గార్డెనింగ్‌లోనూ బేకింగ్ సోడా!

వంటింట్లో సాధారణంగా ఉపయోగించే వాటిలో బేకింగ్ సోడా ఒకటి. బజ్జీలు, కేక్‌ల రుచిని పెంచడానికి, అందాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, సహజసిద్ధమైన టూత్‌పౌడర్‌లా.. ఇలా చాలా రకాలుగా బేకింగ్ సోడా.....

Published : 18 Jul 2022 21:44 IST

వంటింట్లో సాధారణంగా ఉపయోగించే వాటిలో బేకింగ్ సోడా ఒకటి. బజ్జీలు, కేక్‌ల రుచిని పెంచడానికి, అందాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి, సహజసిద్ధమైన టూత్‌పౌడర్‌లా.. ఇలా చాలా రకాలుగా బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. అంతేకాదు.. గార్డెనింగ్‌లోనూ దీని పాత్ర కీలకమనే చెప్పుకోవచ్చు. మొక్కల్ని.. పూలని తాజాగా ఉంచడానికి, పూల కుండీలను శుభ్రపరచడానికి.. క్రిమిసంహారిణిగా బేకింగ్ సోడాను ఎక్కువగా వాడుతుంటారు. మరి, ఈ సహజసిద్ధమైన పదార్థం గార్డెనింగ్‌లో ఇంకెలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం రండి..

చీడపీడల నుంచి రక్షణకు..

మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పూల చెట్లకు, ఇతర మొక్కలకు తెగుళ్లు సోకితే ఎంతో బాధగా అనిపిస్తుంటుంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే బేకింగ్ సోడా ఉపయోగిస్తే సరి. ఇందుకు మూడు లీటర్ల నీటిలో నాలుగు చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొక్కలపై స్ప్రే చేస్తే.. వాటిని చీడపీడల నుంచి సంరక్షించుకోవచ్చు. అలాగే చిక్కుడు, గుమ్మడి, దోస.. వంటి మొక్కలకు సోకే తెగులును నివారించుకోవచ్చు. మూడు లీటర్ల నీటిలో బేకింగ్ సోడా, ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున వంట నూనె, డిష్‌వాష్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి వారానికి రెండుసార్లు మొక్కలపై పిచికారీ చేయాలి.

మట్టి గురించి తెలుసుకోవడానికి..

మనం గార్డెనింగ్‌లో ఉపయోగించే మట్టిని బట్టి కూడా మొక్కల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా గార్డెనింగ్‌లో ఉపయోగించే మట్టి పీహెచ్ స్థాయి 6 నుంచి 7 వరకు ఉండాలి. మరి, దీన్నెలా తెలుసుకోవాలి.. అని ఆలోచిస్తున్నారా? సింపుల్.. మట్టిపై కాస్త బేకింగ్ సోడా చల్లండి. ఈ సోడా నుంచి బుడగలు వస్తున్నట్లుగా అనిపిస్తే.. ఆ మట్టిలో పీహెచ్ స్థాయులు 5 కంటే తక్కువగా ఉన్నట్లు లెక్క. ఇలా హోమ్ గార్డెన్‌కి ఉపయోగించే మట్టి గురించి కూడా బేకింగ్ సోడా ద్వారా తెలుసుకోవచ్చు.

టొమాటోలు తియ్యతియ్యగా..

కొంతమందికి టొమాటోలు పుల్లగా ఉంటే ఇష్టం.. మరికొందరికి అవి తియ్యగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంటుంది. మీకూ తియ్యతియ్యటి టొమాటోలు తినాలనుందా..? అయితే బేకింగ్ సోడా అందుకు సహకరిస్తుంది. అదెలా అనుకుంటున్నారా..? ఆ మొక్క మొదళ్లలో ఉండే మట్టి పైన కాస్తంత బేకింగ్ సోడా చల్లినట్లయితే టొమాటోలు తియ్యగా ఉంటాయట. అలాగని మొక్కపై చల్లకూడదు.

గడ్డి పెరగకుండా..

మనం గార్డెన్‌ని అందంగా, సురక్షితంగా ఉంచడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనం నాటిన మొక్కల మధ్యలో కొంత గడ్డి పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు.. దాన్ని ఎంత తొలగించినా మళ్లీ మళ్లీ వస్తుంటుంది. దీనివల్ల అసలు మొక్కలకు హాని కలిగే ప్రమాదమూ లేకపోలేదు. కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే.. గుప్పెడు బేకింగ్‌సోడాని గడ్డిపై చల్లితే సరి.. ఆ గడ్డంతా చచ్చిపోతుంది.. అలాగే మళ్లీ గడ్డి పెరగకుండా అడ్డుకట్ట పడుతుంది.

ఇలా కూడా..

మన ఇంట్లో పెరిగే పెంపుడు జంతువులు గార్డెన్‌లోని మొక్కల్ని పాడుచేసే అవకాశం ఉంది. కాబట్టి అవి అటువైపు వెళ్లకుండా ఉండాలంటే.. గార్డెన్‌లోని మట్టిపై కాస్తంత బేకింగ్ సోడా చల్లి చూడండి. అలాగే కొన్ని మొక్కల మొదళ్లలో చీమలు, ఎలుకలు బొరియలు చేయడం.. వంటివి కూడా సాధారణంగా మనం గమనిస్తుంటాం. అలాంటప్పుడు అక్కడ కాస్తంత బేకింగ్ సోడా చల్లితే సమస్య పరిష్కారమవుతుంది.

ఇలా గార్డెన్‌లో పనంతా పూర్తయ్యే సరికి చేతులన్నీ తడిగా, మురికిగా తయారవుతాయి. ఇప్పుడు కాస్త బేకింగ్ సోడాని తీసుకొని చేతులకు రుద్దుకోండి.. ఆ తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చేతులకు అంటుకున్న మురికిని పారదోలడానికి సైతం బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్