పిల్లల కోసం ప్లానింగా? ఇవి పరిశీలించండి.!

పెళ్త్లెన ప్రతి జంటా తమ ముంగిట్లో పాలనవ్వులతో ఓ బుజ్జి పాపాయి తిరగాడుతుంటే బాగుంటుందని భావిస్తారు. ఇంకొంతమంది దంపతులు పిల్లల కోసం కొంతకాలం వేచి చూడాలనుకుంటారు. ఏదేమైనా సరే.. ముద్దులొలికే బుజ్జాయిల రాక దంపతులిద్దరి జీవితంలోనూ కొంగొత్త మార్పులను తీసుకొస్తుంది. అయితే ఈ మార్పులకు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? అన్నది సరిచూసుకుంటేనే ఇప్పుడే పిల్లలు కావాలా వద్దా అన్నది నిర్ణయించుకోగలుగుతాం.

Updated : 27 Jul 2021 16:28 IST

పెళ్త్లెన ప్రతి జంటా తమ ముంగిట్లో పాలనవ్వులతో ఓ బుజ్జి పాపాయి తిరగాడుతుంటే బాగుంటుందని భావిస్తారు. ఇంకొంతమంది దంపతులు పిల్లల కోసం కొంతకాలం వేచి చూడాలనుకుంటారు. ఏదేమైనా సరే.. ముద్దులొలికే బుజ్జాయిల రాక దంపతులిద్దరి జీవితాల్లో కొంగొత్త మార్పులను తీసుకొస్తుంది. అయితే ఈ మార్పులకు మనం సిద్ధంగా ఉన్నామా? లేదా? అన్నది సరిచూసుకుంటేనే ఇప్పుడే పిల్లలు కావాలా వద్దా అన్నది నిర్ణయించుకోగలుగుతాం. ఇలా సంతానం కోసం ప్రయత్నించే ముందు ప్రతి జంటా ఆలోచించాల్సిన విషయాలు కొన్నున్నాయి. మరి, అవేంటి?? వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతవరకు ఉంది.. మొదలైన అంశాల గురించి మనమూ తెలుసుకుందాం రండి..

మీ దాంపత్యం ఎలా ఉంది?

బిడ్డ కోసం ఆలోచించే ముందు దంపతులిద్దరూ పరస్పరం ఒకరినొకరు ఎంత వరకు అర్థం చేసుకున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ ఇద్దరూ ఒకరి గురించి మరొకరు పూర్తిగా తెలుసుకొని, ఎలాంటి గొడవలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే పిల్లల గురించి ఆలోచించాలి. ఇద్దరి మధ్యా అభిప్రాయ భేదాలతో తగువులు కొనసాగుతున్నప్పుడు 'పిల్లల్ని కంటే గొడవలు అవే సర్దుకుంటాయి.. వాళ్లే బంధాన్ని కలిపి ఉంచుతారు..' అనుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు. మీ బంధాన్ని పిల్లలు ఎప్పటికీ కాపాడలేరు. అంతా సజావుగా సాగితే ఫర్వాలేదు. కానీ ఈ గొడవలు ఇలాగే కొనసాగి భవిష్యత్తులో మీ ఇద్దరికీ పడకపోతే విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఇద్దరు కాదు.. ముగ్గురు బాధపడాల్సి వస్తుంది. మీ పిల్లలకు అలాంటి బాధాకరమైన పరిస్థితి కల్పించాలా? ముందే ఆలోచించండి. ఇద్దరి మధ్యా గొడవలన్నీ సద్దుమణిగాకే పిల్లల గురించి ఆలోచించండి.

ఆర్థిక స్థితి

ఒక బిడ్డ మన జీవితంలోకి వస్తుందంటే కొండంత ఆనందంతో పాటు బోలెడంత ఖర్చును కూడా మోసుకొస్తుంది. గర్భం ధరించిన నాటి నుంచి పిల్లలు పుట్టిన తర్వాత దాదాపు ఐదేళ్ల వరకూ ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. పిల్లల వస్తువులు, దుస్తులు, డైపర్లు లాంటివి మాత్రమే కాదు.. వారి వైద్యానికి అయ్యే ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మీరు ఈ ఖర్చును భరించగలిగే స్థితిలో ఉన్నారా? లేదా? అన్నది ముందే గమనించుకోవాలి. ఆర్థిక స్థితి విషయంలో దృష్టిలో పెట్టుకోవాల్సిన మరో అంశం- ఇద్దరిలో ఒకరి జీతంతోనే కొన్నాళ్లు సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడడం. ప్రస్తుతం చాలా సంస్థలు మెటర్నిటీ లీవ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. కానీ ఆ లీవ్ సరిపోకపోవచ్చు. దీంతో ఆఫీసుకు అన్‌పెయిడ్ లీవ్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు 'తగ్గిన ఆదాయంతో పెరిగిన ఖర్చులను తట్టుకోగలిగే శక్తి మీకుందా?' అన్నది గమనించాల్సిన విషయం. ఇవే కాదు.. తిరిగి ఆఫీసుకు వెళ్తున్నా.. బిడ్డను చూసుకోవడానికి ఓ మనిషిని పెట్టుకోవడం లేదా వారిని బేబీకేర్ సెంటర్‌లలో వదిలేయడం ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. వీటి గురించి కూడా ఆలోచించుకొని ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

కెరీర్ ముఖ్యమా?

ప్రస్తుతం మగవారితో సమానంగా పనిచేయడం మాత్రమే కాదు.. కొన్ని రంగాల్లో వారి కంటే ముందంజలో ఉంటున్నారు మహిళలు. ఇటు ఇంటిని, అటు ఆఫీసులో పనిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో మహిళలు ఎంత ఒత్తిడికి గురవుతారో వారికి మాత్రమే తెలుసు. ఇటు కుటుంబానికి కావాల్సిన ప్రతిఒక్కటీ చూసుకుంటూ అటు ఆఫీసులో బాధ్యతలను కూడా సమర్థంగా నెరవేర్చగలగడం కత్తి మీద సాములాంటిదే. ఇలాంటప్పుడే రెండింటిలో ఏదో ఒకదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. అందుకే పిల్లల్ని కనాలనుకునే ముందు మీ కెరీర్‌లో మీరు ప్రస్తుతం ఉన్న స్థానం గురించి ఆలోచించండి. త్వరలోనే మీకు ప్రమోషన్ రాబోతోందా? అయితే అది వచ్చేవరకూ మీ ప్లానింగ్ కొన్నాళ్లు వాయిదా వేయండి. ఎందుకంటే మీరు మెటర్నిటీ లీవ్‌లో వెళ్లినప్పుడు మీ సహోద్యోగులే మీకు పోటీదారులై మీకంటే పైస్థానాలకు వెళ్లిపోయే అవకాశం లేకపోలేదు. అందుకే కెరీర్ గురించి కూడా ఒకసారి ఆలోచించి ఆ తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఆరోగ్యం కూడా..

ప్రతిఒక్కరూ తాము ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటారు. అయితే గర్భం దాల్చబోయే మహిళ తాను ఆరోగ్యంగా ఉండడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. దీనికోసం బరువు పెరగకుండా జాగ్రత్తపడడం, బీపీ, షుగర్ లాంటివి ఉంటే వాటిని అదుపులో పెట్టుకోవడం తప్పనిసరి. ఏవైనా అనారోగ్య పరిస్థితులుంటే వాటికి తగిన చికిత్స తీసుకున్న తర్వాతే పిల్లల కోసం ప్రయత్నించాలి. పీసీఓఎస్‌, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉంటే గర్భధారణలో, గర్భం ధరించిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటివి కూడా ముందుగానే అదుపులోకి తెచ్చుకోవాలి. ఎక్సర్‌సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉండడం వల్ల గర్భం ధరించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. ఇక రోజూ మూడు పూటలా సమతులాహారం తీసుకోవడం, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, విటమిన్ డి లెవెల్స్ సరైన స్థాయిలో ఉండేలా చూసుకోవడం వంటివి చేస్తుండాలి. ఇలా ఆరోగ్యం మొత్తం బాగుందనుకున్న తర్వాతే పిల్లల కోసం ఆలోచించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్