అందుకే గుడ్డు.. సూపర్‌ఫుడ్‌..!

ఉడికించిన కోడిగుడ్డు, పాలు అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు ఇందులో నిక్షిప్తమై ఉండడమే ఇందుకు కారణం.

Updated : 13 Oct 2023 14:19 IST

ఉడికించిన కోడిగుడ్డు, పాలు అల్పాహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇతర అల్పాహారాల్లో లభించని పోషకాలు ఇందులో నిక్షిప్తమై ఉండడమే ఇందుకు కారణం. శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.. ఇవన్నీ కోడిగుడ్డులో పుష్కలంగా లభిస్తాయి. 'ప్రపంచ గుడ్డు దినోత్సవం' నేపథ్యంలో కోడిగుడ్డులో ఉండే పోషకాలేంటి? అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం రండి..

పోషకాలు ఇవీ!

ఉడికించిన కోడిగుడ్డు నుంచి రోజూ మన శరీరానికి అందే పోషకాల శాతం ఎంతో మీకు తెలుసా?

ఫోలేట్ - 5 శాతం

సెలీనియం - 22 శాతం

ఫాస్ఫరస్ - 9 శాతం

విటమిన్ ఎ - 6 శాతం

విటమిన్ బి2 - 15 శాతం

విటమిన్ బి5 - 7 శాతం

విటమిన్ బి12 - 9 శాతం

అలాగే 60 గ్రాముల కోడిగుడ్డు నుంచి ప్రొటీన్ - 7.9 గ్రాములు, శక్తి - 103 కేలరీలు, ఇనుము - 1.26 మి.గ్రా, ఫాస్ఫరస్  - 132 మి.గ్రా, క్యాల్షియం - 36 గ్రా, కొవ్వులు - 7.9 గ్రా లభిస్తాయి.

వీటితో పాటు క్యాల్షియం, జింక్.. వంటి ఖనిజాలు; బి6, డి, ఇ, కె.. విటమిన్లు కూడా కోడిగుడ్లలో సమృద్ధిగా లభిస్తాయి.

పిల్లలకు అందించే ఆహారంలో కోడిగుడ్డు తప్పనిసరిగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిలో ఉండే విటమిన్ ఎ; ల్యూటిన్, జియాక్సాంథిన్.. లాంటి యాంటీఆక్సిడెంట్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా కాపాడడంతో పాటు రేచీకటి నుంచి విముక్తి కలిగిస్తాయి.

ఒక కోడిగుడ్డులో 1.5 గ్రాముల పచ్చసొన, 213 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్, 75 క్యాలరీలు ఉంటాయి. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొలెస్ట్రాల్ 300 మిల్లీగ్రాములకు మించకూడదు. కాబట్టి రోజూ ఒక గుడ్డు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్‌లో అధిక మొత్తం లభించినట్లే.

జీవక్రియలు సక్రమంగా సాగడంతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి కోడిగుడ్డులోని ప్రొటీన్లే కారణం. అలాగే ఇందులో విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రొటీన్లు, ఖనిజాలు ఉండే కోడిగుడ్డు.. ఎముకలు, కండరాలు.. దృఢంగా తయారు కావడానికి తోడ్పడుతుంది. ఎత్తు పెరిగేందుకు సహాయపడుతుంది.

కోడిగుడ్డులోని తెల్లసొనలో ప్రొటీన్లు, నియాసిన్, రైబోఫ్లేవిన్, క్లోరిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, సల్ఫర్, జింక్.. వంటి ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ అధికంగా ఉంటాయి. వీటితో పాటు ఫోలికామ్లం, ఐరన్, క్యాల్షియం, కాపర్, సల్ఫర్‌లు కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా అవసరం. అలాగే గుడ్డులో లభించే ఐరన్ శరీరంలో సులభంగా కలిసిపోతుంది.

శరీరం, గుండె ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా - 3 ఫ్యాటీ ఆమ్లాలు గుడ్డులో అధిక మొత్తంలో ఉంటాయి.

ప్రయోజనాలెన్నో..

కోడిగుడ్డులో లభించే ఫోలేట్ పుట్టుకతో సంక్రమించే వ్యాధులను చాలావరకు తగ్గిస్తుంది.

ఉదయం పూట ఇతర అల్పాహారానికి బదులు గుడ్డు తీసుకునే వారు బరువు తగ్గుతారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. అలాగే గుడ్డులో ఉండే పెప్త్టెడ్స్ వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని కూడా రుజువైంది.

మరో విషయం ఏంటంటే.. మహిళల్లో ఎవరైతే రోజూ క్రమం తప్పకుండా కోడిగుడ్డును ఆహారంలో భాగం చేసుకుంటారో వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం 24 శాతం తక్కువని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనికి కారణం గుడ్డులో ఉండే కోలిన్ అనే పదార్థం. ఇది మెదడు, నాడీ మండలాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు కూడా చాలా అవసరం. ఒక గుడ్డు నుంచి 20 శాతం వరకు కోలిన్ లభిస్తుంది. ఇది కాలేయ జబ్బులు తగ్గించడంలో, ధమనులు దృఢంగా ఉండడానికి తోడ్పడుతుంది.

గుడ్డులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో మధుమేహం, ఎముకలకు సంబంధించిన సమస్యలు పొంచి ఉంటున్నాయి. అందువల్ల గుడ్డును ఆహారంలో చేర్చుకోవటం మంచిది.

ప్రొటీన్లతో నిండిన గుడ్డులో మనకు అవసరమైన అన్నిరకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్