బీపీని ఇలా అదుపులో ఉంచుకుందాం!

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మొదట్లోనే దీనిని గుర్తించి జాగ్రత్త పడకపోతే గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు దెబ్బతినడం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అయితే ఈ రక్తపోటును అదుపు చేసుకోవడం మన చేతుల్లోనే ఉందంటోంది అలనాటి అందాల నటి భాగ్యశ్రీ. సహజ పద్ధతిలో రక్తపోటును నియంత్రించుకోవడమెలాగో ఇన్‌స్టా ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది.

Published : 11 Jul 2021 12:24 IST

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటోన్న ఆరోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్‌) ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మొదట్లోనే దీనిని గుర్తించి జాగ్రత్త పడకపోతే గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు, కంటిచూపు దెబ్బతినడం.. వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవు. అయితే ఈ రక్తపోటును అదుపు చేసుకోవడం మన చేతుల్లోనే ఉందంటోంది అలనాటి అందాల నటి భాగ్యశ్రీ. సహజ పద్ధతిలో రక్తపోటును నియంత్రించుకోవడమెలాగో ఇన్‌స్టా ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది.

‘మైనే ప్యార్‌ కియా’ అంటూ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాను పాటించే సౌందర్య, ఆరోగ్య, ఫిట్‌నెస్‌ రహస్యాల్ని.. కుకింగ్‌ టిప్స్‌ని వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం కంటి ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు పంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా అధిక రక్తపోటును ఎలా నియంత్రించుకోవాలో చెప్పుకొచ్చింది.

ఈ చిట్కాతో..

‘అధిక రక్తపోటు ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తోన్న సమస్య. ముఖ్యంగా నగరాల్లో నివాసముండే వారు నిత్యం ఒత్తిడి, ఆందోళనతో సతమతమవుతుంటారు. అయితే దీన్ని అధిగమించడం మన చేతిలోనే ఉంది. ఇందుకోసం నా దగ్గర ఓ అద్భుత చిట్కా ఉంది. రక్తపోటు ప్రారంభ దశలో ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ‘పావు టీస్పూన్‌ దాల్చిన చెక్క పొడిని పావు టీస్పూన్‌ తేనెలో కలిపి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఆ తర్వాత 30 నిమిషాల పాటు ఏమీ తినకూడదు. తాగకూడదు. ఇలా రోజూ చేయడం వల్ల సిస్టోలిక్‌ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది’ అని తాజా వీడియోలో చెప్పుకొచ్చింది భాగ్యశ్రీ.

బీపీ చెక్‌ చేయించుకుందాం!

ఈ వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఆమె ‘జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం.. మన దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు రక్తపోటు బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే చనిపోతున్న వారిలో ఇదే ప్రధాన కారణమని ఈ సర్వే చెబుతోంది. అందుకే ఎప్పటికప్పుడు రక్తపోటును చెక్‌ చేయించుకుంటూ ఉండాలి’ అని రాసుకొచ్చింది.

షుగర్‌ అదుపులో..!

అదేవిధంగా దాల్చిన చెక్కతో కలిగే అదనపు ప్రయోజనాలను కూడా చెప్పుకొచ్చిందీ బ్యూటీ. అవేంటంటే..

* దాల్చిన చెక్క వల్ల రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి. ఫలితంగా శరీరంలో కొవ్వులు పేరుకుపోకుండా ఉండడంతో పాటు స్థూలకాయం, మధుమేహం.. వంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.

* ఇది ‘గ్రెలిన్‌’ అనే ఆకలి హార్మోన్‌ను అదుపులో ఉంచి బరువు తగ్గేలా చేస్తుంది.

* దాల్చిన చెక్కలోని హైడ్రాక్సీసినమాల్డిహైడ్‌ అనే సమ్మేళనం రక్తంలోని అనవసర కొవ్వులను తగ్గిస్తుంది.

* ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్