అవి లోపాలు కాదు.. మనలోని ప్రత్యేకతలు!

అద్దంలో చూసుకొని నాలో ఆ లోపముంది.. ఈ లోపముంది.. అంటూ ఆత్మన్యూనతకు గురవుతాం! వారిలా అందంగా లేమే అని బాధపడిపోతాం..! నిజానికి దీనివల్ల మానసిక సమస్యలు ఎదురవడం తప్ప మరే ప్రయోజనం లేదంటోంది ప్రముఖ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు అంకితా కొన్వర్‌. మోడల్‌, నటుడు మిలింద్‌ సోమన్‌ భార్యగానే కాక.. ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ

Updated : 09 Jun 2021 18:20 IST

అద్దంలో చూసుకొని నాలో ఆ లోపముంది.. ఈ లోపముంది.. అంటూ ఆత్మన్యూనతకు గురవుతాం! వారిలా అందంగా లేమే అని బాధపడిపోతాం..! నిజానికి దీనివల్ల మానసిక సమస్యలు ఎదురవడం తప్ప మరే ప్రయోజనం లేదంటోంది ప్రముఖ ఫిట్‌నెస్‌ ఔత్సాహికురాలు అంకితా కొన్వర్‌. మోడల్‌, నటుడు మిలింద్‌ సోమన్‌ భార్యగానే కాక.. ఫిట్‌నెస్‌, ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుందీ అస్సామీ బ్యూటీ. భర్తతో తనకున్న అనుబంధాన్ని, తన ఫిట్‌నెస్‌ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఎంతో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అంకిత.. తాజాగా స్వీయ ప్రేమ (సెల్ఫ్‌ లవ్‌) అనే అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే మనసులో నుంచి ప్రతికూల ఆలోచనల్ని తొలగించి ఎవరిని వారు ప్రేమించుకోవడం కాస్త కష్టమే అయినా.. అసాధ్యం మాత్రం కాదంటోందీ క్యూటీ. ఈ క్రమంలో ఎవరిని వారు ప్రేమించుకునేందుకు పాటించాల్సిన పలు చిట్కాలను సైతం ఇన్‌స్టా పోస్ట్‌ రూపంలో పంచుకుందీ మిసెస్‌ సోమన్.

ఫిట్‌నెస్‌, ఆరోగ్యం, పిరియడ్స్‌.. వంటి అంశాల గురించి నేటి యువతలో స్ఫూర్తి నింపడంలో అందరికంటే ముందే ఉంటుంది అంకితా కొన్వర్‌. ఈ క్రమంలో ఆయా అంశాలకు సంబంధించిన వీడియోలను, భర్తతో దిగిన ఫొటోలు, అత్తగారితో చేసిన వ్యాయామాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టా వేదికగా పంచుకునే ఈ చక్కనమ్మ.. తాజాగా అందరిలో స్ఫూర్తి నింపేలా మరో అంశాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం చాలామందిలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతోందని.. దాన్ని జయించడం మన చేతుల్లోనే ఉందంటూ స్వీయ ప్రేమకు సంబంధించిన కొన్ని చిట్కాలను ఇన్‌స్టాలో పంచుకుంది అంకిత.

ప్రియమైన వ్యక్తిలా పలకరించుకోండి! 
* మన మనసుకు నచ్చిన వారు తారసపడితే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటాం.. వారిని గుండెలకు హత్తుకుంటాం.. ఇదే సూత్రాన్ని ఎవరికి వారు ఆపాదించుకోవాలి. ఈ క్రమంలో ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ ఒక ప్రియమైన వ్యక్తిలా మిమ్మల్ని మీరు పలకరించుకోవాలి.

* రోజుకో చిన్న, సులభమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి.. దాన్ని చేరుకునేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా ట్రీట్‌ చేయడం మొదలుపెడతారు.

* కొన్ని సార్లు ‘నో’ చెప్పడం తప్పు కాదు. ఒక్కోసారి మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ‘నో’ చెప్పాల్సి రావచ్చు. అంతమాత్రాన మీరు తప్పు చేస్తున్నారని దాని అర్థం కాదు.

* మీ మనసును ప్రశాంతత వైపు నడిపించడానికి కొంత సమయం తీసుకోండి. ఈ క్రమంలో మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ అడుగు ముందుకేస్తే మీలోని నెగెటివిటీని అధిగమించడం మీకు పెద్ద కష్టం కాకపోవచ్చు.

* ఎలా ఉన్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా సరే.. మీకు డ్యాన్స్‌ చేయాలనిపిస్తే చేసేయండి.. ఇతరుల అభిప్రాయాలు, నిర్ణయాలతో మీకు పని లేదు.

* నిజానికి మీరు లోపాలు అనుకుంటున్నవన్నీ మీలో ఉన్న ప్రత్యేకతలు! కాబట్టి వాటిని ప్రేమతో స్వీకరించండి.. అంతేకానీ ద్వేషించద్దు!

* ప్రతి ఒక్కరిలోనూ ఏదో చేయాలన్న తపన దాగి ఉంటుంది. వాటిని నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగండి. ఈ క్రమంలో మీరు చేసే సాహసాలు, అధిగమించే సవాళ్లు మీకు సరికొత్త అనుభూతుల్ని అందిస్తాయి. ఇవి మీ ముళ్లదారిని పూబాటగా మార్చుతాయి.

* వ్యాయామం కూడా స్వీయ ప్రేమలో ఓ భాగమే! ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేస్తుంది. కాబట్టి రోజుకు పావుగంట సేపు వ్యాయామం చేయడం మంచిది.

* నవ్వు నాలుగు విధాలుగా చేటు కాదు.. నాలుగు విధాలుగా మంచిది! ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి ఎక్కడైనా, ఎప్పుడైనా నవ్వుతూనే ఉండండి.. మీకు సాధ్యమైనంత గట్టిగా నవ్వడానికి ప్రయత్నించండి.

అయితే స్వీయ ప్రేమ అనేది మనం చెప్పుకున్నంత సులభమైన పని కాదు.. అలాగని అసాధ్యం కూడా కాదు.. కాబట్టి పైన చెప్పిన చిట్కాలన్నీ పాటిస్తూ మీతో మీరు ప్రేమలో పడండి! ఎప్పుడూ పాజిటివిటీతో ఉండండి!’ అంటోంది అంకిత. ఇలా మిసెస్‌ సోమన్‌ పెట్టిన పోస్ట్‌కు ఆమె భర్త మిలింద్‌తో పాటు ఎంతోమంది నెటిజన్లు స్పందించారు. ‘తప్పకుండా ఈ చిట్కాలు పాటిస్తాం’ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఎవరేమనుకుంటే నాకేంటి?! 

ఆత్మన్యూనతా భావాన్ని దూరం చేసుకొని ఎవరిని వారు ప్రేమించుకోవడానికి మానసిక నిపుణులు కూడా కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు.

* నిజానికి ఈ లోకంలో మనలా మరెవరూ ఉండరు. అంటే మనకు మనమే ప్రత్యేకం అన్నమాట! అలాంటప్పుడు ఇతరులతో మనల్ని పోల్చుకోవడం ఎందుకు? అందుకే ఈ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు.

* ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారోనని బాధపడడం, ఆలోచించడం వల్ల సమయం వృథా తప్ప మరే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎదుటివారి నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

* ఎవరూ కావాలని తప్పు/పొరపాటు చేయరు. కాబట్టి ఒకవేళ తెలియకుండా తప్పు దొర్లినా దాన్నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. నిజానికి ఈ ప్రవర్తన మనలో ఆత్మవిశ్వాసం, మనపై మనకు నమ్మకాన్ని పెంచుతుంది.

* మనలో లోపాలున్నంత మాత్రాన మనం ఎందుకూ పనికిరామని దాని అర్థం కాదు. కాబట్టి మనలోని ప్రత్యేక నైపుణ్యాల్ని బయటి ప్రపంచానికి చాటుతూ మనమేంటో నిరూపించుకోవాలి. అదే జరిగితే ఛీత్కరించిన వాళ్లే మనల్ని అభినందిస్తూ చప్పట్లు కొడతారు.

* మనల్ని ప్రోత్సహించే వారి కంటే నిరుత్సాహ పరిచే వారే మన చుట్టూ ఎక్కువగా ఉంటారు. నిజానికి అలాంటి వారిని పట్టించుకొని బాధపడాల్సిన పనిలేదు. ఈ క్రమంలో మనలోని భయాల్ని తొలగించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు సాగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్