గార్డెన్‌ లేకపోయినా.. పచ్చదనాన్ని ఇలా ఆస్వాదించచ్చు!

అలసిపోయినా, ఒత్తిడికి గురైనా.. కాసేపు పచ్చటి మొక్కల మధ్య సేదదీరితే ఆ హాయే వేరు! అందుకే ఎప్పుడైనా మూడ్ బాగుండకపోతే..  ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసుకున్న గార్డెన్‌లో గడుపుతుంటాం. తద్వారా మనసు పునరుత్తేజితమవడంతో పాటు అలసట కూడా దూరమవుతుంది.

Published : 19 Aug 2023 19:57 IST

అలసిపోయినా, ఒత్తిడికి గురైనా.. కాసేపు పచ్చటి మొక్కల మధ్య సేదదీరితే ఆ హాయే వేరు! అందుకే ఎప్పుడైనా మూడ్ బాగుండకపోతే..  ఇంటి ఆవరణలో ఏర్పాటుచేసుకున్న గార్డెన్‌లో గడుపుతుంటాం. తద్వారా మనసు పునరుత్తేజితమవడంతో పాటు అలసట కూడా దూరమవుతుంది. అలాగని ప్రతి ఇంట్లో గార్డెన్ ఉండాలని లేదు.. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై ఆసక్తి చూపకపోవచ్చు. అయినా పచ్చదనాన్ని ఆస్వాదించాలంటే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

పార్కుకు వెళ్లండి!

రోజూ ఉదయం లేదా సాయంత్రం వీలు చూసుకొని కాసేపు వ్యాయామం చేయడం చాలామందికి అలవాటు! ఇదే విధంగా దగ్గర్లోని పార్కుకు వెళ్లడం కూడా రోజువారీ అలవాటుగా మార్చుకోమంటున్నారు నిపుణులు. అదీ కుదరకపోతే పార్కులోనే వ్యాయామాలు చేసేలా ప్లాన్‌ చేసుకోవచ్చు. తద్వారా ఇటు వ్యాయామం చేసినట్లవుతుంది.. అటు పచ్చదనం మధ్య కాసేపు గడిపినట్లుగానూ ఉంటుంది. అంతేకాదు.. పక్షుల కిలకిలారావాలు, ఫౌంటెయిన్స్‌ శబ్దాలు.. వంటివన్నీ మనసుకు ఆహ్లాదాన్ని పంచేవే! కాబట్టి కుటుంబమంతా కలిసి రోజూ ఓ అరగంట పార్కులో గడిపేలా సమయం కేటాయించుకోండి. ఇలా రోజూ కాసేపు ప్రకృతితో గడపడం వల్ల దీర్ఘాయుష్షే కాదు.. పనిలో నాణ్యత, పిల్లల్లో ప్రతిభ పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

మొక్కలతో ఖుషీగా!

కొంతమంది ఇంట్లో తగినంత ప్రదేశం లేకపోవడం వల్ల గార్డెనింగ్‌ చేసుకోలేకపోతారు. అలాంటి వారు చిన్న చిన్న మొక్కలతో ఇంటి ముంగిలిని అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.. ఇంట్లోనూ కొన్ని ఇండోర్‌ మొక్కల్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే పిల్లలు చదువుకునే గదిలో, మీ హోమ్‌ ఆఫీస్‌లోనూ కొన్ని మొక్కల్ని అమర్చుకుంటే.. ఇల్లంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది. పైగా ఈ చిన్న మొక్కల్ని మెయింటెయిన్‌ చేయడం కూడా సులువు. అయితే ఈ క్రమంలో తీగలా విస్తరించేవి, పరిమళాలు వెదజల్లేవి, అందం కోసం ఏర్పాటు చేసుకునేవి.. ఇలాంటి మొక్కల్ని పెంచుకుంటే.. ఇటు పచ్చదనంతో పాటు.. అటు అలంకరణ చేసినట్లుగానూ ఉంటుంది.

గోడలకు ‘గ్రీనరీ’ హంగులు!

ఇంట్లో గార్డెన్‌ ఏర్పాటు చేసుకునేంత ఖాళీ ప్రదేశం లేదా? మొక్కలు పెంచుకునేంత తీరికా లేదా? అయినా పచ్చదనాన్ని ఆస్వాదించచ్చు.. అదెలాగంటే..? గోడలకు గ్రీనరీ హంగులద్దుతూ! ఇందులో భాగంగా ప్రకృతి/పక్షులు/అడవులు/జలపాతాలు.. ఇలా బయట దొరికే వాల్పేపర్లను తెచ్చుకొని ఇంట్లో గోడలకు అతికించుకోవచ్చు. మరింత న్యాచురల్‌ లుక్‌ కావాలనుకునే వారు గోడలకు వాల్‌ ఆర్ట్‌ వేయించుకోవచ్చు. పచ్చదనానికి సంబంధించిన సీనరీలు/ఫొటోల్నీ గోడకు అక్కడక్కడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక మరింత మోడ్రన్‌గా కావాలనుకునే వారు.. ఇండోర్‌ వాల్‌ గార్డెన్‌ ట్రెండ్‌ను ఫాలో అవ్వచ్చు. గోడ పైనే మొక్కల్ని పెంచుకునే అవకాశమున్న ఈ ట్రెండ్‌ని ఇప్పుడు చాలామంది పాటిస్తున్నారు. అలాగే పార్కుల్లో పెంచుకునే చిన్న గడ్డిని గోడ పైన వివిధ ఆకృతుల్లో/డిజైన్లలో పెరిగేలా ఏర్పాటు చేసుకోవడం లేదంటే అలాంటి ఫ్రేమ్‌లను గోడలకు అమర్చుకోవడం.. వంటివి చేస్తే ఇంటి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది.. అతిథుల్నీ ఆకట్టుకోవచ్చు.

పూలంటే ఇష్టమా?

పువ్వులు, వాటి పరిమళాల్ని ఇష్టపడే వారు.. పూల మొక్కలతోనే గార్డెన్‌ ఏర్పాటు చేసుకుంటుంటారు. అలాంటి వారు గార్డెనింగ్‌ చేసుకునే వెసులుబాటు లేకపోతే.. నచ్చిన పూల మొక్కల్ని ఇంట్లో ఉన్న కాస్త ప్రదేశంలో పెంచుకోవచ్చు.. లేదంటే అచ్చం పూల మాదిరిగా కనిపించే ఆర్టిఫిషియల్‌ పూల మొక్కల్ని ఇంట్లో అమర్చుకోవచ్చు. ఇలా వీటి రంగులూ మనసులోని ఒత్తిళ్లను దూరం చేసి ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే రోజుకో రకం పూలతో ఫ్లవర్‌వేజ్‌లను ఇంట్లో అక్కడక్కడా అమర్చుకున్నా.. ఇంటికి అందం, మనసుకు ప్రశాంతత.. రెండూ సొంతమవుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్