Updated : 24/09/2021 20:42 IST

చీర కట్టుకోవద్దు.. షార్ట్స్‌ వేసుకోవద్దు.. మహిళలు ఏది ధరించినా తప్పేనా?!

(Image for Representation)

మోడ్రన్‌ దుస్తులు వేసుకుంటే.. ఇలాంటి డ్రస్సింగ్‌ వల్లే అఘాయిత్యాలు జరుగుతున్నాయంటారు..

పద్ధతిగా చీర కట్టుకుంటే.. అది స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌ కాదంటారు.

ఇలా ఆడవాళ్లు ఏం చేసినా తప్పు పడుతుంది నేటి సమాజం. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అది వాళ్ల వల్లేనంటూ నిందలేస్తుంది. ఇక వాళ్లు ధరించే దుస్తుల విషయంలోనూ ఏదో ఒక లోపాన్ని ఎత్తి చూపి రచ్చకీడుస్తుంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే దిల్లీ రెస్టరంట్లో చోటు చేసుకుంది. చీర ధరించిందన్న నెపంతో ఓ మహిళను రెస్టరంట్లోకి అనుమతించకపోవడం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. మహిళల వస్త్రధారణపై నెలకొన్న వివక్షను మరోసారి ఎత్తిచూపింది. పురుషులు ఏం చేసినా మిన్నకుండే ఈ సమాజానికి మహిళలపై ఇంత కాఠిన్యం తగదంటూ ఎంతోమందిని స్పందింపజేసింది. ఇలా మహిళల డ్రస్‌ సెన్స్‌పై వివక్షను లేవనెత్తిన చేదు జ్ఞాపకాలు గతంలోనూ కొన్నున్నాయి.

ఫ్యాషన్స్‌పై ఉండే మక్కువ కావచ్చు.. ప్రొఫెషనలిజంలో భాగంగా కావచ్చు.. కుటుంబ విలువలు-ఆచార వ్యవహారాలు-అలవాట్ల వల్ల కావచ్చు.. ఇలా కారణమేదైనా ప్రతి ఒక్కరికీ వాళ్లకంటూ ప్రత్యేకమైన డ్రస్సింగ్‌ సెన్స్‌ ఉండడం సహజమే! దీంతో ఎక్కడికెళ్లినా వాళ్లు అలాంటి వస్త్రధారణను ఎంచుకోవడానికే ఇష్టపడుతుంటారు. అయితే ఇది నచ్చని కొందరు వాళ్లు ఎలాంటి అవుట్‌ఫిట్స్‌ ధరించినా ఏదో ఒక తప్పును ఎత్తిచూపి మరీ వారిని నిందిస్తుంటారు. దిల్లీకి చెందిన అనితా ఛౌదరి అనే మహిళా జర్నలిస్ట్‌కు కూడా తాజాగా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.


చీర స్మార్ట్‌ కాదట!

తన కూతురి పుట్టినరోజు వేడుకల్ని జరుపుకొనే క్రమంలో ఇటీవలే దిల్లీలోని ఓ రెస్టరంట్‌కి వెళ్లారు అనిత. సాధారణంగానే చీరను ఇష్టపడే ఆమె.. రెస్టరంట్‌కి వెళ్లే క్రమంలోనూ చీరనే ధరించారు. అయితే ఈ అవుట్‌ఫిట్‌ స్మార్ట్‌ కాదంటూ ఆమెను రెస్టరంట్లోకి అనుమతించలేదు. దీంతో ఆమె చీర ఫొటోలతో పాటు, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి.. తన ఆవేదనను ఇలా వెలిబుచ్చారు.

‘చీర స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌ కాదన్న నెపంతో దిల్లీలోని ఓ రెస్టరంట్‌ యాజమాన్యం నన్ను లోపలికి అనుమతించలేదు. మన దేశపు సంప్రదాయ వస్త్రధారణ అయిన చీర స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌ కాకపోవడమేంటో నాకైతే అర్థం కాలేదు. అకారణంగా జరిగిన ఈ అవమానం నా మనసును ఎంతో బాధపెట్టింది. మహిళకు చీర ఇచ్చినంత అందం మరే అవుట్‌ఫిట్‌ ఇవ్వదు..’ అంటూ పోస్ట్‌ పెట్టారామె.

ఈ ధోరణి మారాలి!

ఆ తర్వాత యూట్యూబ్‌లో మరో వీడియో అప్‌లోడ్‌ చేశారు అనిత. ‘నేను చీరకట్టులోనే పెళ్లి చేసుకున్నా. నాకు ఇద్దరు కూతుళ్లున్నారు. మా అందరికీ చీరంటే ఎంతో ఇష్టమైన అవుట్‌ఫిట్‌. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని మేమెంతో గౌరవిస్తాం. చీర ఎంతో అందమైన, ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్‌ అని నేను నమ్ముతాను. మన దేశపు సంప్రదాయ చీరకట్టును ఇప్పటికీ కొన్ని చోట్ల స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌గా పరిగణించట్లేదని ఈ సంఘటనే చెబుతోంది. ఈ ధోరణి మారాలి. ఇదే విషయమై నేను త్వరలోనే ప్రభుత్వ పెద్దల్ని కలుస్తాను..’ అంటూ చీరకట్టుపై తనకున్న మక్కువను చాటుకున్నారామె.

అలా అనడం సిగ్గుచేటు!

ఇలా అనిత పెట్టిన వీడియో క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడవాళ్ల దుస్తులపై ఎందుకింత వివక్ష అంటూ మరోసారి మహిళా సమాజం గళమెత్తేలా చేసింది. ఇదే వీడియోను రీపోస్ట్‌ చేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు చాలామంది మహిళలు. తమ చీరకట్టు ఫొటోల్ని పోస్ట్‌ చేస్తూ అనితకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో..

‘చీర స్మార్ట్‌ అవుట్‌ఫిట్‌ కాదని నిర్ణయించడానికి వాళ్లెవరు? విదేశాలకు వెళ్లినప్పుడు చీర ధరించే అక్కడి రెస్టరంట్లకు వెళ్లడం నాకు అలవాటు! చీరకట్టులో వచ్చానని అక్కడ నన్నెవరూ ఇలా ఆపలేదు. అలాంటిది మన దేశ సంప్రదాయ చీరకట్టు స్మార్ట్‌ కాదని అనడం వింతగా అనిపిస్తోంది..’ అంటూ ఒక మహిళ స్పందించారు.

‘భారతీయ మహిళల వస్త్రధారణపై ఉన్న వివక్షను ఈ సంఘటన ఎత్తి చూపుతోంది. ఇది చాలా సిగ్గుచేటు! దేశ సంప్రదాయ వస్త్రధారణను ప్రోత్సహించని ఏ రెస్టరంట్‌నూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి అనుమతివ్వకూడదు..’ అంటూ మరో నెటిజన్‌ రాసుకొచ్చారు.

అయితే ఈ ఘటనపై వివరణ ఇవ్వడంలో భాగంగా సదరు రెస్టరంట్‌ ఓ సుదీర్ఘ లేఖను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.. తమ రెస్టరంట్‌లో చీరకట్టును అనుమతించకూడదన్న నియమమేమీ లేదని, ఏదేమైనా జరిగిన దానికి మా టీమ్‌ తరఫున క్షమాపణలు చెబుతున్నామంటూ అందులో రాసుకొచ్చింది.


షార్ట్స్‌లో వచ్చిందని..!

మన దేశంలో ఎవరికి నచ్చిన దుస్తులు వాళ్లు ధరించే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయి. కానీ పొట్టి బట్టలు వేసుకొచ్చిందన్న నెపంతో ఓ 19 ఏళ్ల అమ్మాయిని పరీక్ష హాల్‌లోకి అనుమతించలేదు కళాశాల యాజమాన్యం. అసోంలోని గిరిజానంద చౌదరి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌ (జీపీఐఎస్‌) భవనంలో అసోం అగ్రికల్చర్‌ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (ఏఏయూ) రాయడానికి వచ్చింది 19 ఏళ్ల జూబ్లీ. షార్ట్స్‌ ధరించి తన తండ్రితో పాటు అక్కడికొచ్చిన ఆమెను డ్రస్సింగ్‌ కారణంగా పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. దాంతో విధి లేక కర్టెన్‌ చుట్టుకొని పరీక్షకు హాజరైందామె. ఇలా అక్కడ ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకుంది జూబ్లీ.

‘సెంటర్‌ లోపలికి వెళ్లేందుకు సెక్యూరిటీ గార్డ్స్ అనుమతించారు. అయితే పరీక్ష హాల్‌లోకి వెళ్తుంటే షార్ట్స్‌ ధరించానని చెప్పి ఇన్విజిలేటర్‌ నన్ను పరీక్ష రాయనివ్వకుండా ఆపేశారు. దీంతో ఏడ్చుకుంటూ బయట ఉన్న మా నాన్నతో జరిగిందంతా చెప్పా. పరీక్ష రాసేలా చూడమని ఎగ్జామ్స్‌ కంట్రోలర్‌ని అడిగితే.. ప్యాంట్స్‌ వేసుకొస్తే తప్ప లోపలికి రానివ్వమని తేల్చి చెప్పారు. దాంతో నాన్న 8 కిలోమీటర్లు ప్రయాణించి ట్రౌజర్‌ కొనుక్కొచ్చారు. ఈ లోపే నాకు కర్టెన్‌ చుట్టి పరీక్ష రాయించారు. నా జీవితంలో ఇలాంటి అవమానం నాకెప్పుడూ ఎదురుకాలేదు.. గతంలో నీట్ పరీక్షకు కూడా నేను ఇదే డ్రస్‌లో వెళ్లాను. కానీ అక్కడ ఎవరూ నన్ను ఇలా ఆపలేదు..’ అంటూ తన ఆవేదనను పంచుకుందామె. ఈ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ‘అయినా దుస్తుల పొడవును బట్టి అమ్మాయి ప్రవర్తనను, తన సంప్రదాయాన్ని ఎలా అంచనా వేస్తారు?’ అంటూ చాలామంది జూబ్లీకి అండగా నిలిచారు.


రచ్చరచ్చ చేసిన ‘రిప్డ్‌ జీన్స్’!

వస్త్రధారణను బట్టి ఆడవాళ్ల వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను అంచనా వేయడం సరికాదు. అసభ్యతకు తావు లేకుండా తమకు అసౌకర్యం, ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు వేసుకున్న దుస్తులపై కామెంట్‌ చేసే హక్కు, అధికారం ఎవరికీ లేదు. అయితే కొంతమందికి మాత్రం ఆడవాళ్లు ఫ్యాషనబుల్‌గా తయారైనా ఓర్చుకోలేరు. ఏదో ఒక సాకుతో వాళ్ల డ్రస్సింగును తప్పు పడుతుంటారు. మొన్నామధ్య వివాదాస్పదమైన ‘రిప్డ్‌ జీన్స్‌’ ఘటనే ఇందుకు నిదర్శనం!

ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ రావత్‌.. ‘కొన్ని రోజుల క్రితం విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో నా పక్కన కూర్చున్న ఓ మహిళ మోకాళ్లు కనిపించేలా రిప్డ్‌ జీన్స్‌ ధరించింది. ఆమె భర్త ప్రతిష్ఠాత్మక జేఎన్‌యూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను సైతం నిర్వహిస్తోంది. కానీ టోర్న్‌ జీన్స్‌ ధరించి సభ్య సమాజానికి ఆమె ఏం సందేశమిచ్చినట్లు?’ అంటూ హేళనగా మాట్లాడారు. ఈ వీడియో వైరలవడంతో మహిళలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సెలబ్రిటీల దగ్గర్నుంచి సామాన్యుల దాకా ఎంతోమంది మహిళలు తాము రిప్డ్‌ జీన్స్‌ ధరించిన ఫొటోల్ని పోస్ట్‌ చేస్తూ.. ‘ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి కామెంట్లు చేయడమేంటి.. మా వస్త్రధారణను మార్చడం కంటే ముందు మీరు మీ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని మార్చుకోండి..’ అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు.

అయితే ఆ తర్వాత తీరథ్‌ ఈ విషయంపై క్షమాపణ చెప్పినా.. ఈ తరహా డ్రస్సింగ్‌ కరక్ట్‌ కాదన్న వాదననే కొనసాగించడం గమనార్హం!


పనిమనిషిలా ఉన్నావన్నారు!

చీరకట్టు దేశ సంప్రదాయ అవుట్‌ఫిటే అయినా.. ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను బట్టి కొన్ని ప్రత్యేకమైన దుస్తులు ఉంటాయి. అయితే ఈ డ్రస్సింగ్‌ పద్ధతిని గౌరవించకపోగా.. చులకనగా చూడడం, అవి వేసుకున్న మహిళలపై వివక్ష చూపించడం.. వంటి సంఘటనలూ లేకపోలేదు.

గతంలో ఓసారి నివేదితా బర్తకుర్‌ అనే అసోం వ్యాపారవేత్తను దిల్లీ గోల్ఫ్‌ క్లబ్‌ వారు లంచ్కి ఆహ్వానించారు. అయితే ఈ పార్టీకి ఆమెతో పాటే ఆమె వద్ద పనిచేసే తైలిన్ లింగ్డో అనే మహిళ కూడా వెంట వెళ్లింది. మేఘాలయకు చెందిన ఆమె.. ఈ క్రమంలో తన రాష్ట్ర సంప్రదాయమైన ఖాసీ డ్రస్‌/Jainsem ధరించింది. అందరూ లంచ్‌కి కూర్చున్న సమయంలో క్లబ్‌కు చెందిన ఇద్దరు తైలిన్‌ వద్దకు వచ్చి.. మీరు ఇక్కడ్నుంచి వెళ్లిపోండి అన్నారు. ఎందుకని ఆమె అడిగితే.. ‘మీ దుస్తులు అచ్చం పనిమనిషి దుస్తుల్లా ఉన్నాయి.. మీరు కూడా అలాగే ఉన్నారు..’ అన్నారని ఆ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో ఆమె యజమాని నివేదిత ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజుజు దృష్టికి తీసుకెళ్లడంతో పాటు విమర్శలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంది. ఎట్టకేలకు దిగొచ్చిన క్లబ్‌ నిర్వాహకులు సదరు మహిళకు క్షమాపణలు చెప్పారు. కిరణ్‌ రిజుజు కూడా దీన్ని జాతి వివక్షగా వర్ణిస్తూ ఖండించారు.

ఇవే కాదు.. వదులు హెయిర్‌స్టైల్‌ కాకుండా జడే వేసుకోవాలని, మోకాళ్ల కింది వరకున్న దుస్తులే ధరించాలని, ఫ్యాషనబుల్‌ దుస్తులు కాకుండా చీరలే కట్టుకోవాలని.. ఇలా మహిళలు/అమ్మాయిలపై ఆయా కళాశాలలు, సంస్థలు హుకుం జారీచేయడం.. అవి కాస్తా వివాదాస్పదమవడం మనం ఇదివరకే చూశాం.

అయినా మనలో మన మాట.. ఎలాంటి దుస్తులు వేసుకున్నా, ఎలా మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా.. మగవాళ్లను తప్పు పట్టని ఈ సమాజం ప్రతి విషయంలోనూ మహిళల్ని ఎందుకు చులకనగా చూస్తుందో అర్థం కాదు. అసభ్యతకు తావు లేకుండా తమకు అసౌకర్యం, ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు ఎలాంటి ఫ్యాషన్లనైనా ఫాలో అయ్యే హక్కు, అధికారం అమ్మాయిలకు/మహిళలకు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం.. ఏదో ఒకలా మహిళల్ని ఇబ్బంది పెట్టాలన్న వారి ధోరణికి అద్దం పడుతుంటుంది.. మరి, ఈ విషయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి..


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి