్చుకున్నవి కావు.. అలాగని అవి లేని వారికి ఇతరుల్ని హేళన చేసే హక్కు కూడా లేదు. ఇలా మీరు అనే మాటలు మీ మనసుకు సంతోషాన్నివ్వచ్చు.. కానీ అనే ముందు.. ఒక్కసారి వాళ్ల స్థానంలో మీరుండి ఆలోచించండి. వాళ్లు పడే బాధేంటో అర్థమవుతుంది. ఎదుటివారిని మాటలతో హింసించడం మాని.. చేతనైతే అలాంటి వారికి మీరు చేయగలిగే సహాయం చేయండి.. వాళ్లు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకునే ప్రోద్బలాన్ని వారికి అందించండి.. విమర్శించే వారి నుంచి నేను కోరుకునేది ఇదొక్కటే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని