ఎగ్జామ్స్ భయం పోగొట్టండిలా!

పిల్లలకు ఏడాదంతా చదివింది ఒకెత్తయితే, వార్షిక పరీక్షలు మరో ఎత్తు. పరీక్షల షెడ్యూల్ ఇలా వచ్చిందో లేదో అలా చిన్నారుల్లో అలజడి మొదలైపోతుంది. దాంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా పరీక్షల్లో విఫలమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి పరీక్షలు సమీపిస్తున్నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ.....

Updated : 03 May 2022 21:06 IST

పిల్లలకు ఏడాదంతా చదివింది ఒకెత్తయితే, వార్షిక పరీక్షలు మరో ఎత్తు. పరీక్షల షెడ్యూల్ ఇలా వచ్చిందో లేదో అలా చిన్నారుల్లో అలజడి మొదలైపోతుంది. దాంతో ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా పరీక్షల్లో విఫలమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి పరీక్షలు సమీపిస్తున్నా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఎగ్జామ్స్‌లో విజయం సాధించాలంటే చిన్న చిన్న చిట్కాలు దృష్టిలో ఉంచుకుంటే చాలు.. ఎగ్జామ్ హాల్లో సులువుగా సమాధానాలు రాసి విజయం సాధించచ్చంటున్నారు నిపుణులు. ఈ పరీక్షల సీజన్లో ఆ చిట్కాలేంటో తెలుసుకొని మీ చిన్నారులకు అందిస్తే వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో దోహదపడిన వారవుతారు.

ఆఖరి నిమిషంలో ఒత్తిడా?

పరీక్షలకు కనీసం నెల, రెండు నెలల ముందుగానే రివిజన్ మొదలుపెట్టడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఎంత చదివినా, అన్ని అంశాల్ని ఎంతగా ఔపోసన పట్టినప్పటికీ కొందరు విద్యార్థుల్లో లాస్ట్ మినిట్ ప్రెషర్ ఉంటుంది. అంటే రేపు పరీక్ష ఉందనగా 'అయ్యో.. రేపే పరీక్ష.. ఎలా రాస్తానో ఏమో? నేను అనుకున్న మార్కులు వస్తాయో లేదో?' ఇదిగో ఇలా ఒత్తిడికి గురై భయపడిపోతుంటారు. దీనివల్ల బాగా చదివి బుర్రలో పెట్టుకున్నదంతా హుష్‌కాకి అయిపోతుంది. అదే భయంతో ఎగ్జామ్ హాల్లోకి వెళ్తే ప్రశ్న పత్రం చూసి అటూ ఇటూ చూడడం తప్ప దానికి అసలు సమాధానమేంటో గుర్తుకు రాదు.

కాబట్టి విద్యార్థులంతా ఇలాంటి ఆఖరి నిమిషంలో ఎదురయ్యే ఒత్తిడిని ముందుగా జయించాల్సి ఉంటుంది. ఇందుకోసం పరీక్ష ముందు రోజు రాత్రుళ్లు ఎక్కువ సేపు మెలకువగా ఉండి చదువుకోవడం, బట్టీ పట్టే విధానాలు, టెన్షన్.. వంటివన్నీ తగ్గించుకొని, 'అన్నీ చదివానుగా.. పరీక్ష బాగా రాస్తా..' అన్న ఆత్మవిశ్వాసాన్ని గుండెల్లో నింపుకోవాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా రాయాలి అని సతాయించకుండా, 'నువ్వు బాగా రాయగలవు.. ఆ సత్తా నీలో ఉంది..' అంటూ వెన్నుతట్టాలి. తద్వారా వారు మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే అవకాశముంటుంది.

అలా తిరగేయాలి..

కొంతమంది పిల్లలు పరీక్షలంటేనే చదువుతారు. మిగతా సమయాల్లో ఆటపాటలతో కాలాన్ని వృధా చేస్తుంటారు. అలాంటివారికి ఇక పరీక్ష రేపనగా ఏం చదవాలో అర్థం కాదు. ఇలాంటప్పుడే వారిలోని సమయస్ఫూర్తిని వెలికి తీయాలి. పరీక్షకు ఒకట్రెండు రోజుల ముందు చదివే వారు సైతం కొన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకుంటే చక్కటి మార్కులు స్కోర్ చేయచ్చు.

పాఠాలు వింటున్న క్రమంలో నోట్ చేసుకున్న కొన్ని ముఖ్యమైన పాయింట్లు, టీచర్లు చెప్పే నోట్స్.. వంటివన్నీ పిల్లల దగ్గర అందుబాటులోనే ఉంటాయి కదా! వాటిని ఓసారి తిరగేయమని చెప్పాలి. తిరగేయడమంటే ఆ టాపిక్‌కు సంబంధించిన కాన్సెప్ట్ ఏంటో క్లుప్తంగా తెలుసుకోమనాలి. ఈ విషయంలో పిల్లలకు పేరెంట్స్ సహాయపడితే వారికి ఆ కాన్సెప్ట్ గురించి బాగా గుర్తుంటుంది. ఇలా చేయడం వల్ల పరీక్షల భయం కూడా తగ్గుతుంది. తద్వారా తక్కువ సమయంలోనే ఆ సబ్జెక్ట్‌పై పట్టు సాధించి మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశముంది.

పేజీలకు పేజీలు వద్దు..

కొంతమంది పిల్లలు పరీక్షలంటే చాలు.. పేజీలకు పేజీలు సమాధానాలు రాస్తూనే ఉంటారు. అందులో కాన్సెప్ట్ లేకపోయినా కనీసం పేజీకొక్క మార్కు అయినా పడకపోదా అనుకునే వారూ లేకపోలేదు. అలా చేయడం అస్సలు సరి కాదు. అంత పెద్ద పెద్ద సమాధానాలు పేజీలకు పేజీలు రాయడం వల్ల ఆన్సర్ షీట్ దిద్దే వారికి విసుగొచ్చేస్తుంది. తద్వారా ఎంత బాగా రాసినా ఎక్కువ మార్కులు పొందలేరు.

కాబట్టి ఎక్కువ పేజీలు జవాబులతో నింపాలన్న కాన్సెప్ట్‌ని మర్చిపోవాలని పిల్లలకు చెప్పాలి. ఒక ప్రశ్నకు సంబంధించి ఎన్ని ముఖ్యమైన పాయింట్లు రాయగలమో అంచనా వేసుకోవాలి. ఇందుకోసం పరీక్ష హాలుకు వెళ్లగానే కూల్‌గా, పాజిటివ్ మైండ్‌తో ఉండమని చెప్పాలి. ప్రశ్నపత్రం ఇవ్వగానే అందులో బాగా ఆన్సర్ చేయగలం అన్న ప్రశ్నల్ని టిక్ చేసుకొని వాటికి సంబంధించిన జవాబుల్ని రాయడానికి ప్రయత్నించాలి. అందులోనూ ముఖ్యమైన పాయింట్లు రాస్తూ అవసరం ఉన్న చోట బుల్లెట్ పాయింట్స్, నంబర్లు వేయడం.. వంటివి పేపర్ దిద్దేవారికి విద్యార్థులపై మంచి ఇంప్రెషన్ పడేలా చేస్తాయి. దీంతో జవాబు చిన్నగా ఉన్నా మంచి మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాని ప్రశ్నల కోసం పాకులాడకుండా వచ్చిన వాటిని సంపూర్ణంగా రాసి జవాబు పత్రం దిద్దే వారి మనసు గెలుచుకోమని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

కొట్టివేతలు వద్దు..

పరీక్ష రాసేటప్పుడు జవాబుల్లో ఎక్కడో ఒక చోట చిన్న చిన్న తప్పులు దొర్లడం లేదంటే ఒకట్రెండు లైన్లు కొట్టేయాల్సి రావడం.. వంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు అవి జవాబు పత్రం దిద్దే వారి కంట పడకూడదని ఆ లైన్లు కనిపించకుండా కొట్టేస్తుంటారు కొందరు విద్యార్థులు. అలా చేయడం వల్ల ఆ పేజీ లుక్ తగ్గిపోతుంది. తద్వారా సమాధానం ఎంత బాగా రాసినా ఫలితం ఉండదు. కాబట్టి ఎక్కడైనా పొరపాటు అనిపిస్తే ఆ పదం లేదా లైన్ మీద నుంచి ఒక్క గీత గీయడం లేదంటే బాక్స్‌గా పెట్టి దానిపై నుంచి ఒక్క గీత గీయడం వంటివి చేయడం మంచిది. తద్వారా పేపర్ కరెక్షన్ చేసే వారికి విద్యార్థిపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. తప్పును పట్టించుకోకుండా రాసిన సమాధానానికి మంచి మార్కులు వేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటే పొరపాటు దొర్లినా మార్కులు తగ్గకుండా జాగ్రత్తపడచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్