K-Pop : అప్పుడు శ్రేయ.. ఇప్పుడు అరియా!

సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించే పాప్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మరి, అలాంటి పాప్‌ బ్యాండ్స్‌లో స్థానం సంపాదించుకోవాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.  అలాంటి అరుదైన ప్రతిభతో ఇటీవలే ‘కె-పాప్’ బ్యాండ్లో స్థానం సంపాదించింది కేరళకు చెందిన 20 ఏళ్ల అరియా. దక్షిణ కొరియాకు చెందిన ఓ పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌...

Updated : 19 Feb 2024 16:47 IST

(Photos: Instagram)

సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించే పాప్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మరి, అలాంటి పాప్‌ బ్యాండ్స్‌లో స్థానం సంపాదించుకోవాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి.  అలాంటి అరుదైన ప్రతిభతో ఇటీవలే ‘కె-పాప్’ బ్యాండ్లో స్థానం సంపాదించింది కేరళకు చెందిన 20 ఏళ్ల అరియా. దక్షిణ కొరియాకు చెందిన ఓ పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌లో చేరిన ఈ చిన్నది.. ‘కె-పాప్‌’లో చేరిన రెండో భారతీయురాలిగా కీర్తి గడించింది. గతేడాది ఒడిశాకు చెందిన శ్రేయా లెంకా తొలిసారి ఈ అరుదైన అవకాశం దక్కించుకోగా.. ఇప్పుడు అరియా వంతొచ్చింది. ఐదుగురు సభ్యులుగా ఉన్న ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కురాలైన అరియా గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..!

కేరళలో పుట్టిపెరిగిన అరియా అసలు పేరు గౌతమి. మలయాళీ కుటుంబానికి చెందిన ఆమె.. బాల నటి కూడా! 2011లో విడుదలైన ‘మెల్విలాసమ్‌’ అనే సినిమాలో బాల నటిగా కనిపించింది అరియా. చిన్న వయసు నుంచే సంగీతంలో మెలకువలు నేర్చుకున్న ఆమె.. కెరీర్‌లో పాప్‌స్టార్‌గా స్థిరపడాలనుకుంది. గతేడాది జీబీకే ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన MEP-C అనే మ్యూజిక్‌ గ్రూప్‌లో చేరి తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది అరియా.

ఐదో సభ్యురాలిగా చేరి..!

అమీ పేరుతో ఈ బృందంలో ట్రైనీగా చేరిన ఆమె.. గతేడాది చివర్లో తన పేరును అరియాగా మార్చుకుంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఆ బృందం నుంచి బయటికొచ్చేసిన అరియాకు.. ఎస్క్రో ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన ‘X:IN’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌లో అవకాశమొచ్చింది. ఈ అవకాశాన్ని స్వీకరించిన ఆమె.. ఐదుగురు సభ్యులుగా ఉన్న ఈ బృందంలో ఐదో మెంబర్‌గా చేరింది. వీరిలో కొరియాకు చెందిన రోయా, చి.యు; కొరియా-ఆస్ట్రేలియన్‌ ఇ.షా; రష్యాకు చెందిన నోవాలు ఇతర బృంద సభ్యులు. ఈ బృందంలో అరియానే పిన్న వయస్కురాలు. 1994-2003 మధ్య కాలంలో జన్మించిన వారినే ఈ బృందంలో చేర్చుకున్నారు. కాగా, ఒడిశాకు చెందిన శ్రేయా లెంకా తర్వాత భారత్‌ నుంచి కె-పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్లలో చోటు దక్కించుకున్న రెండో భారతీయురాలిగా నిలిచింది అరియా. ఇంగ్లిష్‌, కొరియన్‌, మలయాళం, హిందీ భాషలు అనర్గళంగా మాట్లాడగలదీ యంగ్‌ పాప్‌ స్టార్‌.

తొలి ప్రదర్శనతోనే ప్రశంసలు!

అరియా సభ్యురాలిగా ఉన్న ‘X:IN’ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఇటీవలే తన తొలి డిజిటల్‌ సింగిల్‌ని ప్రదర్శించింది. ‘ఇంకిగాయో’ అనే కొరియన్‌ మ్యూజిక్‌ షోలో భాగంగా ‘కీపింగ్‌ ది ఫైర్‌’ పేరుతో ప్రదర్శించిన ఈ పాప్‌ వీడియోకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వచ్చింది. ఇందులో తన ప్రతిభతోనే కాదు.. అందంతోనూ ఎంతోమంది మనసులు కొల్లగొట్టిందీ పాప్‌ బ్యూటీ. ‘ఒకప్పుడు నేను అభిమానించిన కె-పాప్‌ సంగీతంలోనే.. ఇప్పుడు సభ్యురాలిగా ప్రదర్శన చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి కల నెరవేరడం, తొలి ప్రదర్శనకే మంచి స్పందన రావడం ఓ మధురానుభూతి.. నా జర్నీలో మా కుటుంబ సభ్యులు-స్నేహితుల ప్రోత్సాహం ఎంతో!’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అరియా. తన కంటే ముందు ఒడిశాకు చెందిన శ్రేయా లెంకా గతేడాది ప్రసిద్ధి చెందిన కె-పాప్‌ బ్యాండ్‌ ‘బ్లాక్‌స్వాన్‌’లో చేరి చరిత్ర సృష్టించింది. ఆరుగురు సభ్యులున్న ఈ బృందం ఇప్పటికే పలు పాప్‌ వీడియోలు చేసి ప్రపంచవ్యాప్తంగా మన్ననలందుకుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్